డ్రగ్ లార్డ్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ 'ఎల్ మెంచో' హతం
ABN , Publish Date - Feb 23 , 2026 | 07:33 AM
మెక్సికో, అమెరికా దేశాలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న 'ఎల్ మెంచో' ఎట్టకేలకు హతమయ్యాడు. అతడ్ని పట్టుకోవడానికి మెక్సికన్ స్పెషల్ ఫోర్సెస్ జరిపిన ఒక ఆపరేషన్ యుద్ధరంగంలా మారింది.
ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 23: మెక్సికోలో అత్యంత శక్తివంతమైన డ్రగ్ మాఫియా నాయకుడు, 'జలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్' (CJNG) అధినేత నెమెసియో ఒసెగ్వెరా సెర్వాంటెస్ (Nemesio Oseguera Cervantes) అలియాస్ 'ఎల్ మెంచో' (El Mencho) మృతిచెందాడు. మెక్సికన్ సైన్యం జరిపిన భారీ ఆపరేషన్‌లో ఎల్ మెంచో హతమయ్యాడు. ఫిబ్రవరి 22, 2026 ఆదివారం నాడు జరిగిన ఈ ఘటన అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది.
భారీ ఆపరేషన్.. మెక్సికో డ్రగ్ లార్డ్ 'ఎల్ మెంచో' హతం
మెక్సికో, అమెరికా దేశాలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న ఎల్ మెంచోను పట్టుకోవడానికి మెక్సికన్ స్పెషల్ ఫోర్సెస్ జరిపిన ఆపరేషన్ యుద్ధరంగంలా మారింది. పశ్చిమ మెక్సికోలోని జలిస్కో రాష్ట్రంలో ఉన్న తపల్ప (Tapalpa) అనే పట్టణంలో సైన్యం ఈ దాడులు నిర్వహించింది. ఇది CJNG కార్టెల్‌కు కంచుకోట లాంటి ప్రాంతం. మెక్సికన్ ఆర్మీ, నేషనల్ గార్డ్, వైమానిక దళం సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. అమెరికా నిఘా సంస్థల (DEA) సహకారంతో ఎల్ మెంచో ఆచూకీని పసిగట్టి చుట్టుముట్టారు.
సైన్యం జరిపిన భీకర కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎల్ మెంచోను హెలికాప్టర్‌లో మెక్సికో సిటీకి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించినట్లు మెక్సికో రక్షణ శాఖ ధృవీకరించింది. ఎల్ మెంచో మరణవార్త తెలియగానే జలిస్కో రాష్ట్రం అట్టుడికిపోయింది. అతని అనుచరులు పెద్దఎత్తున హింసకు దిగారు. గ్వాడలజారా (Guadalajara), ప్యూర్టో వల్లార్టా వంటి నగరాల్లో వాహనాలను తగులబెట్టి రోడ్లను బ్లాక్ చేశారు.
దీంతో భద్రతా కారణాల దృష్ట్యా ప్యూర్టో వల్లార్టా విమానాశ్రయంలో విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. జలిస్కో గవర్నర్ రాష్ట్రవ్యాప్తంగా 'రెడ్ కోడ్' ప్రకటించి, ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు.
ఎవరీ ఎల్ మెంచో?
2009లో జలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (CJNG)ను స్థాపించి, అనతి కాలంలోనే దానిని మెక్సికోలోనే అత్యంత హింసాత్మకమైన గ్యాంగ్‌గా మార్చాడు. ఇతని తలపై అమెరికా ప్రభుత్వం 15 మిలియన్ డాలర్ల (సుమారు రూ.125 కోట్లు) భారీ రివార్డును ప్రకటించింది. అమెరికాకు భారీగా ఫెంటానిల్, కొకైన్, హెరాయిన్ సరఫరా చేయడంతోపాటు, మెక్సికోలో వేల సంఖ్యలో హత్యలు, బాంబు దాడులకు ఇతనే ప్రధాన కారకుడు.
భవిష్యత్త్ పరిణామాలు
ఎల్ మెంచో మరణం మెక్సికో ప్రభుత్వానికి దక్కిన అతిపెద్ద విజయం. అయితే, 'ఎల్ చాపో' పట్టుబడినప్పుడు జరిగినట్లే, ఇప్పుడు CJNG కార్టెల్‌లో వారసత్వ పోరు మొదలయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మెక్సికోలో మరింత రక్తపాతానికి దారితీయవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇలాఉండగా, ప్రస్తుతం మెక్సికోలో ఉన్న భారతీయ పౌరులు, పర్యాటకులు స్థానిక భద్రతా అధికారుల సూచనలను పాటించాలని, అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని స్థానిక భారత కార్యాలయం సూచించింది.
ఈ వార్తలూ చదవండి:
ఒడిశాలో ఆర్‌బీఐ రెండో డేటా కేంద్రం
కాకినాడ పెన్సిలిన్-జీ ప్లాంట్‌లో 10 వేల టన్నులకు ఉత్పత్తి