Share News

దుబాయ్‌లో విలాసాల రారాజు.. సతీశ్‌ సన్పాల్‌ ఆస్తుల స్తంభన

ABN , Publish Date - Aug 05 , 2026 | 04:47 AM

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం.. బుర్జ్‌ ఖలీఫా (దుబాయ్‌)లో రూ.100 కోట్ల విలువైన పెంట్‌హౌ్‌సలో నివాసం. వేలాది కోట్ల ఆస్తులు. ఏటా ధనత్రయోదశినాడు భార్యకు బహుమతిగా 3 కిలోల చొప్పున బంగారం....

దుబాయ్‌లో విలాసాల రారాజు.. సతీశ్‌ సన్పాల్‌ ఆస్తుల స్తంభన

మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా ఫ్రీజ్‌ చేసిన యూఏఈ ఆర్థిక నిఘా విభాగం

  • బుర్జ్‌ఖలీఫా పెంట్‌హౌ్‌స అతడి ఇల్లు

  • భార్యకు ఏటా 3 కిలోల పసిడి గిఫ్ట్‌

  • ఏడాది కుమార్తెకు రోల్స్‌రాయిస్‌

  • అతడి ఆస్తుల విలువ14 వేల కోట్లు!

దుబాయ్‌, ఆగస్టు 4: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం.. బుర్జ్‌ ఖలీఫా (దుబాయ్‌)లో రూ.100 కోట్ల విలువైన పెంట్‌హౌ్‌సలో నివాసం. వేలాది కోట్ల ఆస్తులు. ఏటా ధనత్రయోదశినాడు భార్యకు బహుమతిగా 3 కిలోల చొప్పున బంగారం. బుడిబుడి అడుగులు వేసే కుమార్తెకు గిఫ్ట్‌గా.. ప్రత్యేకంగా తయారుచేయించిన (కస్టమైజ్డ్‌) రోల్స్‌ రాయిస్‌ కారు!! భారతదేశం నుంచి దుబాయ్‌కి వెళ్లి పారిశ్రామికవేత్తగా ఎదిగి వేలాది కోట్ల రూపాయలు ఆర్జించి, విలాసవంతమైన జీవితానికి కేరాఫ్‌ చిరునామాగా నిలిచిన సతీశ్‌ సన్పాల్‌ (41) కథ ఇది! కానీ.. మెరిసే ఆ వెలుగుల వెనుక అక్రమ ఆర్థిక లావాదేవీలనే చీకటి కూడా ఉంది. దానివల్ల అతడు యూఏఈలో మనీలాండరింగ్‌ కేసులో ఇరుక్కున్నాడు. ఆ కేసు దర్యాప్తులో భాగంగా యూఏఈఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ఆయన బ్యాంకు ఖాతాలను, పెట్టుబడులను, క్రిప్టోవాలెట్లను, లాకర్లను 30 రోజులపాటు స్తంభింపజేస్తూ ఉత్తర్వులిచ్చింది.

భారత్‌లో కేసులతో దుబాయ్‌కి..

దుబాయ్‌లో కింగ్‌లా బతుకుతున్న సతీశ్‌ సన్పాల్‌ సొంత ఊరు.. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌. 1985లో జన్మించిన సతీశ్‌.. ఎనిమిదో తరగతి దాకా చదివాడు. ఆ తర్వాత చదువు ఆపేసి తల్లి దగ్గర రూ.50 వేలు తీసుకుని కిరాణా కొట్టు పెట్టాడు. అది రెండేళ్లలోనే మూతపడింది. ఆ తర్వాత రకరకాల పనులు చేస్తూ.. క్రికెట్‌ బెట్టింగ్‌, హవాలా నెట్‌వర్క్‌లోకి ప్రవేశించాడు. 2015-2022 నడుమ పలువురు పేదల ఆధార్‌, పాన్‌కార్డులను ఉపయోగించి 12-13 షెల్‌ కంపెనీలు స్థాపించి దాదాపు రూ.1000 కోట్లకు పైగా సొమ్మును హవాలా ద్వారా దుబాయ్‌కి మళ్లించాడు. అతడి అక్రమ దందాలపై మధ్యప్రదేశ్‌లో వివిధ పోలీస్‌ స్టేషన్లలో తొమ్మిది క్రిమినల్‌ కేసులున్నాయి. వాటిలో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అతడు 2020లో దుబాయ్‌కి వెళ్లిపోయాడు. అక్కడ అనాక్స్‌ అనే కంపెనీ పెట్టి ఇక్కడి నుంచి తరలించిన హవాలా సొమ్ముతో అక్కడ రియల్‌ ఎస్టేట్‌, నైట్‌ క్లబ్‌ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు. అక్కడ ఉంటూనే.. ఇక్కడ మధ్యప్రదేశ్‌లో లాయర్లను నియమించుకుని.. తన కేసుల్లో విచారణకు తాను హాజరు కాకుండానే ఎనిమిది కేసుల్లో బెయిల్‌ కూడా తెచ్చుకున్నాడు. కానీ.. యూఏఈలో అతడి అక్రమ దందాల గురించి బయటపడగానే అక్కడి ప్రభుత్వం అతడి ఆస్తులను, ఖాతాలను స్తంభింపజేయడం గమనార్హం.


అనుభవించు రాజా..

‘‘పైసా ఖుదా తో నహీ.. పర్‌ ఖుదా సే కమ్‌ భీ నహీ’’ ..నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ‘దేశీ బ్లింగ్‌’ సిరీస్‌లో సతీశ్‌ సన్పాల్‌ చెప్పిన మాట ఇది! ‘‘డబ్బే దేవుడు కాదుగానీ.. దేవుడి కన్నా తక్కువ కూడా కాదు’’ అని ఈ వాక్యానికి అర్థం. డబ్బు మనం కోరిన ప్రతిదాన్నీ తెచ్చిపెడుతుందన్నది అతడి సిద్ధాంతం. సతీశ్‌కు 21 సంవత్సరాల వయసులో పెళ్లయింది. మొదటి భార్యతో ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం అతడు దుబాయ్‌లో తన రెండో భార్య(బ్రిటి్‌ష-పాకిస్థానీ మూలాలున్న) తబిందా, కుమార్తె ఇసబెల్లాతో కలిసి జీవిస్తున్నాడు. వీరిద్దరికి తొమ్మిదేళ్ల క్రితం పెళ్లయింది. ఇండియాలో సతీశ్‌పై నమోదైన కొన్ని కేసుల్లో తబిందా పేరు కూడా ఉంది. వీరిద్దరి పేరిటా ఉన్న ఆస్తుల విలువ రూ.14 వేల కోట్ల రూపాయల దాకా ఉంటుందని అంచనా. ఫ వీరికి బుర్జ్‌ఖలీఫాలో ఉన్న ఫ్లాట్‌తో పాటు.. దుబాయ్‌ హిల్స్‌లో వంద కోట్లకు పైగా విలువ చేసే బంగళా ఒకటి ఉంది. లండన్‌లో స్థిరాస్తులున్నాయి.

  • తమ పదో వివాహ వార్షికోత్సవం నాడు.. తన భార్య(తబిందా) బరువుకు సమానమైన బంగారంతో తులాభారం తూస్తానని అతడు ఆమెకు వాగ్దానం చేశాడు. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ సిరీ్‌సలో స్వయంగా వెల్లడించాడు.

  • సతీశ్‌ తన భార్యకు ఏటా ధనత్రయోదశినాడు కొనిచ్చే బంగారం 3 కిలోలు.. అదికాక వివిధ సందర్భాల్లో కొన్న బంగారం.. అంతా కలిపి తబిందా వద్ద ఇప్పటికే 40 కిలోల బంగారం ఉంది.

  • తన కుమార్తె పుట్టడానికి ముందే.. సతీశ్‌ ఆమె కోసం ‘గోల్డెన్‌ కట్లెరీ (బంగారు పళ్లెం, గ్లాసు, స్పూన్లు, ఫోర్కులు, కత్తులు)’ కొనిపెట్టాడు. కుమార్తె మొదటి పుట్టినరోజునాడు.. 24 క్యారెట్ల బంగారంతో తయారుచేసిన గౌను, జాకెట్‌ కొన్నారు. ఆమె కోసం రూ.5.8 కోట్ల విలువైన గులాబీ రంగు రోల్స్‌రాయిస్‌ని కొని బహుమతిగా ఇచ్చారు. అతడి వద్ద ఐదు రోల్స్‌రాయిస్‌ కార్లు, ఒక బుగాటీ చిరాన్‌ కారు, ఒక బెంట్లీ ఉన్నాయి. వాటన్నింటి విలువ రూ.35 కోట్లకు పైమాటే.

ఇవి కూడా చదవండి..

ఇజ్రాయెల్‌కున్న గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరు: బెంజమిన్ నెతన్యాహు

ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట.. విచారణ అనంతరం విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం..

Updated Date - Aug 05 , 2026 | 04:47 AM