సౌదీలోని అమెరికా ఎయిర్ బేస్‌పై డ్రోన్ దాడి.. 10 మంది అమెరికా సిబ్బందికి గాయాలు
ABN , Publish Date - Mar 28 , 2026 | 07:17 AM
సౌదీ అరేబియాలోని కీలకమైన ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లక్ష్యంగా ఈ తెల్లవారుజామున జరిగిన డ్రోన్ దాడిలో పది మంది అమెరికా సేవా సభ్యులు గాయపడ్డారు. ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని ప్రాథమిక అంచనా.
ఆంధ్రజ్యోతి, మార్చి 28: ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతికారమా అన్నట్టు సౌదీ అరేబియాలోని కీలకమైన ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ మీద అటాక్ జరిగింది. ఈ తెల్లవారుజామున జరిగిన ఈ డ్రోన్ దాడిలో పది మంది అమెరికా సేవా సభ్యులు గాయపడ్డారు. ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని ప్రాథమిక అంచనా.
ఈ దాడిలో రెండు 'వన్-వే అటాక్' డ్రోన్లను ఉపయోగించినట్టు సమాచారం. మొదటి డ్రోన్ ఎయిర్ బేస్‌లోని నివాస సముదాయం సమీపంలో పేలిపోయింది. దీంతో అక్కడి భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రెండవ డ్రోన్‌ను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా గాలిలోనే ధ్వంసం చేసినప్పటికీ, దాని శిథిలాలు పడటం వల్ల అమెరికా సేవా సభ్యులు గాయాలపాలయ్యారు. గాయపడిన 10 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారికి ప్రస్తుతం బేస్‌లోని మెడికల్ సెంటర్‌లో చికిత్స అందిస్తున్నారు.
అమెరికా, సౌదీ స్పందన
ఈ దాడిని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) తీవ్రంగా ఖండించింది. అమెరికా బలగాల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ' మా దళాలపై జరిగే ఇటువంటి దాడులను మేము ఉపేక్షించం. తగిన సమయంలో, తగిన రీతిలో సమాధానం చెప్తాం'. అని అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు.
సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఈ దాడిని తీవ్రవాద చర్యగా అభివర్ణించింది. తమ దేశ సార్వభౌమాధికారాన్ని, మిత్రదేశాల బలగాలను రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న దాడుల నేపథ్యంలో, అమెరికా స్థావరాలపై దాడులు పెరగడం గమనార్హం. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు జరుగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ!
Read Latest Telangana News and National News