Share News

బంగ్లాదేశ్‌ నుంచి బంగారం.. విదేశీ కరెన్సీ

ABN , Publish Date - Oct 22 , 2026 | 06:16 AM

విదేశాల నుంచి అక్రమంగా బంగారం, విదేశీ కరెన్సీని తరలిస్తున్న స్మగ్లింగ్‌ ముఠా గుట్టును డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు రట్టు చేశారు.

బంగ్లాదేశ్‌ నుంచి బంగారం.. విదేశీ కరెన్సీ

విజయవాడలో స్మగ్లింగ్‌ ముఠా గుట్టు రట్టు

విజయవాడ, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): విదేశాల నుంచి అక్రమంగా బంగారం, విదేశీ కరెన్సీని తరలిస్తున్న స్మగ్లింగ్‌ ముఠా గుట్టును డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు రట్టు చేశారు. బంగ్లాదేశ్‌ నుంచి బంగారాన్ని అక్రమంగా కోల్‌కతాకు తీసుకొచ్చి అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా విజయవాడ శివారులో ఐదుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 3.1 కేజీల బంగారం బిస్కెట్లతోపాటు, 60 వేల అమెరికన్‌ డాలర్లు, 21,500 యూరోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను డీఆర్‌ఐ అధికారులు బుధవారం వెల్లడించారు. బంగ్లాదేశ్‌ నుంచి కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు బంగారం అక్రమంగా తరలిస్తున్నారని డీఆర్‌ఐ అధికారులకు సమాచారం అందింది.

దీంతో హైదరాబాద్‌ జోనల్‌ యూనిట్‌ (హెచ్‌జడ్‌యూ), విజయవాడ ప్రాంతీయ కార్యాలయం (ఆర్‌వో) అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి.. ఈ నెల 18న విజయవాడ శివారులో ఓ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. ఆ వాహనంలో ప్రత్యేకంగా చేయించిన రహస్య అరలో 60,000 డాలర్లు, 21,500 యూరోలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా.. విజయవాడ శివారులో ముగ్గురు వ్యక్తులకు బంగారం అందించామని, వారు దాన్ని తీసుకుని ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో హైదరాబాద్‌ వెళ్తున్నారని వెల్లడించారు. ఈ సమాచారంతో బస్సును అడ్డగించి, అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అనుమానితులను సోదా చేయగా.. వారి నడుముకు కట్టుకున్న పౌచ్‌ల్లో మూడు బంగారం బిస్కెట్లు లభ్యమయ్యాయి. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, ఆర్థిక నేరాల విచారణ కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించిందని పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి..

కూటమి దూకుడు

పండుగపూట ఘోరం

Updated Date - Oct 22 , 2026 | 06:16 AM