కూటమి దూకుడు
ABN , Publish Date - Oct 22 , 2026 | 03:31 AM
మున్సిపల్ ఎన్నికల్లో అధికార కూటమి పార్టీల పరిస్థితి దూకుడుగా ఉంది. మార్కాపురం జిల్లాలో వైసీపీ పకడ్బందీగా పోటీకి సిద్ధమైనట్లు కనిపిస్తుండగా, ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం నెలకొన్న పరిస్థితి అందుకు నిదర్శనం.
దర్శి, కనిగిరిలో లైన్‌క్లియర్
కోర్టు తీర్పుతో ప్రకటనలో జాప్యం
ఒంగోలు, అద్దంకి, మార్కాపురంలో
మూడేసి వార్డుల్లో ఒక్కరే మిగిలారు
గిద్దలూరులో పోటీ నుంచి తప్పుకున్న ఎమ్మెల్యే సోదరుడు
చీమకుర్తిలో ఏకగ్రీవాలు నిల్... చీరాలలో త్రిముఖ పోటీ
మున్సిపల్ ఎన్నికల్లో అధికార కూటమి పార్టీల పరిస్థితి దూకుడుగా ఉంది. మార్కాపురం జిల్లాలో వైసీపీ పకడ్బందీగా పోటీకి సిద్ధమైనట్లు కనిపిస్తుండగా, ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం నెలకొన్న పరిస్థితి అందుకు నిదర్శనం. దర్శి, కనిగిరిలలో వివరాలు కోర్టు తీర్పు నేపఽథ్యంలో జాప్యమైనప్పటికీ ఆ రెండిం టిలో కూటమి పూర్తిస్థాయిలో విజయం సాధించినట్లు కనిపిస్తోంది. గిద్దలూరులో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి సోదరుడు పోటీ నుంచి తప్పుకోవడంతో బీజేపీ ఊపిరి పీల్చుకుంది. మార్కాపురంలో టీడీపీకి రెండు, బీజేపీకి ఒక వార్డు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. ఒంగోలు, అద్దంకిలో మూడేసి చోట్ల టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంకానున్నారు. చీమకుర్తిలోని అన్నివార్డుల్లో పోటీ ఉంది. చీరాలలో త్రిముఖ పోటీ నెలకొంది. ఒంగోలులో కూటమి పార్టీల మధ్య సీట్ల కేటాయింపులో ఏకాభిప్రాయం కుదరలేదు.
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
నగరపాలక సంస్థ, మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం గడువు ముగిసింది. అన్ని స్థానాల్లోనూ కార్యక్రమం ప్రశాంతంగా సాగింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దర్శి, కనిగిరి మున్సిపాలిటీల్లో ఉపసంహరణల అనంతరం పరిస్థితిని వెల్లడించకుండా అధికారులు వాయిదా వేశారు. అందిన సమాచారం మేరకు.. కనిగిరి మున్సిపాలిటీ అంశం వైసీపీ సుప్రీంకోర్టు పిటిషన్‌లో పేర్కొన్న స్థానాల్లో లేదని తెలుస్తోంది. బీజేవైఎం పార్టీ తరఫున రామచంద్రయాదవ్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ మేరకు కనిగిరి నామినేషన్ల తీరుతెన్నుపై ఒక పరిశీలన జరుగుతోంది. ఒక వార్డులో నామినేషన్ వేసేందుకు వచ్చిన మహిళను అడ్డుకున్నారని, అందుకు న్యాయం చేయాలని పిటిషన్ వేసినట్లు తెలిసింది. దీంతో ఆ విషయంపై విచారణ చేపట్టి తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ మేరకు బుధవారం మార్కాపురం కలెక్టర్, జేసీ ప్రత్యేకంగా విచారణ నిర్వహించారు. అయితే సదరు మహిళనే నామినేషన్ వేసే సమయంలో తనకు ఎలాంటి సమస్య ఎదురు కాలేదని వారికి చెప్పినట్లు తెలిసింది. దీంతో అధికారులు పూర్తిస్థాయి విచారణ నివేదికను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పంపారు. ఆ ప్రకారం నేడో,రేపో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పరిస్థితిని కనిగిరి ఎన్నికల అధికారి ప్రకటించవచ్చని తెలుస్తోంది. అందిన సమాచారం మేరకు.. కనిగిరి చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి తిరుపతమ్మ ఏకగ్రీవం కావచ్చని తెలుస్తోంది. మొత్తం 32 వార్డుల్లో సుమారు 28 వార్డులు టీడీపీ అభ్యర్థులకు ఏకగ్రీవమైనట్లుగా సమాచారం. మిగిలిన నాలుగు వార్డుల్లో ఒకచోట సీపీఎం, మూడుచోట్ల వైసీపీ అభ్యర్థులు రంగంలో మిగిలారని తెలుస్తోంది.
దర్శిలో నిలిచిన ప్రకటన
దర్శిలో జనసేన తరఫున పోటీలో ఉన్న చైర్మన్ అభ్యర్థితోపాటు మొత్తం 28 వార్డులు ఏకగ్రీవమయ్యేం దుకు రంగం సిద్ధమైంది. అందులో 24వార్డుల్లో టీడీపీ, మూడు వార్డుల్లో జనసేన, ఒకచోట బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఐదు వార్డుల్లో నామినేషన్లు దాఖలు చేసిన వైసీపీ అభ్యర్థులు విత్‌డ్రా చేసుకోవడం విశేషం. కాగా వైసీపీ వేసిన పిటిషన్ మేరకు సుప్రీంకోర్టు సూచనకు అనుగుణంగా అసలు దర్శిలో ఏం జరిగిందనే విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి విచారణ చేపట్టారు. కలెక్టర్, ఎస్పీలతో ఆయన నేరుగా మాట్లాడారు. దర్శిలో నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న గొడవలు, అందుకు అనుగుణంగా దాఖలైన కేసుల వివరాలను ఎస్‌ఈసీ తెప్పించుకొని పరిశీలన చేస్తోంది. అయితే ఎస్‌ఐపై రాళ్లతో దాడి జరగడం, ఆ సందర్భంగా అక్కడే బహిరంగంగా వైసీపీ చైర్మన్ అభ్యర్థి తన నామినేషన్ పత్రాలు చింపేయడం, ఇద్దరు, ముగ్గురుగా వచ్చి నామినేషన్ వేయండంటూ పోలీసులు అనౌస్స్ చేయడం తదితర దృశ్యాలతో కూడిన నివేదికలను అధికారులు పంపినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇబ్బంది ఉండదని టీడీపీ శ్రేణులు భావిస్తుండగా, నామినేషన్ల ఘట్టం పునరావృతం కావచ్చనే ఆశాభావంతో వైసీపీ నాయకుల ఎదురుచూస్తున్నారు.
గిద్దలూరులో సర్దుబాటు
గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి సోదరుడు కృష్ణకిశోర్‌రెడ్డి బుధవారం ఉపసంహరించుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పూర్తిస్థాయిలో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చే పరిస్థితి నెలకొంది. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా తాము పోటీ నుంచి తప్పుకున్నట్లు ఎమ్మెల్యే సోదరుడు ప్రకటించారు. ఇప్పటికే ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి పక్షాన ప్రచారంలో ఉన్నారు. అయితే పట్టణ ప్రజలందరికీ సుపరిచితుడైన ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండటం విశేషం.
మూడు చోట్ల మూడేసి స్థానాలు ఏకగ్రీవం
ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు మార్కాపురం, అద్దంకి మున్సిపాలిటీల్లో టీడీపీ, బీజేపీ అభ్యర్థులు బోణీ కొట్టారు. ఒంగోలులో మూడు డివిజన్‌లు టీడీపీకి ఏకగ్రీవమైనట్లు సమాచారం. అయితే జనసేనతో పూర్తిస్థాయిలో సీట్ల సర్దుబాటు జరగలేదు. జనసేన అభ్యర్థులు 18 స్థానాల్లో నామినేషన్లు వేయగా అందులో ఐదారు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు రంగంలో ఉండటం గమనార్హం. బీజేపీకి అధికారికంగా రెండు స్థానాలు కేటాయించారు. ఇక్కడ వైసీపీ తరపున మేయర్ పదవికి రెబల్ అభ్యర్థి రంగంలో ఉండటం విశేషం. అద్దంకిలో మూడు వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుపొందారు. మొత్తం 32 వార్డుల్లో మిగిలిన వార్డుల్లో 25 చోట్ల టీడీపీ, నాలుగుచోట్ల జనసేన అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మార్కాపురంలో 2 వార్డుల్లో టీడీపీ, ఒకచోట బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. కూటమి పార్టీల నేతలు అవగాహనతో ముందుకు సాగుతున్నారు. చీమకుర్తిలో అన్ని వార్డుల్లో పోటీ ఉంది. టీడీపీ అభ్యర్థులు 26 వార్డుల్లో, జనసేన నుంచి రెండు వార్డుల్లో పోటీలో ఉన్నారు. వైసీపీ అన్ని వార్డుల్లోనూ అభ్యర్థులను రంగంలోకి దింపింది. చీరాలలో అన్ని వార్డుల్లో పోటీకి రంగం సిద్ధమైంది. అయితే కూటమి పార్టీల మధ్య ఎన్నికల అవగాహన సాఫీగా జరగడం విశేషం. చైర్మన్ స్థానానికి త్రిముఖ పోటీ నెలకొంది. టీడీపీ, వైసీపీలతోపాటు కాంగ్రెస్ తరఫునఆమంచి అభ్యర్థిని రంగంలో దింపడం చర్చనీయాంశమైంది.