Share News

పండుగపూట ఘోరం

ABN , Publish Date - Oct 22 , 2026 | 03:26 AM

పండుగపూట వల్లూరమ్మ దేవాలయానికి వెళుతున్నామని చెప్పి బయల్దేరిన ఇరువురు యువకులు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఇద్దరూ మంచి స్నేహితులు. కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవారు రోడ్డుప్రమాదంలో ఒకేసారి ప్రాణాలు కోల్పోయారు.

పండుగపూట ఘోరం

అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం

ఇద్దరు యువకుల దుర్మరణం

ఒంగోలు క్రైం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : పండుగపూట వల్లూరమ్మ దేవాలయానికి వెళుతున్నామని చెప్పి బయల్దేరిన ఇరువురు యువకులు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఇద్దరూ మంచి స్నేహితులు. కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవారు రోడ్డుప్రమాదంలో ఒకేసారి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఒంగోలు మండలం పెళ్లూరు సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి 1.30గంటల సమయంలో చోటుచేసుకుంది. ప్రమాదంలో ఒంగోలు ఎన్‌జీవో కాలనీలో నివాసం ఉండే మలసాని కొండపనాయుడు (25), రామనగర్‌ రెండోలైన్‌లో నివాసం ఉండే కాకుమాని రుత్విక్‌ స్వామి చంద్రశేఖర్‌రెడ్డి(27) మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. రుత్విక్‌స్వామి చంద్రశేఖర్‌రెడ్డిది జరుగుమల్లి మండలం తూమాడ. ఆయన కుటుంబం ప్రస్తుతం ఒంగోలులోని రామ్‌నగర్‌లో నివాసం ఉంటోంది. అతనికి ఎన్‌జీవో కాలనీలో ఉండే కొండపనాయుడు స్నేహితుడు. ఇరువురూ కలిసి చంద్రశేఖర్‌రెడ్డికి చెందిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై వల్లూరమ్మ దేవాలయానికి వెళుతున్నామని చెప్పి బయల్దేరారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత పెళ్లూరు సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇరువురూ మృతి చెందినట్లు తల్లిదండ్రులకు సమాచారం వచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీ సులు బైక్‌.. ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొని అదుపుతప్పడంతో ఇరువురు యువకులు రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందినట్లు చెబుతున్నారు. చంద్రశేఖర్‌రెడ్డి ఇటీవల యూకేలో ఎంఎస్‌ పూర్తిచేసి ఇంటికి వచ్చాడు. కొండపనాయుడు డిగ్రీ పూర్తిచేసుకొని ఎంఎస్‌కు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇద్దరూ మంచి చదువులు చదివారు. ఇక ఉన్నత స్థానాల్లో స్థిరపడతారని ఆశల్లో ఉన్న తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. కొండపనాయుడు తండ్రి చేతివృత్తితో కష్టపడి కుమారుడిని చదివించారు. అలాగే చంద్రశేఖర్‌రెడ్డి తండ్రి వ్యవసాయంతోపాటు ఎక్స్‌కవేటర్‌ను అద్దెకు తిప్పుతుంటారు. ఒంగోలు తాలూకా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 22 , 2026 | 03:26 AM