Share News

జిబౌటి తీరంలో ఘోర పడవ ప్రమాదం.. 109 మంది మృతి, 116 మంది గల్లంతు

ABN , Publish Date - Oct 11 , 2026 | 06:52 PM

ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఒబోక్ సమీపంలో వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడటంతో 109 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 116 మంది గల్లంతయ్యారు.

జిబౌటి తీరంలో ఘోర పడవ ప్రమాదం.. 109 మంది మృతి, 116 మంది గల్లంతు

Djibouti Boat Tragedy: ఆఫ్రికాలోని జిబౌటి (Djibouti) తీరంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో సుమారు 109 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 15 మంది చిన్నారులు కూడా ఉన్నారు. అక్టోబర్ 8-9 మధ్య రాత్రి సమయంలో జిబౌటి పట్టణమైన ఒబోక్ (Obock) సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు అంతర్జాతీయ వలస సంస్థ (IOM) ప్రకటించింది. ఈ పడవ ప్రమాదంలో మృతులతో పాటు మరో 116 మంది ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.

djibouti-boat-accident-1.jpg


యెమెన్ వైపు ప్రయాణం

జిబౌటి నుంచి యెమెన్‌కు సుమారు 350 మంది వలసదారులతో వెళ్తున్న పడవ ఒబోక్ తీరానికి ఉత్తరంగా ప్రయాణిస్తుండగా బోల్తా పడింది. వెలికితీసిన 109 మృతదేహాలలో 52 మంది పురుషులు, 42 మంది మహిళలు, 15 మంది పిల్లలు (9 మంది బాలికలు, 6 మంది బాలురు) ఉన్నట్లు ఐఓఎం (IOM) తెలిపింది. ప్రాణాలతో బయటపడిన 80 మందికి పైగా వ్యక్తులందరూ ఇథియోపియా జాతీయులే కావడం గమనార్హం.

djibouti-boat-accident-2.jpgపేదరికం, అభద్రతా భావం, వాతావరణ మార్పుల ప్రభావంతో ఉపాధి వెతుక్కుంటూ గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు వలసదారులు ఈ ప్రమాదకర సముద్ర మార్గాన్ని ఆశ్రయిస్తున్నారని IOM ఆవేదన వ్యక్తం చేసింది. బాబ్ ఎల్-మండెబ్ జలసంధి (Bab el-Mandeb Strait) గుండా యెమెన్ మీదుగా గల్ఫ్ దేశాలకు చేరుకోవాలనే ప్రయత్నంలో ఇలాంటి విషాదాలు పునరావృతమవుతున్నాయని పేర్కొంది. స్థానిక జిబౌటి అధికారులతో కలిసి ఐఓఎం రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ: పవన్ కల్యాణ్

తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ సిబ్బందికి ప్రమాదం

Updated Date - Oct 11 , 2026 | 07:02 PM