ఇరాన్ అధ్యక్షుడు రాజీనామా చేయనున్నారా.. కారణమేంటి..
ABN , Publish Date - Jun 01 , 2026 | 08:55 AM
ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)తో విభేదాల కారణంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తన పదవికి రాజీనామా చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన తన రాజీనామా లేఖను ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీకి సమర్పించినట్టు వార్తలు వస్తున్నాయి.
ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)తో విభేదాల కారణంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తన పదవికి రాజీనామా చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన తన రాజీనామా లేఖను ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీకి సమర్పించినట్టు వార్తలు వస్తున్నాయి. అమెరికా కేంద్రంగా నడిచే ఇరాన్ పత్రిక ఈ విషయాన్ని వెల్లడించింది (Iran President Resignation).
ఇరాన్ పాలన పూర్తిగా ఐఆర్‌జీసీ కమాండర్ల చేతుల్లోకి వెళ్లిపోవడాన్ని సహించలేకే పెజెష్కియాన్ రాజీనామా చేసినట్టు సదరు పత్రిక పేర్కొంది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి కీలక నిర్ణయాలలో ఇరాన్ ప్రభుత్వ అధికారులను దూరంగా ఉంచుతున్నారని, ఐఆర్‌జీసీ కమాండర్లు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని దేశాన్ని పతనం వైపు నడిపిస్తున్నారని తన రాజీనామా లేఖలో పెజెష్కియాన్ పేర్కొన్నట్టు సమాచారం. చట్టపరంగా తనకు ఉన్న బాధ్యతలను కూడా పూర్తి చేయనీయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది (Iranian Politics).
పెజెష్కియాన్ రాజీనామా లేఖపై సుప్రీం లీడర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది (Iran News). కాగా, అధ్యక్షుడు పెజెష్కియాన్ రాజీనామా చేశారనడం పూర్తిగా అవాస్తవమని ఇరాన్ అధ్యక్ష కార్యాలయంలోని కమ్యూనికేషన్స్ విభాగం అధికారి స్పష్టం చేశారు. పెజెష్కియాన్ ప్రస్తుతం తన రోజువారీ విధుల్లో బిజీగా ఉన్నారని, తప్పుడు కథనాలతో మీడియా మైండ్ గేమ్స్ ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
ఆర్సీబీ ఫ్యాన్స్‌కు అన్యాయం.. ఐపీఎల్ ఫైనల్ వేదికపై డీకే శివకుమార్ ఆగ్రహం..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..