కొలంబియాలో ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి
ABN , Publish Date - Oct 20 , 2026 | 06:59 AM
దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నైరుతి ప్రాంతంలోని నారినో ప్రావిన్స్‌లో ఉన్న అక్రమ బంగారు గనిలో కొండచరియలు విరిగిపడి 14 మంది మృతిచెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
బొగోటా, అక్టోబర్ 20: దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నైరుతి ప్రాంతంలోని నారినో ప్రావిన్స్‌లో ఉన్న అక్రమ బంగారు గనిలో కొండచరియలు విరిగిపడి 14 మంది మృతిచెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. నారినో ప్రావిన్స్‌లోని శాంటా బార్బరా డి ఇస్కువాండే మున్సిపాలిటీ పరిధిలోని గ్రామీణ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. గని వద్దకు చేరుకోవడానికి సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం, ఆ ప్రాంతంలో సాయుధ ముఠాలు ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురైనట్లు గవర్నర్ కార్యాలయం తెలిపింది. అలాగే, ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరినట్లు నారినో ప్రాంత శాంతి, భద్రతల విభాగం కార్యదర్శి అలెక్స్ గొంజాలెస్ వెల్లడించారు. గనిలో చిక్కుకున్న వారి కోసం చేపట్టిన గాలింపు చర్యలు పూర్తయ్యాయని తెలిపారు.
కాగా, కొలంబియాలో అనుమతులు లేకుండా నిర్వహించే గనుల్లో ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. ముఖ్యంగా నారినో ప్రావిన్స్ అక్రమ బంగారు తవ్వకాలకు కేంద్రంగా ఉంది. ఇక్కడ కొన్ని సాయుధ ముఠాలు అక్రమ బంగారం వ్యాపారంతో పాటు మాదకద్రవ్యాల అక్రమ రవాణా, బెదిరింపుల ద్వారా డబ్బు వసూలు వంటి కార్యకలాపాలకు పాల్పడుతుంటాయి. స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పరిమితంగా ఉండటంతో ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ కొందరు గనుల తవ్వకాలను ఆశ్రయిస్తున్నారని గవర్నర్ కార్యాలయానికి చెందిన ఓ ప్రతినిధి పేర్కొన్నారు. అక్రమ గనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, ప్రమాదకర పరిస్థితుల్లో తవ్వకాలు చేపట్టడం కార్మికుల ప్రాణాలకు ముప్పుగా మారుతోందని చెప్పుకొచ్చారు.
ఈ ఘటనతో అక్రమ మైనింగ్‌ను నియంత్రించడం, గని కార్మికుల భద్రతను పరిరక్షించడం కొలంబియా అధికారులకు మరోసారి సవాలుగా మారింది. కాగా, తాజా ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. గని ప్రాంతం నుంచి మృతదేహాలను బయటకు తీసి, సమీప నదిలోని చిన్న పడవలోకి తరలిస్తున్న దృశ్యాలు కలవరపెడుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
హూతీల దాడిలో 53 మంది యెమెన్ సైనికులు మృతి
కార్మిక సంక్షేమ చట్టం.. 5 వేల ఉద్యోగాలకు ఎసరు!