కార్మిక సంక్షేమ చట్టం.. 5 వేల ఉద్యోగాలకు ఎసరు!
ABN , Publish Date - Oct 20 , 2026 | 06:50 AM
న్యూయార్క్ మేయర్ తీసుకొస్తున్న నూతన చట్టం నేపథ్యంలో.. అమెజాన్ దాదాపు 5 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
న్యూయార్క్ మేయర్ తీసుకొస్తున్న కొత్త చట్టంతో వేర్‌హౌస్‌ల మూసివేతకు అమెజాన్ యోచన
న్యూయార్క్, అక్టోబరు 19: న్యూయార్క్ మేయర్ తీసుకొస్తున్న నూతన చట్టం నేపథ్యంలో.. అమెజాన్ దాదాపు 5 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు, 15 వేర్‌హౌస్‌లను కూడా శాశ్వతంగా మూసివేసే ప్రతిపాదనతో ఉంది. డెలివరీ రంగంలో ఉన్న ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ‘డెలివరీ ప్రొటెక్షన్ యాక్ట్’ను తీసుకొస్తామని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఇటీవల ప్రతిపాదించారు. ఈ చట్టం అమలైతే, కంపెనీలు తమ ఉత్పత్తుల డెలివరీ కోసం థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లు సమకూర్చే సిబ్బంది మీద ఆధారపడకుండా, సొంతంగా ఉద్యోగులను నియమించుకోవాల్సి ఉంటుం ది. దీనివల్ల డెలివరీ సిబ్బంది వేతనాలు, పని పరిస్థితులు మెరుగు పడతాయని ఈ చట్టాన్ని సమర్థించేవాళ్లు చేస్తున్న వాదన కాగా.. కంపెనీల మీద ఆర్థికభారం పెరుగుతుందని వ్యతిరేకుల వాదన. ప్రస్తుతం న్యూయార్క్ నగరంలో అమెజాన్ కంపెనీకి.. 40 మంది కాంట్రాక్టర్లకు సంబంధించిన దాదాపు 5 వేల మంది డెలివరీ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. కొత్త చట్టం అమలైతే.. వీరందరినీ అమెజాన్ తన సొంత ఉద్యోగులుగా నియమించుకోవాల్సి ఉంటుంది. అయితే, అమెజాన్ కెనడాలోని క్యుబెక్ నగరంలో ఇటువంటి పరిస్థితే ఎదురైనప్పుడు.. అక్కడ తన వేర్‌హౌస్‌లను పూర్తి గా మూసివేసి, కార్యకలాపాలను నిలిపివేసింది. ఇప్పుడు న్యూయార్క్‌లోనూ అటువంటి నిర్ణయమే తీసుకుంటుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అదే నిజమైతే, 5 వేల మంది డెలివరీ సిబ్బంది ఉద్యోగాలు కోల్పోవటమేగాక, వేర్‌హౌస్‌ల మూసివేతతో మరో 2వేల మంది ఉద్యోగాలు పోయే పరిస్థితులున్నాయి. అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంటే తాము రాత్రికి రాత్రే దివాళా తీస్తామని పలువురు థర్డ్‌పార్టీ కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు.