దలైలామాకు గ్రామీ అవార్డును ఖండించిన చైనా
ABN , Publish Date - Feb 02 , 2026 | 04:51 PM
దలైలామాకు గ్రామీ అవార్డుపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ స్పందించారు. దలైలామా పూర్తి ఆధ్యాత్మిక వ్యక్తి కాదని, మతం ముసుగులో చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యక్రమాలకు పాల్పడుతున్న రాజకీయ ప్రవాసి అని విమర్శించారు.
బీజింగ్: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా (Dalai Lama)కు ప్రతిష్టాత్మక 'గ్రామీ' అవార్డును ఇవ్వడాన్ని చైనా తీవ్రంగా ఖండించింది. ఈ గుర్తింపును ఉపయోగించుకుని ఆయన చైనా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని బీజింగ్ పేర్కొంది.
'మెడిటేషన్' అనే ఆల్బమ్‌కు గాను బెస్ట్ ఆడియో బుక్, నెరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ రికార్డింగ్ జాబితాలో దలైలామా 'గ్రామీ' అవార్డును గెలుచుకున్నారు. కాలిఫోర్నియా వేదికగా ఆదివారం జరిగిన 68వ వార్షిక గ్రామీ అవార్డుల్లో దలైలామాకు ఈ అవార్డును ప్రకటించారు. 90 ఏళ్ల వయస్సులో ఆయనను గ్రామీ అవార్డు వరించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
దలైలామాకు గ్రామీ అవార్డు ఇవ్వడంపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఘాటుగా స్పందించారు. దలైలామా పూర్తి ఆధ్యాత్మిక వ్యక్తి కాదని, మతం ముసుగులో చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యక్రమాలకు పాల్పడుతున్న రాజకీయ ప్రవాసి అని విమర్శించారు. తనకు వచ్చిన అవార్డును ఉపయోగించుకుని చైనా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడాన్ని బీజింగ్ వ్యతిరేకిస్తోందని అన్నారు.
దలైలామా 1959లో టిబెట్‌ను విడిచిపెట్టి ధర్మశాలలో ప్రవాసజీవితం గడుపుతున్నారు. టిబెట్ విముక్తి కోసం అహింసాయుత పద్ధతిలో పోరాటం సాగిస్తున్నందుకు 1989లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి వరించింది. తాజాగా గ్రామీ అవార్డు వరించడంపై దలైలామా స్పందించారు. ఇది తన వ్యక్తిగత విజయంగా చూడటం లేదని, శాంతి, కరుణ, పర్యావరణంపై శ్రద్ధ, మానవత్వం వంటివి 800 కోట్ల ప్రపంచ మానవాళి శ్రేయస్సుకు దోహదం చేస్తాయని, గ్రామీ గుర్తింపు ఈ సందేశాలను మరింత విస్తృతంగా వ్యాప్తి చేయడంలో సహాయపడుతుందని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
రెండ్రోజుల్లో డీల్ కుదరకపోతే.. అది నిజమో, కాదో తేలుతుంది.. ఇరాన్ వార్నింగ్‌పై ట్రంప్ రియాక్షన్..
అమెరికాకు వార్నింగ్.. ఇరాన్‌పై దాడి చేస్తే ప్రాంతీయ యుద్ధం తప్పదంటున్న ఖమేనీ..