Share News

అమెరికాను మించిపోయింది! ఇప్పుడు పవర్ భారత్ చేతుల్లో: ఎలాన్ మస్క్

ABN , Publish Date - Feb 01 , 2026 | 08:45 PM

ప్రపంచ ఆర్థికాభివృద్ధికి చైనా, భారత్‌లు చోదకశక్తులుగా మారాయని ఐఎమ్ఎఫ్ గణాంకాలు చెబుతున్నాయి. వీటిని ఎలాన్ మస్క్ నెట్టింట పంచుకున్నారు. పవర్ చేతులు మారుతోందని కామెంట్ చేశారు.

అమెరికాను మించిపోయింది! ఇప్పుడు పవర్ భారత్ చేతుల్లో: ఎలాన్ మస్క్
India, China Top Contributors to Global GDP

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధానాలతో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. అయితే, చిక్కుల్లో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రస్తుతం చైనా, భారత్‌లు చోదక శక్తులుగా అవతరించాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) గణాంకాలు చెబుతున్నాయి (IMF Data). ఈ పరిణామంపై అపరకుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) స్పందించారు. పవర్ ఇప్పుడు చైనా, భారత్ చేతుల్లోకి వెళుతోందని కామెంట్ చేశారు.

ప్రపంచ ఆర్థికవ్యవస్థను ముందుండి నడిపిస్తున్న టాప్ 10 దేశాల జాబితాను ఎలాన్ మస్క్ నెట్టింట పంచుకున్నారు (Top Contributors to Global GDP). ఈ జాబితాను ఐఎమ్ఎఫ్ విడుదల చేసింది. దీని ప్రకారం, ప్రపంచ జీడీపీలో 26.6 శాతం వాటాతో చైనా (China) నెం.1గా నిలిచింది. రెండో స్థానంలో ఉన్న భారత్ (India) వాటా 17.0 శాతం. ఇక మూడో స్థానానికి పరిమితమైన అమెరికా (USA) వాటా కేవలం 9.9 శాతం. అంటే.. చైనా, భారత్‌లు కలగలిసి ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో 43.6 శాతం వాటాను సొంతం చేసుకున్నాయి. ఈ గణాంకాలపై మస్క్ ఆసక్తికర కామెంట్ చేశారు. ప్రపంచంలో పవర్ చేతులు మారుతోందని అన్నారు.


అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రకారం, 2026లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.3 శాతంగా ఉండనుంది. 2027లో వృద్ధిరేటు 3.2 శాతంగా ఉండనుంది. ఆధునిక సాంకేతికతలపై పెట్టుబడుల వెల్లువ, ప్రభుత్వాల విత్త, ద్రవ్యపరపతి విధానాల మద్దతు, శక్తిమంతంగా ఉన్న ప్రైవేటు రంగాల కారణంగా ఆర్థికాభివృద్ధి పరుగులు పెడుతోందని ఐఎమ్ఎఫ్ తెలిపింది. ట్రంప్ సుంకాల ప్రభావాన్ని తట్టుకోవడంలో అనేక దేశాలకు ఇవి కీలకంగా మారాయని తెలిపింది.

ఇక 2025 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 7.3 శాతంగా ఉండనుందని అంచనా. అయితే, ఈ ఏడాది, వచ్చే ఏడాది 6.4 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని ఐఎమ్ఎఫ్ చెబుతోంది. చైనాలో ద్రవ్యోల్బణం కాస్త పెరుగుతుందని, భారత్‌లో మాత్రం ప్రభుత్వ అంచనాలకు లోబడే ఉంటుందని తెలిపింది.


ఇవీ చదవండి:

బడ్జెట్ 2026.. ఇరాన్‌లోని చాబహార్‌ పోర్టుకు నిధులు కేటాయించని కేంద్రం

ఆ సంస్థలకు 2047 వరకూ ట్యాక్స్ హాలిడే: మంత్రి నిర్మలా సీతారామన్

Updated Date - Feb 01 , 2026 | 09:18 PM