Share News

ఆ సంస్థలకు 2047 వరకూ ట్యాక్స్ హాలిడే: మంత్రి నిర్మలా సీతారామన్

ABN , Publish Date - Feb 01 , 2026 | 04:42 PM

భారత్‌లోని డేటా సెంటర్ల ద్వారా గ్లోబల్ కస్టమర్లకు క్లౌడ్ సర్వీసులు అందించే సంస్థలకు 2047 వరకూ ట్యాక్స్ హాలిడే ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్‌సభలో తెలిపారు. అంతేకాకుండా, బీఈఎస్ వ్యవస్థల్లోని లిథియం అయాన్ సెల్స్‌ తయారీకి వాడే వస్తువులను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయిస్తున్నట్టు తెలిపారు.

ఆ సంస్థలకు 2047 వరకూ ట్యాక్స్ హాలిడే: మంత్రి నిర్మలా సీతారామన్
Cloud Service Companies - Tax Holiday

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో టెక్నాలజీ రంగానికి ఊతమిచ్చేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కీలక ప్రతిపాదనను నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. భారత్‌లోని డేటా సెంటర్ల (Indian Data Centers) ద్వారా గ్లోబల్ కస్టమర్‌లకు క్లౌడ్ సేవలు (Cloud Services) అందించే కంపెనీలకు ట్యాక్స్ హాలిడే (Tax Holiday) ఇస్తున్నట్టు తెలిపారు. అయితే, ఈ సౌలభ్యం పొందేందుకు ఆయా కంపెనీలు భారతీయ కస్టమర్లకు ఇక్కడి రీసెల్లర్స్ ద్వారా సేవలు అందించాల్సి ఉంటుంది. క్లౌడ్ సేవల్లో భారతీయ కంపెనీలకు భాగస్వామ్యం కల్పించేలా కేంద్రం తాజా బడ్జెట్‌లో (Budget 2026-27) ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టింది.

ఇక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్‌లోని (బీఈఎస్ఎస్) లిథియమ్ అయాన్ సెల్స్ (BESS - Li Ion Cells) తయారీకి వాడే వస్తువులను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయిస్తామని (Basic Customs Duty Exemptions) మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. బ్యాటరీల్లోని లిథియం సెల్స్‌ తయారీకి వాడే వస్తువులపై గతంలో ఇచ్చిన మినహాయింపును బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్‌కూ విస్తరిస్తున్నట్టు తెలిపారు. సుంకాల విధానాన్ని సులభతరం చేసేలా కస్టమ్స్, ఎక్సైజ్ డ్యూటీకి మార్పులు చేస్తున్నట్టు తెలిపారు. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తామన్నారు. ఎగుమతుల్లో సత్తా చాటేలా ఈ మార్పులు తెచ్చినట్టు వివరించారు. డ్యూటీ ఇన్వర్షన్‌ను సరిదిద్దుతామని చెప్పారు.


కస్టమ్స్ డ్యూటీ మినహాయింపుల విధానాన్ని మరింత సరళతరం చేసినట్టు మంత్రి తెలిపారు. దిగుమతిదార్లు చెల్లించాల్సిన వాస్తవ డ్యూటీ రేట్‌లను కూడా కస్టమ్స్ నోటిఫికేషన్, టారిఫ్ షెడ్యూల్స్‌లో పొందుపరిచేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.


ఇవీ చదవండి:

2019 నుంచి 2026 వరకు.. 9 బడ్జెట్లు.. 14 గంటల ప్రసంగం..

ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త ఆదాయపు పన్ను చట్టం

Updated Date - Feb 01 , 2026 | 05:10 PM