రక్తసిక్తమైన హాలోవీన్
ABN , Publish Date - Nov 03 , 2026 | 06:02 AM
అమెరికాలో హాలోవీన్ వారాంతం నెత్తురోడింది.
అమెరికాలో ఆగంతకుల కాల్పులు.. 24 మంది మృతి
11 రాష్ట్రాల్లో వేర్వేరు ఘటనలు
డాల్‌సలో 75 నిమిషాల్లో నలుగురి బలి
కాలిఫోర్నియాలో గర్భిణి మృతి
వాషింగ్టన్, నవంబరు 2: అమెరికాలో హాలోవీన్ వారాంతం నెత్తురోడింది. కాలిఫోర్నియా నుంచి డెలావేర్ వరకు నైట్‌క్లబ్‌లు, హాలోవీన్ దుకాణాలు, స్టేడియం పరిసరాలు, విశ్వవిద్యాలయాల సమీప ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. పోలీసు ప్రకటనల ఆధారంగా న్యూయార్క్ టైమ్స్ వేసిన లెక్క ప్రకారం 11 రాష్ట్రాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో కనీసం 24 మంది మృతిచెందగా, 94 మంది గాయపడ్డారు. ఈ ఘటనల మధ్య సంబంధం ఉన్నట్లు గానీ, ఉగ్రకోణం ఉన్నట్లు గానీ అధికారులు ఇప్పటివరకు ప్రకటించలేదు. టెక్సా్‌సలోని డాలస్ నగరం డీప్ ఎలమ్ వినోద ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున సుమారు 12.20 గంటలకు కాల్పులు మొదలయ్యాయి. 75 నిమిషాల వ్యవధిలో మూడు చోట్ల జరిగిన కాల్పుల్లో కనీసం నలుగురు మృతిచెందగా, 15 మంది గాయపడ్డారు. కాలిఫోర్నియాలోని ఫెయిర్‌ఫీల్డ్‌లో స్పిరిట్ హాలోవీన్ దుకాణంలో శుక్రవారం రాత్రి 8.30 గంటలకు జరిగిన కాల్పుల్లో 31 ఏళ్ల గర్భిణి మృతిచెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. ఆమె నలుగురు పిల్లల తల్లి. మిషిగన్‌లోని మాడిసన్ హైట్స్‌లో మరో స్పిరిట్ హాలోవీన్ దుకాణంలో 21 ఏళ్ల యువకుడు కాల్పుల్లో మృతిచెందాడు. డెట్రాయిట్‌లో ట్రిక్ ఆర్ ట్రీటింగ్ ముగించుకుని, హాలోవీన్ దుస్తుల్లోనే ఇంటి వెనుక గదిలో ఆడుకుంటున్న ఐదేళ్ల బాలిక ఛాతిలోకి తూటా దూసుకెళ్లింది. చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.
ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్‌లో రెండు వేర్వేరు ఘటనల్లో 13 మందికి తూటాలు తగలగా, ఇద్దరు మృతిచెందారు. పార్టీ కోసం వరుసలో నిల్చున్న 17ఏళ్ల బాలిక దారితప్పిన తూటాకు బలైంది. కొన్ని గంటల తర్వాత ఓ ఇంటి పార్టీలో జరిగిన కాల్పుల్లో 20 ఏళ్ల యువకుడు మృతిచెందాడు. రెండు ఘటనలకూ ఘర్షణలే కారణమని అధికారులు తెలిపారు. మిసిసిపీలోని జాక్సన్‌లో కాస్ట్యూమ్ పార్టీ జరుగుతున్న నైట్‌క్లబ్‌లోకి ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు. డ్యాన్స్ ఫ్లోర్‌పై కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. మిషిగన్‌లోని ఫ్లింట్‌లో ఓ పార్టీలో ఒక మహిళ మృతిచెందగా, ముగ్గురు గాయపడ్డారు. కాన్స్‌సలోని విచిటాలో నలుగురికి తూటాలు తగిలాయి. వారిలో కిటికీలోంచి బయటకు చూస్తున్న ఓ వ్యక్తి కూడా ఉన్నారు. టెక్సా్‌సలోని ఎడిన్‌బర్గ్ సమీపంలో పుట్టినరోజు వేడుకలో ఏడుగురు గాయపడ్డారు. ఆర్కాన్సా్‌సలోని లిటిల్ రాక్ సమీపంలో ఒకరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. విశ్వవిద్యాలయాల సమీపంలో, వర్సిటీ కార్యక్రమాల వద్ద రెండు డజన్లకు పైగా మందికి తూటాలు తగిలాయి. అలబామాలోని బర్మింగ్‌హామ్‌లో మ్యాజిక్ సిటీ క్లాసిక్ ఫుట్‌బాల్ మ్యాచ్ తర్వాత లీజియన్ ఫీల్డ్ వెలుపల జరిగిన కాల్పుల్లో ఒకరు మృతిచెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. 17 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. డెలావేర్‌లో గంట వ్యవధిలో రెండు సామూహిక కాల్పుల ఘటనలు జరిగాయి. ఎలెండేల్‌లో బహిరంగ విందుపై జరిగిన కాల్పుల్లో తొమ్మిది మందికి తూటాలు తగలగా, 17 ఏళ్ల బాలిక మృతిచెందింది. యూనివర్సిటీ ఆఫ్ డెలావేర్ సమీపంలోని నెవార్క్ మెయిన్ స్ట్రీట్‌లో ఆరుగురు గాయపడ్డారు. ఇల్లినాయ్‌లోని బ్లూమింగ్టన్‌లో ఇల్లినాయ్ వెస్లియన్ యూనివర్సిటీ సమీపంలో కాల్పుల ఘటనలో 19 ఏళ్ల యువతి మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. ఇండియానాలోని బ్లూమింగ్టన్‌లో ఏడుగురు ఆస్పత్రి పాలయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లైంగిక వేధింపుల కేసు.. జేఎన్‌యూ ప్రొఫెసర్ తొలగింపుపై స్టే
ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి