Share News

ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్ దాడి.. 6.3 బిలియన్ డాలర్ల క్రిప్టో ఆస్తుల చోరీ

ABN , Publish Date - Oct 30 , 2026 | 08:43 PM

ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్ దాడి బైనాన్స్ ఎక్స్ఛేంజ్‌ను కుదిపేసింది. సుమారు 6.3 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో ఆస్తులను హ్యాకర్లు దొంగిలించారు. ఈ దాడి వెనుక ఉత్తర కొరియాకు చెందిన హ్యాకింగ్ ముఠా ఉన్నట్లు అంతర్జాతీయ బ్లాక్‌చైన్ విశ్లేషణ సంస్థలు అనుమానిస్తున్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్ దాడి.. 6.3 బిలియన్ డాలర్ల క్రిప్టో ఆస్తుల చోరీ
Crypto Assests Hack

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్ దాడి బైనాన్స్ ఎక్స్ఛేంజ్‌ను కుదిపేసింది. సుమారు 6.3 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.56 వేల కోట్లకు పైగా) విలువైన క్రిప్టో ఆస్తులను హ్యాకర్లు దొంగిలించారు. ఈ దాడి వెనుక ఉత్తర కొరియాకు చెందిన హ్యాకింగ్ ముఠా ఉన్నట్లు అంతర్జాతీయ బ్లాక్‌చైన్ విశ్లేషణ సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ సైబర్ దాడి ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ అయిన బైనాన్స్‌పై అక్టోబర్ 30న జరిగింది.


అమెరికాకు చెందిన టీఆర్ఎమ్ ల్యాబ్స్ (TRM Labs) సంస్థ ప్రకారం.. హ్యాకర్లు బైనాన్స్‌కు చెందిన 10 బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్‌ల్లోని వాలెట్ల నుంచి సుమారు 6.36 బిలియన్ డాలర్ల విలువైన డిజిటల్ ఆస్తులను తరలించారు. ఈ లావాదేవీల్లో ఎక్కువ భాగం కేవలం 20 నిమిషాల్లోనే పూర్తి కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ దాడి వెనుక ఉత్తర కొరియాతో సంబంధాలున్న ట్రేడర్స్ ట్రైటర్ (TraderTraitor) అనే హ్యాకింగ్ బృందం ఉన్నట్లు టీఆర్ఎమ్ ల్యాబ్స్ అనుమానిస్తోంది. మరో ప్రముఖ బ్లాక్‌చెయిన్ విశ్లేషణ సంస్థ చైన్ అనాలిసిస్ (Chainalysis) కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించింది. ఈ బృందం గతంలోనూ భారీ క్రిప్టో దొంగతనాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా 2025 ఫిబ్రవరిలో బైబిట్ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌లో జరిగిన 1.5 బిలియన్ డాలర్ల హ్యాకింగ్ ఘటనలోనూ ఇదే ముఠా ప్రమేయం ఉందని అమెరికా ఎఫ్‌బీఐ ఆరోపించింది.


మరోవైపు, హ్యాకర్లు తరలించిన డిజిటల్ ఆస్తుల్లో సుమారు 3 బిలియన్ డాలర్లను భాగస్వామ్య సంస్థల సహకారంతో నిలిపివేసినట్లు బైనాన్స్ ప్రకటించింది. వినియోగదారుల నష్టాలను భర్తీ చేసేందుకు 6.34 బిలియన్ డాలర్లకు పైగా కంపెనీ నిధులను కేటాయించినట్లు వెల్లడించింది. ఈ పరిణామంతో అంతర్జాతీయ క్రిప్టో మార్కెట్‌లో గందరగోళం నెలకొంది. బిట్‌కాయిన్ ధర సుమారు 4 శాతం పడిపోగా.. ఈథర్ సహా ఇతర క్రిప్టో కరెన్సీలూ నష్టాలను చవిచూశాయి. అయితే, ఈ దాడికి ఉత్తర కొరియానే కారణమని ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఈ ఘటన డిజిటల్ ఆస్తుల భద్రతపై మరోసారి తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది.


ఈ వార్తలు కూడా చదవండి

ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో ఎవరికీ రాని మెజారిటీ.. ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ..

మక్కా ప్రాంతంలో డ్రోన్‌ను కూల్చేశామన్న సౌదీ.. ఆరోపణలను ఖండించిన హూతీలు..

Updated Date - Oct 30 , 2026 | 09:16 PM