Share News

Bhutan: ప్రకృతి చెక్కిన ప్రశాంత నిలయం ‘భూటాన్‌’...

ABN , Publish Date - Jan 11 , 2026 | 01:19 PM

భూటాన్‌లో సంతాన భాగ్యం కలిగించే బౌద్ధ సన్యాసి ఉండేవాడు. ఆయన పేరు దృక్ప కుంలెయ్‌. మిగతా సన్యాసులు అనుసరించే మార్గానికి భిన్నంగా ఉండేవాడట. అందుకే మిగిలిన లామాలు అతనిని సీరియస్‌గా తీసుకునేవారు కాదు.

Bhutan: ప్రకృతి చెక్కిన ప్రశాంత నిలయం ‘భూటాన్‌’...

హిమాలయ పర్వతశ్రేణుల నడుమ... మనదేశానికి పొరుగునే ఉన్న భూటాన్‌ అనేక సాంప్రదాయాలకు నెలవు. ప్రకృతి దృశ్యాలే కాకుండా... రాచరికపు కట్టడాలు, బౌద్ధారామాలతో ఆద్యంతం ఆకట్టుకునే భూటాన్‌ విశేషాలివి...

మా మరిదికి కటిహర్‌ (బిహార్‌) ట్రాన్స్‌ఫర్‌ కావడం వల్ల, కజిన్‌ కోరిక మేరకు మేము కటిహర్‌ వెళ్ళాం. అక్కడి నుంచి డార్జిలింగ్‌, గాంగ్‌టక్‌ పర్యటించిన తర్వాత... భూటాన్‌ పర్యటనకు బయలుదేరాం. టూర్‌ ప్లానర్స్‌ మా టూర్‌ ప్రోగ్రాం ఇటినరీ తయారుచేశారు. అందువల్ల మేము ప్రత్యేకంగా శ్రమపడలేదు.

మా భూటాన్‌ ట్రిప్‌ 24 అక్టోబర్‌ 2025న మొదలయ్యింది. బాడ్‌ డోగ్రా విమానాశ్రయం నుంచి క్యాబ్‌లో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి జయగావ్‌ చేరేసరికి సాయంత్రం 5 గంటలయ్యింది. అక్కడ గైడ్‌ మమ్మల్ని పికప్‌ చేసుకుని ఇమ్మిగ్రేషన్‌ చేయించారు. గంట సమయం పట్టింది. అక్కడి నుంచి రాత్రి 12 గంటలకు భూటాన్‌ రాజధాని థింపూలోని హోటల్‌కి చేరాం. జయగావ్‌ నుంచి థింపూ వరకు హిమాలయ పర్వతాలలో నిర్మించిన రహదారిలో ప్రయాణం గొప్ప అనుభూతినిచ్చింది.


180 అడుగుల బుద్ధుడు...

మరునాడు ఉదయం 8 గంటలకు హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ చేసి, థింపూ సందర్శనకు బయలుదేరాం. మొదటగా అక్కడ ఉన్న దుర్గామాత ఆలయాన్ని దర్శించాం. అక్కడ నుంచి శాక్యముని బుద్ధుడి ‘బుద్దా డోర్‌డెన్మా’ కు వెళ్లాం. ఇక్కడ కొండ మీద బుద్ధుడి విగ్రహం 180 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ విగ్రహానికి బంగారు పూత పూశారు. బొట్టు దగ్గర వజ్రం పొదిగారు. అక్కడి నుంచి భూటాన్‌ మ్యూజియానికి చేరుకున్నాం. మ్యూజియంలో భూటాన్‌వాసులు వంటలు చేేస విధానం, పూర్వకాలపు పాత్రలు, వస్త్రధారణ మొదలైనవి ఉన్నాయి. బియ్యం నుంచి సారాయి తయారు చేేస విధానం చూపించారు. వాళ్ళు యాక్‌ జంతువు పాలతో చేసిన ఛీజ్‌ను వాడతారని చెప్పారు.


book9.2.jpg

భూటాన్‌లో సంతాన భాగ్యం కలిగించే బౌద్ధ సన్యాసి ఉండేవాడు. ఆయన పేరు దృక్ప కుంలెయ్‌. మిగతా సన్యాసులు అనుసరించే మార్గానికి భిన్నంగా ఉండేవాడట. అందుకే మిగిలిన లామాలు అతనిని సీరియస్‌గా తీసుకునేవారు కాదు. తన శక్తిని రుజువు చేసుకోవటానికి అతను ఒక జంతువుని సృష్టించాడు. ఆ జంతువు... మేక తల, ఆవు శరీరం కలిగి ఉంటుంది. దాని పేరు ‘టాకిన్‌’. అది భూటాన్‌ జాతీయ జంతువు హోదా కలిగి ఉంది. ఆ లామాకి పునఖా వద్ద ఒక ఆలయం నిర్మించారు. సంతానార్థులైన దంపతులు ఆ ఆలయాన్ని దర్శిస్తారట.


రెండో రోజు జూలో ‘టాకిన్‌’తో పాటు, హ్యాంగింగ్‌ బ్రిడ్జ్‌, దోచులపాస్‌ చూశాం. దోచులపాస్‌ దగ్గర 108 స్మారక స్తూపాలున్నాయి. భూటాన్‌, ఇండియా సరిహద్దులో కొంతమంది అరాచకవాదులు ఇండియాకు వ్యతిరేకంగా అల్లర్లు చేస్తుంటే... భూటాన్‌లో పౌరులకు రెండు రోజులు శిక్షణ ఇచ్చి, సదరు అరాచకవాదుల్ని అణచివేశారని గైడ్‌ చెప్పాడు. అందులో 11 మంది పౌరులు మరణిేస్త... వారి జ్ఞాపకార్థంగా స్తూపాలు నిర్మించారట. భూటాన్‌లో భారతీయుల్ని తమవారిగానే భావిస్తారు. అందరూ హిందీ మాట్లాడతారు. మాకు పారోలో రాత్రి బస ఇవ్వటం వల్ల వెనుదిరిగిపోయాం. భూటాన్‌లో 5 గంటలకే చీకటి పడిపోతుంది. దుకాణాలు 8 గంటలకు మూసేస్తారు. రాత్రి బసకు చేరుకుని విశ్రాంతి తీసుకున్నాం.


book9.3.jpg

కొండపై మఠం...

మూడో రోజు పారో నేషనల్‌ మ్యూజియం, రిన్‌పుంగ్‌జోంగ్‌లని చూస్తే ... నాలుగో రోజు టైగర్‌ నెస్ట్‌కి ట్రెక్కింగ్‌. గ్రూప్‌లో మా అమ్మాయి తప్ప ట్రెక్కింగ్‌ అలవాటు ఉన్నవారెవరు లేరు. పైగా నేను, మావారు 60 ఏళ్లు దాటిన వాళ్ళం. కర్రలు అద్దెకి తీసుకుని, మెల్లగా 8 గంటలకు కొండ ఎక్కడం ప్రారంభించాం. కొండలు, లోయల్లో నడక రమారమి 7 కిలోమీటర్లు నడవాలి. దారిలో జారకుండా దుంగలు అడ్డు వేసి మెట్లు చేసారు. గైడ్‌ కూడా మాతో వచ్చాడు. మొత్తం మీద టైగర్‌ నెస్ట్‌కు చేరేసరికి 4 గంటలు పట్టింది.


book9.4.jpg

అక్కడ ఉన్న మొనాస్ట్రీ (మఠం) 15వ శతాబ్దంలో కట్టారు. ఇది సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. సమతల ప్రదేశం నుంచి వెళ్లిన మాకు మొత్తం 8 గంటలు పట్టింది. అయితే ఒక అందమైన అనుభవం. దారిలో ఎదురైన ప్రతీ ఒక్కరు ఎంతో ప్రోత్సహించారు. చివరగా 500 రాతి మెట్లు దిగాలి. మరల 200 మెట్లు ఎక్కాలి.

అక్కడే ఒక జలపాతం ఉంది. అంత దూరంలో అటువంటి కొండాకోనల్లో మొనాస్ట్రీ నిర్మాణం చాలా శ్రమతో కూడుకున్నది. మొత్తం మీద భూటాన్‌ రాజు గారు కూడా దర్శనం కోసం కొండ నడిచి ఎక్కవలసిందే.


‘మిలేరపా’ వెనుక...

చివరి రోజు తెల్లవారు ఝామున 4 గంటలకే మా ప్రయాణం మొదలుపెట్టాం. పారో నుంచి బాగ్‌ డోగ్రాకి 12 గంటల ప్రయాణం. మాకు మొదటి రోజు కూడా ప్రయాణంలోనే గడిచిపోయింది. ఆ రోజు చూపించాల్సిన ప్రదేశాలు చివరి రోజున కవర్‌ చేశారు. దారిలో పొగమంచుతో కప్పబడిన లోయలు, జలపాతాలు చూస్తూ ‘మిలేరపా’ ఆలయాన్ని చేరాం.

మిలేరపా గురించి చెప్పుకునే ముందు మరొక విషయం ప్రస్తావించాలి. భూటాన్‌ ప్రజలు ఎక్కువ మంది బుద్ధిజాన్ని అనుసరిస్తే... కొందరు హిందూమతాన్ని అనుసరిస్తారు. బుద్ధుడి తరువాత బౌద్ధమతం మూడు మార్గాలుగా విడిపోయింది. మహాయానం, వజ్రయానం, హీనయానం.


భూటాన్లో వజ్రయానం ప్రచారంలో ఉంది. వజ్రయానం తాంత్రిక విధానాలని అనుసరిస్తుంది. మిలేరపా తండ్రి మరణం తరువాత... ఆస్తిని పినతండ్రి, అతని భార్య స్వాధీనం చేసుకుని... మిలేరపా తల్లి, అక్కాచెల్లెళ్లని బాధలు పెడతారు. అప్పుడు ఆయన తల్లి ప్రతీకారం తీర్చుకోమని ప్రోత్సహిస్తుంది. మిలేరపా తాంత్రిక విద్య నేర్చుకుని, దానిని ప్రయోగిేస్త పినతండ్రి, అతని భార్యతో పాటు మరికొందరు మరణిస్తారు. పశ్చాత్తాపం చెంది గురువుని ఆశ్రయిస్తాడు. గురువు మిలేరపాని గుండ్రని ఆకారంలో నివాస యోగ్యంగా ఉండే గృహ నిర్మాణం చేయమని ఆదేశిస్తాడు. ఆ కొండలలో ఎంతో కష్టపడి గృహ నిర్మాణం చేస్తాడు. దానిని చూసి గురువు అది నివాసయోగ్యంగా లేదని, కూలగొట్టి చతురస్రాకారంలో నిర్మించమంటాడు. అలా కట్టిన ఇల్లు కూడా ఆయనకి నచ్చదు. చివరికి గురుపత్ని, గురువు సహకారంతో ఒక గృహాన్ని నిర్మిస్తాడు. ఆయన కైలాస పర్వతంలో సిద్ధి పొందాడని, ప్రాణాలతో తిరిగి వచ్చాడని చెప్పుకుంటారు.


సాంప్రదాయానికి పెద్ద పీట...

భూటాన్‌లో చాలాచోట్ల జెండాలు ఎగురుతూ కనిపిస్తాయి. చిన్నవి, పెద్దవి... రంగురంగుల జెండాలు చనిపోయిన వారి ఆత్మసంతృప్తి కోసం కడతారు. అలాగే కొండల మధ్యలో ఉన్న ఖాళీలలో చిన్న చిచ్చుబుడ్డి ఆకారంలో 108 ఉండలని కూడా చూస్తాం. ఇవి కూడా చనిపోయిన వారికోసం పెడతారు. అలాగే రాళ్ళని ఒకదాని మీద ఒకటి పేరుస్తారు. ఇవన్నీ చనిపోయినవారి పట్ల వారి భక్తిశ్రద్ధలని సూచిస్తాయి.


భూటాన్‌ కొండప్రాంతం కావడం వల్ల అక్కడ పంటలు ఏవీ పండవు. కొద్దిమొత్తంలో వరి పండిస్తారు. కూరగాయాలు ఎక్కువ రకాలు లేవు. ఆపిల్స్‌ మాత్రం విరివిగా దొరుకుతాయి. చాలా వస్తువులు, బియ్యం మొదలైన ఆహార ధాన్యాలు, బట్టలను దిగుమతి చేసుకుంటారు. పర్యాటకం, దానికి అనుబంధంగా ఉండే హోటల్స్‌ మాత్రమే ఉపాధి కల్పనమార్గాలు.

భూటాన్‌లోని ఆచార వ్యవహారాల గురించి కూడా గైడ్‌ వివరించాడు. వారి ముఖ్య ఆహారం అన్నం. ఒక కూర మాత్రమే వండుకుంటారు. దుస్తులను, ఆహార నియమాలను గురువైన జాబ్ర్దుంగ్‌ నామ్‌ గ్యాల్‌ నిర్వచించారు. ఇప్పటికీ ఆ పద్ధతులనే అనుసరిస్తున్నారు. పారో ఎయిర్‌పోర్ట్‌లో విమానాల లాండింగ్‌ అతి క్లిష్టమైనదిగా చెప్పాలి. చుట్టూ కొండలు, వాతావరణ పరిస్థితుల వల్ల కొద్దిమంది నైపుణ్యమున్న పైలట్‌లకు మాత్రమే లైసెన్స్‌ ఉంటుంది.


అతి చిన్నదేశమైనా వాతావరణ కాలుష్యం లేదు. శుభ్రమైన రోడ్లు, ప్రశాంతంగా జీవించే స్థానికులు... నాలుగు రోజులు స్వర్గంలో ఉన్నట్లే అనిపించింది. చివరగా చిన్న ఘటన... మేము టైగర్‌ నెస్ట్‌ నుంచి తిరిగి వస్తుంటే గైడ్‌ నా దగ్గరకు వచ్చి ‘‘నేను వాష్‌రూమ్‌కి వెళ్ళాలి... మీరంతా వచ్చేయండి. కెఫెటేరియా దగ్గర మీట్‌ అవుదాం’’ అని పరుగెత్తాడు. తరువాత చెప్పాడు. ‘‘దారిలో ఆ పని చేస్తుంటే ఎవరైనా చూసి... నువ్వు గైడ్‌వి ... ఇదే నేర్పిస్తావా అని మందలిేస్త బాగుండదు కదా’’ అని. అదీ వారికున్న క్రమశిక్షణ, దేశం పట్ల ఉన్న నిబద్ధత. నిశ్శబ్దంలోని ప్రశాంతతని ఆస్వాదించేవారిని భూటాన్‌ తప్పకుండా సమ్మోహితుల్ని చేస్తుంది.

- ఎస్‌. సుధావల్లి, 98664 39515


ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ప్రియులకు షాక్.. ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

దారి మళ్లింది 42 కోట్లు!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 11 , 2026 | 01:19 PM