పాకిస్థాన్ బన్నూ జిల్లా మార్కా బేరాలో ఐఈడీ పేలుళ్లు.. ఏడుగురి మృతి..
ABN , Publish Date - Jun 20 , 2026 | 05:50 PM
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో శనివారం మధ్యాహ్నం భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల ధాటికి ఏడుగురు మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బన్నూ జిల్లాలోని మార్కా బేరా ప్రాంతంలో చోటుచేసుకుంది.
పాకిస్థాన్: ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఈరోజు (శనివారం) మధ్యాహ్నం భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల ధాటికి ఏడుగురు మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బన్నూ జిల్లాలోని మార్కా బేరా ప్రాంతంలో చోటుచేసుకుంది. బన్నూ జిల్లా పోలీస్ అధికారి (డీపీవో) యాసిర్ అఫ్రిది తెలిపిన వివరాల ప్రకారం, సాధారణ ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. హతి ఖేల్ గ్రామం నుంచి బన్నూ నగరానికి ప్రయాణికులతో కూడిన ఓ వాహనం వెళ్తోంది. అయితే, మార్కా బేరా వద్దకు వాహనం రాగానే రోడ్డు పక్కన అమర్చిన ఐఈడీ ఒక్కసారిగా పేలింది. దీంతో సంఘటనా స్థలంలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ దాడి తర్వాత సహాయక చర్యల కోసం పెద్దఎత్తున స్థానికులు గుమిగూడారు. వారిని లక్ష్యంగా చేసుకుని మరో బాంబు దాడి జరిగినట్లు డీపీవో యాసిర్ అఫ్రిది తెలిపారు. ఈ పేలుడులో మరో ఇద్దరు మృతిచెందారు. రెండు బాంబు దాడుల్లో మొత్తం ఏడుగురు మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలు, క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి పోలీసులు తరలించారు. బాంబు పేలుళ్ల ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ బృందం రంగంలోకి దిగి, పేలుళ్లకు సంబంధించిన సాక్ష్యాల కోసం సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తోంది. మరోవైపు భద్రతా దళాలు మార్కా బేరా ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. కాగా, ఈ దాడులకు ఏ ఉగ్రవాద సంస్థా ఇప్పటివరకు బాధ్యత వహించలేదు.
ఈ ఘటనను ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పేలుళ్లలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధితులకు తమ ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. మరోవైపు, ఘటనపై పూర్తి దర్యాప్తు చేపట్టి నివేదికను సమర్పించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. పేలుళ్లకు దారితీసిన పరిస్థితులపైనా సమగ్ర దర్యాప్తు చేయాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
కాల్పుల విరమణకు తూట్లు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు
ఇరాన్ మహిళకు శిక్షగా 74 కొరడా దెబ్బలు.. ఎందుకంటే..