ఇరాన్ మహిళకు శిక్షగా 74 కొరడా దెబ్బలు.. ఎందుకంటే..
ABN , Publish Date - Jun 20 , 2026 | 02:36 PM
హిజాబ్ లేకుండా సంగీత ప్రదర్శన ఇచ్చిన ఒక ఇరాన్ మహిళకు స్థానిక కోర్టు 74 కొరడా దెబ్బలను శిక్షగా విధించింది. ఈ ఉదంతంపై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: హిజాబ్ ధరించకుండా సంగీత ప్రదర్శన ఇచ్చిన ఒక ఇరాన్ మహిళకు తాజాగా స్థానిక కోర్టు 74 కొరడా దెబ్బలను శిక్షగా విధించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ ఉదంతంపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోమ్ ప్రావిన్స్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, పరాస్తో అహ్మదీ అనే మహిళ 2024లో తన బృందంతో కలిసి యూట్యూబ్ లైవ్‌లో సంగీత ప్రదర్శన ఇచ్చారు. ఇది వైరల్ కావడంతో అధికారులు స్పందించారు. మహిళతో పాటు ఆమె బృందంలోని వారిపై కేసు పెట్టి అరెస్టు చేశారు. ఆ తరువాత బెయిల్‌పై విడుదల చేశారు. పరాస్తో హిజాబ్ ధరించనందుకు స్థానిక కోర్టు తాజాగా కొరడా దెబ్బలను శిక్షగా విధించింది. ఆమె రెండేళ్ల పాటు దేశాన్ని వీడకూడదని కూడా ఆదేశించింది. ఎలాంటి సంగీత కార్యక్రమాలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది.
లైవ్ స్ట్రీమింగ్‌లో పరాస్తో కేవలం దేశభక్తి గేయమే పాడినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, ఆ సమయంలో ఆమె హిజాబ్ లేకుండా, స్లీవ్‌లెస్ దుస్తులు ధరించి కనిపించింది. 2025లో ఇరాన్‌లో తెచ్చిన కొత్త చట్టం ఆధారంగా పరాస్తోకూ శిక్ష విధించినట్టు తెలుస్తోంది.
కొత్త చట్టం ప్రకారం అక్కడ 12 ఏళ్లు, ఆపై వయసున్న బాలికలు, మహిళలందరూ కచ్చితంగా హిజాబ్ ధరించాలి. నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో పాటు గరిష్ఠంగా 15 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పుడమిని పాడుచేసిన ఆరోపణతో మరణ శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
నెతన్యాహు ఓ యోధుడిలాంటి ప్రధాని.. డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు
కాల్పుల విరమణకు తూట్లు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు