Iran Unrest: ముందు మిమ్మల్ని చక్కబెట్టుకోండి.. ట్రంప్‌పై విరుచుకుపడిన ఇరాన్ సుప్రీం లీడర్
ABN , Publish Date - Jan 09 , 2026 | 06:47 PM
అమెరికా సారథ్యంలోని పశ్చిమదేశాల ఆంక్షల కారణంగా ఇరాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశంలో హింసాత్మక ఆందోళనలు కొనసాగుతున్నాయి.
టెహ్రాన్: ఆర్థిక సంక్షోభం పేరుతో ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లపై ఆదేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ(Ayatollah Khamenei) మండిపడ్డారు. మరో దేశం అధ్యక్షుడిని సంతోష పెట్టేందుకు సొంత వీధులను నాశనం చేస్తున్నారంటూ పరోక్షంగా ట్రంప్‌ను ఉద్దేశిస్తూ ఆందోళనకారులను హెచ్చరించారు. విదేశీ శక్తుల చేతుల్లో కిరాయి సైనికుల్లా వ్యవహించే వారిని సహించేది లేదన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాలకు చెప్పే ముందు సొంత దేశంపై దృష్టిపెట్టాలని చురకలు అంటించారు. ట్రంప్ 'అహంభావి' అని, ఆయన త్వరలోనే 'గద్దెదిగుతారు' అని వ్యాఖ్యానించారు. దేశప్రజలను ఉద్దేశించి చేసిన టీవీ ప్రసంగంలో 86 ఏళ్ల ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ ప్రసంగిస్తుండగా బ్యాక్‍గ్రౌండ్‌లో ఉన్న ఆడియెన్స్ 'డెత్ టు అమెరికా' అంటూ నినాదాలు చేశారు.
'వేలాది మంది ప్రజల త్యాగాలు, రక్తదానంతో ఇస్లామిక్ రిపబ్లిక్ అధికారంలోకి వచ్చిందనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇప్పుడు విద్రోహశక్తుల తలొగ్గే ప్రసక్తే లేదు' అని ఖమేనీ అన్నారు. 'వాళ్లు (ఆందోళనకారులు) ఆయనను (ట్రంప్) సంతోష పెట్టాలనుకుంటున్నారు. ఒక దేశాన్ని ఎలా పాలించాలో ఆయనకు తెలిసి ఉంటే ముందు సొంత దేశాన్ని చక్కదిద్దుకోవాలి' అని అన్నారు.
అమెరికా సారథ్యంలోని పశ్చిమదేశాల ఆంక్షల కారణంగా ఇరాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశంలో హింసాత్మక ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనల్లో 42మంది ప్రాణాలు కోల్పోగా.. 2,270 మందికి పైగా ఆందోళనకారులను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ నిరసనలకు అమెరికానే కారణమని ఇరాన్ ఆరోపిస్తోంది. ప్రదర్శకులను పొట్టనపెట్టుకోవడంపై ఇరాన్ ప్రభుత్వాన్ని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ ప్రజలు బలంగా తమ స్వాంతంత్ర్య కాంక్షను చాటుకుంటున్నారని, సొంత దేశంలోనే వారిపై జరుగుతున్న దమనకాండ సిగ్గుచేటని విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌లో మారణహోమం.. దీనంతటికీ కారణం ఎవరు?
అమెరికాకు డెన్మార్క్ హెచ్చరిక.. వస్తే కాల్చి పడేస్తాం..