Share News

US President Donald Trump: భారత్‌పై 500శాతం సుంకాలు?

ABN , Publish Date - Jan 09 , 2026 | 04:21 AM

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌, చైనా, బ్రెజిల్‌ తదితర దేశాలపై ఏకపక్షంగా 500శాతం సుంకాలు విధించేందుకు వీలు కల్పించే బిల్లుకు అమెరికా ......

US President Donald Trump: భారత్‌పై 500శాతం సుంకాలు?

  • రష్యా చమురు కొంటున్న దేశాలపై భారీగా టారి్‌ఫలు విధించే బిల్లుకు ట్రంప్‌ మద్దతు

  • భారత్‌తోపాటు చైనా, బ్రెజిల్‌లపై ప్రభావం

వాషింగ్టన్‌, జనవరి 8: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌, చైనా, బ్రెజిల్‌ తదితర దేశాలపై ఏకపక్షంగా 500శాతం సుంకాలు విధించేందుకు వీలు కల్పించే బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతు తెలిపారు. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి, ఉక్రెయిన్‌తో యుద్ధ విరమణ దిశగా ఒత్తిడి చేయడం లక్ష్యంగా.. రిపబ్లికన్‌ పార్టీ సెనేటర్‌ లిండ్సే గ్రాహమ్‌, ప్రతిపక్ష డెమొక్రటిక్‌ పార్టీ సెనేటర్‌ రిచర్డ్‌ బ్లూమెంథాల్‌ కలిసి ఈ బిల్లును రూపొందించారు. దీనిపై బుధవారం ట్రంప్‌తో భేటీ అయిన లిండ్సే గ్రాహమ్‌ అనంతరం వివరాలను వెల్లడించారు. ‘గ్రాహమ్‌-బ్లుమెంథాల్‌ ఆంక్షల బిల్లు’ గురించి ట్రంప్‌కు వివరించానని.. దీనికి ఆయన మద్దతు పలికారని చెప్పారు. ఉక్రెయిన్‌ శాంతి చర్చల కోసం ముందుకొస్తున్నా కూడా.. పుతిన్‌ మాత్రం దాడులు చేస్తూ, మారణహోమం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. వచ్చే వారమే ఈ బిల్లుపై అమెరికా చట్టసభ ‘సెనేట్‌’లో ఓటింగ్‌ జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

రష్యాపై ఒత్తిడి పెంచేందుకే..

చమురు కొనుగోలు చేస్తున్న దేశాల నుంచి సమకూరుతున్న నిధులతోనే ఉక్రెయిన్‌లో రష్యా నరమేధానికి పాల్పడుతోందని అమెరికా మొదట్నుంచీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. రష్యా చమురును కొనడం ఆపేయాలని చైనా, భారత్‌, బ్రెజిల్‌ తదితర దేశాలపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చింది. భారత్‌పై అయితే 50శాతం సుంకాలు కూడా విధించింది. అయినా రష్యా చమురు కొనుగోళ్లను ఈ దేశాలు తగ్గించలేదు. మరోవైపు ఉక్రెయిన్‌-రష్యా మధ్య శాంతి ఒప్పందంపై చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. కానీ ఒక కొలిక్కి రావడం లేదు. దీనితో రష్యాపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే 500శాతం టారి్‌ఫలు విధించేందుకు వీలు కల్పించేలా ‘గ్రాహమ్‌-బ్లుమెంథాల్‌ ఆంక్షల బిల్లు’ను అమెరికా చట్టసభ సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఇది ఆమోదం పొందితే.. 500శాతం వరకు సుంకాలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడికి అధికారాలు దఖలు పడతాయి.

Updated Date - Jan 09 , 2026 | 04:21 AM