Tehran Erupts In Protests: ఇరాన్‌లో మారణహోమం.. దీనంతటికీ కారణం ఎవరు?
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:46 AM
ఇరాన్‌లో గత కొన్ని వారాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఈ నిరసనలు చివరకు హింసకు దారి తీస్తున్నాయి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నిరసనకారులు మృత్యువాత పడుతున్నారు..
ఇరాన్‌లో ఆర్థిక సమస్యల విషయమై ప్రారంభమైన నిరసనలు రాజకీయ రంగు పులుముకున్నాయి. గత కొన్ని వారాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఈ నిరసనలు చివరకు హింసకు దారి తీస్తున్నాయి. నిరసనకారులు పెద్ద ఎత్తున మృత్యువాతపడుతున్నారు. స్థానిక మీడియా కథనాల మేరకు ఇప్పటి వరకు దాదాపు 42 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇంటర్‌నెట్ సేవలను నిలిపేసింది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ కాల్స్‌ను కూడా నిలిపేసింది. అజ్ఞాతంలో ఉన్న క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లావి పిలుపు మేరకు నిరసనకారులు గురువారం ఆందోళన చేపట్టారు. వీధుల్లోకి వచ్చి అలజడి సృష్టించారు.
నిరసనలకు పిలుపునిచ్చిన రెజా..
పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా కథనాల మేరకు.. ఇరాన్‌లో 1979 వరకు పహ్లావి డైనస్టీ అధికారంలో ఉండేది. 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ కారణంగా అధికారంలో ఉన్న మహ్మద్ రెజా పహ్లావి దేశం వదిలి పారిపోయారు. ఇరాన్ మొదటి సుప్రీం లీడర్ రుహోల్లా ముసావి ఖమేనీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆయన 1989లో చనిపోయారు. అప్పటినుంచి అయతుల్లా అలీ ఖమేనీ సుప్రీం లీడర్‌గా ఉంటున్నారు. 1989 నుంచి ఇప్పటి వరకు అయతుల్లా మద్దతుదారులే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు.. అయితే, మహ్మద్ రెజ పహ్లావీ కుమారుడు క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లావీ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి తెరతీశారు.
కొద్ది రోజుల క్రితం ఆయన వీడియో ద్వారా ఇరాన్ ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. ‘మీరు ఎక్కడ ఉన్నా సరే.. గురు, శుక్రవారం రాత్రి సరిగ్గా 8 గంటలకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకేసారి నినాదాలు చేయండి. ప్రపంచ దేశాల చూపు మీ మీద ఉంది. కలిసికట్టుగా వీధుల్లోకి రండి.. నినాదాలు చేయండి. మీ డిమాండ్లు ఏంటో చెప్పండి. నేను ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకులను హెచ్చరిస్తున్నాను. ప్రపంచం మొత్తం చూస్తోంది. డొనాల్డ్ ట్రంప్ కూడా చూస్తున్నారు. ప్రజలని తొక్కి పెడితే ఊరుకోం’ అని అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలు మీడియా ఛానళ్లు కూడా ఈ వీడియోను ప్రసారం చేశాయి.
రెజా పిలుపు మేరకు గురువారం రాత్రి ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. గట్టిగట్టిగా నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పి హింసకు దారి తీసింది. ఆందోళనకారులను అదుపు చేయడానికి భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు. నిరసనకారులపై కాల్పులు జరపడంతో పలువురు చనిపోయారు. గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌లో ఆందోళనకారులు చనిపోవడంపై స్పందించారు. ‘శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తున్న వారిని చంపితే ఊరుకోం. వారిని కాపాడటానికి అమెరికా రంగంలోకి దిగుతుంది’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి..
చీము, నెత్తురు ఉంటే.. తాడిపత్రికి రండి..!