Share News

నిలిచిపోయిన యాపిల్‌ సేవలు

ABN , Publish Date - Nov 18 , 2026 | 06:00 AM

ప్రముఖ టెక్నాలజీ సంస్థ యాపిల్‌కు చెందిన పలు ఆన్‌లైన్‌ సేవల్లో మంగళవారం రాత్రి తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి.

నిలిచిపోయిన యాపిల్‌ సేవలు
apple

  • ఐక్లౌడ్‌, యాప్‌స్టోర్‌, యాపిల్‌ పే, మ్యూజిక్‌ వినియోగంలో అంతరాయం

  • తొలుత యూరప్‌, అమెరికాలలో.. తర్వాత ప్రపంచవ్యాప్తంగా సమస్య

న్యూయార్క్‌, నవంబరు 17: ప్రముఖ టెక్నాలజీ సంస్థ యాపిల్‌కు చెందిన పలు ఆన్‌లైన్‌ సేవల్లో మంగళవారం రాత్రి తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి. ఐక్లౌడ్‌, యాప్‌ స్టోర్‌, యాపిల్‌ పే, యాపిల్‌ సపోర్ట్‌ సహా పలు సేవలు నిలిచిపోయినట్టు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సేవల్లో అంతరాయాలను నమోదు చేసే డౌన్‌డిటెక్టర్‌ ఈ వివరాలను వెల్లడించింది.తొలుత అమెరికా, యూరప్‌ దేశాల్లో ఇబ్బందులు మొదలయ్యాయని, తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సమస్య నెలకొందని తెలిపింది. ఐఫోన్లు, మ్యాక్‌ కంప్యూటర్లలో ఐక్లౌడ్‌ అకౌంట్ల నుంచి అకస్మాత్తుగా లాగౌట్‌ కావడం, తిరిగి లాగిన్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తే విఫలం కావడం, తెలియని ఎర్రర్‌ సందేశాలు రావడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. యాప్‌ స్టోర్‌ తెరుచుకోకపోవడం, యాప్‌ల డౌన్‌లోడ్లు, అప్‌డేట్లు నిలిచిపోవడం, యాపిల్‌ పే ద్వారా చెల్లింపుల్లో ఇబ్బందులు తలెత్తాయి. కొత్త పరికరాల యాక్టివేషన్‌, యాపిల్‌ మ్యూజిక్‌, డెవలపర్ల కోసం ఉద్దేశించిన యాప్‌ స్టోర్‌ కనెక్ట్‌ సేవలపైనా ప్రభావం పడింది. నిజానికి మంగళవారం మధ్యాహ్నమే యాపిల్‌ సబ్‌స్ర్కిప్షన్‌ సేవల్లో సమస్యను గుర్తించి, పరిష్కరించారు. రాత్రికల్లా ఇతర సేవల్లో అంతరాయాలు తలెత్తాయి. దీనికి కారణం సైబర్‌ దాడులా, సాంకేతితక సమస్యలా అన్నది తేలలేదు. యాపిల్‌ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గత వారంలో మైక్రోసాఫ్ట్‌ 365, ఔట్‌లుక్‌, కోపైలట్‌ సేవల్లో.. జేపీ మోర్గాన్‌ చేజ్‌ బ్యాంకింగ్‌ సేవల్లో అంతరాయాలు తలెత్తిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. వంతెన పైనుంచి లోయలోకి దూసుకెళ్లి..

ముద్దంటూ విదేశీయురాలిని వేధించిన వ్యక్తి.. కట్ చేస్తే జైల్లో..

Updated Date - Nov 18 , 2026 | 06:03 AM