Share News

‘సంపాదకీయ నిర్ణయాలకు ఏఐ ప్రత్యామ్నాయం కాకూడదు’

ABN , Publish Date - Mar 31 , 2026 | 09:59 PM

ఇన్వెస్టిగేషన్స్ ఎడిటర్‌, ఏఐ శిక్షకుడు సుధాకర్ రెడ్డి ఉడుముల భూటాన్‌లో జరిగిన కృత్రిమ మేధస్సు, మీడియా, డిజిటల్ మార్పులపై నిర్వహించిన కీలక సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో శిక్షకుడిగా, ప్యానెల్ స్పీకర్‌గా ఆయన కీలక ప్రసంగం చేశారు.

‘సంపాదకీయ నిర్ణయాలకు ఏఐ ప్రత్యామ్నాయం కాకూడదు’

థింపూ: ఇన్వెస్టిగేషన్స్ ఎడిటర్‌, ఏఐ శిక్షకుడు సుధాకర్ రెడ్డి ఉడుముల భూటాన్‌లో జరిగిన కృత్రిమ మేధస్సు, మీడియా, డిజిటల్ మార్పులపై నిర్వహించిన కీలక సదస్సులో పాల్గొన్నారు. మార్చి 30, 31 తేదీల్లో జరిగిన ఈ సదస్సులో శిక్షకుడిగా, ప్యానెల్ స్పీకర్‌గా కీలక ప్రసంగం చేశారు. భూటాన్ మీడియా ఫౌండేషన్ నిర్వహించిన ఈ సదస్సును ఆ దేశ ప్రధాన మంత్రి దాషో షెరింగ్ టోబ్గే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భూటాన్ జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు, నేషనల్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.


ఈ సదస్సులో రాయల్ థింపూ కాలేజ్‌కు చెందిన ప్రొఫెసర్ పల్లవి మజుందార్, కాంట్రైల్స్ ఏఐకు చెందిన అమితాబ్ కుమార్ కూడా శిక్షకులుగా పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా సుధాకర్ రెడ్డి ఉడుముల, పల్లవి మజుందార్, అమితాభ్ కుమార్‌లతో ప్రధానమంత్రి దాషో షెరింగ్ టోబ్గే మాట్లాడారు.


పత్రికారంగంలో కృత్రిమ మేధస్సు పాత్రపై ఉడుముల మాట్లాడుతూ.. ‘జర్నలిజం, దర్యాప్తు కథనాలు, ధృవీకరణ, పంపిణీ, న్యూస్‌రూమ్ పనితీరులో ఏఐ పెద్ద మార్పులు తీసుకొస్తోంది. నాణ్యత పెంపు, సమాచారం సేకరణ మెరుగుదల, పునరావృత పనుల్లో వేగం పెంపు, పంపిణీ బలోపేతానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే రిపోర్టింగ్, ధృవీకరణ, సంపాదకీయ నిర్ణయాలకు ఇది ప్రత్యామ్నాయం కాదు’ అని చెప్పారు.

Sudhakar-Udumula-2.jpg


మానవ పర్యవేక్షణ అవసరం..

దర్యాప్తు జర్నలిజంలో పెద్ద డేటా విశ్లేషణ, పత్రాల పరిశీలన, నమూనాల గుర్తింపు, ట్రాన్‌స్క్రిప్షన్, అనువాదం, ధృవీకరణ పనుల్లో ఏఐ సహాయపడుతుందని ఉడుముల వివరించారు. అదే సమయంలో తప్పుడు సమాచారం, నకిలీ వ్యాఖ్యలు, పాక్షికత, అతి విశ్వాసం వంటి ప్రమాదాలూ ఉన్నాయని ఆయన హెచ్చరించారు. మానవ పర్యవేక్షణ అవసరం ఉందని స్పష్టం చేశారు.


జాగ్రత్తగా ఉండాలి..

పత్రికారంగంలో ఏఐ వినియోగం బాధ్యతాయుతంగా ఉండాలంటే స్పష్టమైన సూచనలు, నైతిక నియంత్రణలు, పారదర్శకత, బాధ్యత, డీప్‌ఫేక్‌లపై జాగ్రత్త అవసరమని ఉడుముల పేర్కొన్నారు. ‘ఏఐ జర్నలిస్టులకు సహాయక సాధనంగా ఉండాలి. సంపాదకీయ నిర్ణయాలకు ప్రత్యామ్నాయం కాకూడదు’ అని తెలిపారు.


Also Read:

అంగన్వాడీ కేంద్రాలకు హాఫ్ డే..

ట్యాంక్ బండ్ శివకు సాయం అందించిన సీఎం రేవంత్

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో పొగలు.. లక్నోలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

Updated Date - Mar 31 , 2026 | 10:44 PM