ట్యాంక్‌బండ్ శివకు సాయం అందించిన సీఎం రేవంత్
ABN , Publish Date - Mar 31 , 2026 | 09:37 PM
హుస్సేన్ సాగర్ వద్ద ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ట్యాంక్‌బండ్ శివకు తెలంగాణ ప్రభుత్వం సాయం అందించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ట్యాంక్ బండ్ శివకు రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సాయం అందించారు.
హైదరాబాద్, మార్చి 31: హుస్సేన్ సాగర్ వద్ద ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ట్యాంక్‌బండ్ శివకు తెలంగాణ ప్రభుత్వం సాయం అందించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ట్యాంక్‌బండ్ శివకు రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అందించారు. అలాగే అతని కుమారుడు వేణుమాధవ్‌కు హోంగార్డు ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు.
ట్యాంక్‌బండ్‌పై ఎంతో మంది ప్రాణాలను శివ కాపాడారు. శివ దీన పరిస్థితి ఇటీవల ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లింది. ఉపాధి లేక కుటుంబ పోషణ భారంతో అతని కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. అతనికి అవసరమైన సాయం అందించాలని కొద్ది రోజుల క్రితం ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన విషయం విదితమే.
ఉపాధి కోసం ట్యాంక్‌బండ్ సమీపంలో ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించి ఇవ్వాలని సీఎంను శివ కోరారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం. అలాగే శివ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కూడా స్పష్టం చేశారు. సీఎం చేతుల మీదుగా సాయం అందుకోవడం సంతోషంగా ఉందని ట్యాంక్‌బండ్ శివతోపాటు అతడి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.