కృత్రిమ మేధతో పదేళ్లలోక్యాన్సర్ కనుమరుగు!
ABN , Publish Date - Nov 12 , 2026 | 02:21 AM
కృత్రిమమేధ (ఏఐ) రంగంలో కొనసాగుతున్న అభివృద్ధితో రానున్న పదేళ్లలోపే క్యాన్సర్, అల్జీమర్స్, గుండెజబ్బులు, మానసిక వ్యాధులు కనుమరుగవుతాయని ప్రముఖ ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్ సీఈవో డారియో ఎమోడై అభిప్రాయపడ్డారు.
అల్జీమర్స్, గుండెజబ్బులు, మానసిక సమస్యలూ..
ఏళ్ల తరబడి జరిగే పరిశోధనలు ఇక వారాల్లోనే
మానవాళికి అద్భుత వైద్యసేవలు అందుబాటులోకి
ఆంథ్రోపిక్ సీఈవో డారియో ఎమోడై వ్యాఖ్య
వైద్యరంగంలో సంచలనాలు నమోదవుతాయి
పలు ఏఐ కంపెనీల అధిపతుల అంచనాలు
ఖండించిన ఔషధ తయారీ సంస్థలు
ఏఐతో క్లినికల్ ట్రయల్స్, సమీక్షలకు పట్టే సమయం తగ్గదని వెల్లడి
వాషింగ్టన్, నవంబరు 11: కృత్రిమమేధ (ఏఐ) రంగంలో కొనసాగుతున్న అభివృద్ధితో రానున్న పదేళ్లలోపే క్యాన్సర్, అల్జీమర్స్, గుండెజబ్బులు, మానసిక వ్యాధులు కనుమరుగవుతాయని ప్రముఖ ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్ సీఈవో డారియో ఎమోడై అభిప్రాయపడ్డారు. వెయ్యి సంవత్సరాలుగా మానవాళిని ఇబ్బంది పెడుతున్న పలు వ్యాధులను నిర్మూలించి, అద్భుతాలను సృష్టించే కాలం త్వరలో సాకారం కానుందన్నారు. ఏఐతో వైద్యరంగంలో సంచలనాలు నమోదవుతాయని ఇతర ఏఐ కంపెనీ అధిపతులు కూడాపేర్కొనటం విశేషం. వైద్య పరిశోధనలకు పట్టే దశాబ్దాల కాలాన్ని ఏఐ కొన్ని వారాలకు కుదిస్తుందని, తద్వారా పదేళ్లలో అన్ని రకాల వ్యాధులకు పరిష్కారాలు ఆవిష్కృతమవుతాయని లేదా వ్యాధులే కనుమరుగవుతాయని గూగుల్ ఏఐ విభాగం ఇంఛార్జి డెమిస్ హసబిస్ పేర్కొన్నారు. జీవశాస్త్రరంగంలో జరిగే పరిశోధనలను ఏఐ విప్లవాత్మకంగా మార్చి వేస్తుందని, 20 కోట్లకుపైగా ప్రోటీన్ ఆకృతులను మ్యాపింగ్ చేసిన ఆల్ఫాఫోల్డ్ దీనికి ఒక ఉదాహరణ అని చెప్పారు. అమెరికా అధ్యక్షుడికి ఎటువంటి వైద్యసేవలు అందుబాటులో ఉంటాయో.. రానున్న రోజుల్లో మానవాళికి అంతటికీ ఆ స్థాయి వైద్యసేవలు లభిస్తాయని, ఏఐతో ఇది సాధ్యం కానుందని ఎలాన్ మస్క్ ఇటీవల పేర్కొన్నారు.
ఏఐ మోడల్స్‌కు అంత పరిజ్ఞానం లేదు
ఔషధ కంపెనీలు మాత్రం ఈ అంచనాలను తోసిపుచ్చుతున్నాయి.ఇవన్నీ పనికిమాలిన మాటలని వర్టెక్స్ ఫార్మా కార్యనిర్వాహక చైర్మన్ జెఫ్ లీడెన్ పేర్కొన్నారు. ఏఐ సామర్థ్యాన్ని పరీక్షించటం కోసం తాము దాదాపు 10 వేల ఔషధ సమ్మేళనాల వివరాలను 50ఏఐ కంపెనీలకు ఇచ్చామని, ఏ కంపెనీ కూడా తమంతట తాము ఒక్క ఔషధాన్నీ రూపొందించలేకపోయిందని వెల్లడించారు. ఇదే అభిప్రాయాన్ని ఇతర ఔషధ కంపెనీల అధిపతులు కూడా వ్యక్తం చేశారు. ఏఐతో కొత్త అణువుల ఆవిష్కరణలు వేగవంతమవుతాయని, అయితే.. ఒక ఔషధం తయారీలో ఇది ప్రారంభం మాత్రమేనని తెలిపారు. ఆ తర్వాత ప్రయోగశాలలో జంతువుల మీద ప్రయోగాలు, ఆ తర్వాత మనుష్యుల మీద పరీక్షలు, నిపుణుల, ప్రభుత్వ సంస్థల సమీక్షలు వంటి దశలన్నింటినీ దాటుకొని ఒక కొత్త ఔషధం మార్కెట్లోకి విడుదలవుతుందని గుర్తు చేశారు. ఏఐ ఎంత అభివృద్ధి చెందినా ఈ దశలన్నీ ఉంటాయని, వీటికి 10-12 ఏళ్ల సమయం పడుతుందని పేర్కొన్నారు. విశ్వసనీయమైన వైద్య చికిత్సలను అభివృద్ధి చేయటానికి కావాల్సిన లోతైన జీవశాస్త్ర పరిజ్ఞానం ప్రస్తుత ఏఐ మోడల్స్‌కు లేదని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఎన్విడియా సీఈవో అఫైర్.. ఏడాది క్రితమే ట్రంప్‌నకు తెలుసా..
యుద్ధానికి ముగింపు పలకాలంటే.. అమెరికాకు ఇరాన్ ఏం చెప్పిందంటే.