Cooking Dal - Bloating Foam: పప్పు వండేటప్పుడు నురగ.. ఇది హానికరమా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..
ABN , Publish Date - Jan 05 , 2026 | 04:08 PM
సాధారణంగా అందరూ తినే పప్పు విషయంలో జనాల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా పప్పు వండేటప్పుడు కనిపించే నురగ హానికారకమని కొందరు అనుకుంటూ ఉంటారు. అయితే, పప్పుకు సంబంధించిన వాస్తవాలేమిటో కూడా వైద్యులు చెబుతున్నారు. అవేంటంటే..
ఇంటర్నెట్ డెస్క్: పప్పు తినని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే, కొందరు మాత్రం పప్పు తినడానికి ఆసక్తి చూపరు. కడుపుబ్బరమని, అరగట్లేదని, గ్యాస్ సమస్య వేధిస్తుందని భయపడతారు. ఇక పప్పు వండేటప్పుడు వచ్చే నురగ హానికరమని కూడా కొందరు అనుకుంటారు. ఈ విషయంలో డాక్టర్లు పలు కీలక విషయాలు వివరించారు. (Cooking Dal - Foam Myths and Facts).
సాధారణంగా వండే సమయంలో పప్పుపై లేత పసుపుపచ్చ రంగులో నురగ ఏర్పడుతుంది. ఇది పూర్తిగా సహజసిద్ధమైనదని నిపుణులు చెబుతున్నారు. ఈ నురగలో ప్రధానంగా ప్రొటీన్లు (Proteins), స్టార్చ్ (Carbohydrates) అనే పిండిపదార్థం ఉంటుంది. వండేటప్పుడు పప్పులకు నీరు తగిలి ఇవి విడుదల అవుతాయి. పప్పును వేడి చేసే క్రమంలో అందులోని ప్రొటీన్‌లు మార్పులకు లోనవుతాయి. వాటిల్లో ఆవిరి, గాలి చిక్కుకుని నురగ రూపంలో పైకి తేలుతాయి. అదే సమయంలో పప్పులకు పైపొరగా ఉండే స్టార్చ్ కూడా వదులుగా మారి మరింత నురగకు కారణం అవుతుంది.
చాలా మంది ఈ నురగను విషపూరితమని భావిస్తారని, కానీ ఇది పూర్తిగా అపోహ మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. ఈ నురగలో స్టార్చ్, ప్రొటీన్లతో పాటు శాపోనిన్స్ (Saponins) అనే రసాయనాలు కూడా ఉంటాయి. శాపోనిన్స్ మొక్కలకు సహజసిద్ధ రక్షణ వ్యవస్థగా ఉపయోగపడతాయి. వీటికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ కొలెస్టరాల్ గుణాలు కూడా ఉండటంతో స్వల్ప మొత్తంలో తీసుకున్నప్పుడు మనుషులకూ ఉపయోగకరమేనని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఈ నురగ ఎక్కువైతే మాత్రం నోరు చేదుగా అనిపించడంతో పాటు పేగుల్లోపలి పొర కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఇక ఇరిటబుల్ బావెల్ సిండ్రోమ్‌తో (ఐబీఎస్) ఇబ్బంది పడే వారు స్వల్ప మొత్తంలో శాపోనిన్స్‌ను తీసుకున్నా ఇబ్బంది పడతారు. కాబట్టి, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.
పప్పుతో కడుపుబ్బరం.. కారణం ఇదీ!
పప్పుల్లోని ఎఫ్ఓడీఎమ్ఏపీఎస్ (FODMAPS) అనే పిండిపదార్థాలే కడుపుబ్బరానికి దారి తీస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఫ్రక్టాన్స్, జీఓఎస్ వంటి ఒలీగోశాకరైడ్ పదార్థాలు, లాక్టోస్ వంటి డైశాకరైడ్స్, కొన్ని మోనోశాకరైడ్స్, సార్బిటాల్, మానిటాల్ వంటి పాలీయాల్స్‌ను ఎఫ్ఓడీఎమ్ఏపీఎస్ పదార్థాలుగా పిలుస్తారు. వీటిని కడుపులోని చిన్న పేగు పూర్తిస్థాయిలో గ్రహించలేదు. ఇలాంటి సందర్భాల్లో ఇవి పెద్ద పేగులోకి చేరుకుంటాయి. అక్కడి బ్యాక్టీరియా వీటిని పులియబెడతాయి. ఫలితంగా విడుదలయ్యే గ్యాస్.. కడుపుబ్బరం, నొప్పి, కడుపులో అసౌకర్యం వంటి వాటికి దారి తీస్తాయి. ఐబీఎస్‌తో బాధపడే వారికి ఈ సమస్య మరింత అధికం. అంతమాత్రానికే పప్పును చూసి భయపడాల్సిన అవసరం లేదని, కొందరికి దీన్ని జీర్ణం చేసుకోవడం కాస్త కష్టమని వైద్యులు వివరిస్తున్నారు.
కడుపుబ్బరం రాకుండా ఉండేందుకు..
అధిక ఉష్ణోగ్రతల వద్ద పప్పును పూర్తిస్థాయిలో వండితే ఎఫ్ఓడీఎమ్ఏపీఎస్, శాపోనిన్స్ వంటివి పూర్తిగా విచ్ఛిన్నమై ఎలాంటి ఇబ్బందినీ కలుగజేయవు. కాబట్టి, పప్పును వండేటప్పుడు బాగా నానబెట్టి, శుభ్రంగా కడిగి వండితే ఎలాంటి సమస్యలు రావని వైద్యులు సూచిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ సూచనను అమల్లో పెట్టేయండి.
ఇవీ చదవండి:
పుస్తకపఠనం అలవాటు ఎక్కువగా ఉన్న దేశాలు ఏవో తెలుసా
వాటర్ ప్యూరిఫయ్యర్‌ను కొంటున్నారా.. మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే..