Water Purifier: వాటర్ ప్యూరిఫయ్యర్‌ను కొంటున్నారా.. మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే..
ABN , Publish Date - Dec 20 , 2025 | 02:43 PM
వాటర్ ప్యూరిఫయ్యర్ కొనాలని అనుకునే వారికి కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలిసుండాలి. ముఖ్యంగా ప్యూరిఫయ్యర్‌లో ఎలాంటి ఫీచర్స్ ఉండాలో ఈ కథనంలో తెలుసుకుందాం పదండి.
ఇంటర్నెట్ డెస్క్: నగర జనాభా పెరుగుతోంది కానీ ఆ స్థాయిలో మౌలిక వసతుల అభివృద్ధి మాత్రం లేదనే చెప్పాలి. దీంతో, అనేక మంది వాయు, నీటి కాలుష్యం బారిన పడుతున్నారు. ముఖ్యంగా నీటి పైపులు పాతపడటం వంటి సమస్యల కారణంగా నీటి నాణ్యత ఎప్పుడూ ఒకేలా ఉండటం లేదని వినియోగదారులు ఫిర్యాదు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఇంట్లో వాటర్ ప్యూరిఫయ్యర్ ఓ నిత్యావసరంగా మారింది. మరి వీటిని కొనేటప్పుడు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం (Must Have Features in Water Purifiers).
నీటిలో కరిగున్న రకరకాల పదార్థాలను టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్ (టీడీఎస్) అని పిలుస్తారు. నీటి నాణ్యతకు ఇదే కొలమానం. కాల్షియం, సోడియం లాంటి లవణాలు, కార్బోనేట్స్, క్లోరైడ్స్, ఇతర ఆర్గానిక్ పదార్థాలు వంటివన్నీ టీడీఎస్ పరిధిలోకి వస్తాయి. వీటి స్థాయి 50-150 పీపీఎమ్ మధ్య ఉంటే నీటి నాణ్యత గొప్పగా ఉందని అర్థం. 550 పీపీఎమ్ వరకూ కూడా టీడీఎస్ సురక్షితమేనని డబ్ల్యూహెచ్ఓ నిబంధనలు చెబుతున్నాయి. కానీ టీడీఎస్ వెయ్యి పీపీఎమ్ స్థాయిని దాటిన నీటిని మాత్రం తాగకూడదు.
కాబట్టి స్వచ్ఛమైన నీటిని అందించేందుకు వాటర్ ప్యూరిఫయ్యర్స్‌లో కొన్ని ఫీచర్స్ కచ్చితంగా ఉండాలని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
ఆర్‌ఓ, యూవీ, యూఎఫ్, యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టరేషన్ ఫీచర్స్ అన్నీ ఉన్న ప్యూరిఫయ్యర్‌ను ఎంచుకుంటే నీటిలోని అన్ని రకాల మలినాలు తొలగిపోతాయి.
మినరల్ రిటెన్షన్ లేదా రీ ఇన్‌ఫ్యూషన్ ఉన్న ప్యూరిఫయ్యర్ నీటికి కావాల్సిన ఖనిజాలను జోడించి రుచిని మెరుగుపరుస్తుంది.
నీటి నాణ్యత తరచూ మారే ప్రాంతాల్లో ఉన్న వారు అడ్జస్టబుల్ టీడీఎస్ కంట్రోల్ ఫీచర్ ఉన్న ప్యూరిఫయ్యర్‌లను ఎంచుకోవాలి.
సర్వీసింగ్ ఖర్చు ఎక్కువ కాకుండా ఉండాలంటే ఎక్కువ కాలం నిలిచుండే ఫిల్టర్‌లు ఉన్న వాటర్ ప్యూరిఫయ్యర్‌లను ఎంచుకోవాలి. దీంతో, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి.
ఇక ఫీల్టర్ నాణ్యత, నీటి నాణ్యత, పరికరం దానంతట అదే ఆఫ్ అయ్యేలా ఆటో షట్ ఆఫ్ ఫీచర్ ఉన్న ప్యూరిఫయ్యర్‌ను తప్పనిసరిగా ఎంచుకోవాలి.
నీటి ఉష్ణోగ్రతను నియంత్రించేలా టెంపరేచర్ కంట్రోల్ ఉన్న ప్యూరిఫయ్యర్‌నే ఎంచుకోవాలని కూడా నిపుణులు చెబుతున్నారు. దీంతో, నీటిని అన్ని రకాల అవసరాలకు వినియోగించుకోవచ్చని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
ఉదయం పూట ఇలా చేస్తారా.. చిన్నతనంలోనే వార్ధక్య లక్షణాలు వస్తాయి జాగ్రత్త!
నా కుమారుడు రోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తాడు: నటుడు మాధవన్