Share News

Healthy without Exercise: ఆరోగ్యానికి భారీ కసరత్తులు తప్పనిసరి అని భావిస్తున్నారా.. ఈ ప్రొఫెసర్ ఏం చెబుతున్నారంటే..

ABN , Publish Date - Aug 12 , 2025 | 09:32 AM

మంచి ఆరోగ్యం కోసం భారీ కసరత్తులు అవసరం లేదని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు తాజాగా పేర్కొన్నారు. శరీరాన్ని నిత్యం కదిలిస్తూ ఉన్నా మంచి ప్రయోజనాలు కలుగుతాయని భరోసా ఇస్తున్నారు. ఒంట్లోని కండరాలకు ఎంతో కొంత పని చెప్పడమే ప్రధాన సూత్రమని వివరించారు,

Healthy without Exercise: ఆరోగ్యానికి భారీ కసరత్తులు తప్పనిసరి అని భావిస్తున్నారా.. ఈ ప్రొఫెసర్ ఏం చెబుతున్నారంటే..
Stay Healthy Without Intense Exercising

ఇంటర్నెట్ డెస్క్: ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కసరత్తులు అవసరం అని అందరికీ తెలిసిందే. అయితే, వివిధ కారణాలతో అనేక మంది క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజులు చేయలేకపోతుంటారు. కసరత్తులకు ప్రత్యామ్నాయమే లేదనుకుని నిరాశలో కూరుకుపోతారు. చివరికి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. అయితే, కసరత్తులు చేయకపోతే ఆరోగ్యాన్ని కాపాడుకోలేమన్న భావన తప్పని హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ ఐ-మిన్ లీ చెబుతున్నారు. సుదీర్ఘ పరిశోధన ఆధారంగా ఆయన ఈ సూచన చేశారు. లీ చెప్పే దాని ప్రకారం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కఠినమైన వ్యాయామాలు తప్పనిసరి కాదు. ఒక చోట కూర్చుండిపోకుండా నిత్యం శరీరాన్ని ఎంతో కొంత కదిలిస్తూ ఉంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.

వ్యాయామం లేకున్నా ఇలా చేస్తే..

శరీరంలోని కండరాలకు నిత్యం ఏదోక పని చెప్పాలని ప్రొఫెసర్ లీ సూచిస్తున్నారు. శరీరాన్ని తరచూ కదిలించడం ద్వారా కొవ్వులు, చక్కెరలు ఖర్చవుతాయి. ఫలితంగా దృఢత్వం, ఆరోగ్యం కలుగుతాయి. ఎక్సర్‌సైజులు చేయలేని వారు ఇలా నిత్యం కాళ్లు, చేతులను కదుపుతూ ఉంటే ఆరోగ్యంపై సానుకూల ప్రభావం పడుతుంది. కఠినమైన వ్యాయామం చేయలేని వారు కూడా సాధారణ, సులభమైన కదలికల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. వ్యక్తుల ఆరోగ్య లక్ష్యాలను బట్టి కూడా వారు చేయాల్సిన శ్రమ తీవ్రత ఆధార పడి ఉంటుందట. ఉదాహరణకు బరువు తగ్గాలనుకునే వారికి కసరత్తు మినహా మరో మార్గం లేదు.


మిగతా వారు మాత్రం స్వల్ప కదలికలతో అధిక లాభం పొందొచ్చు. మెట్లు ఎక్కడం, ఇంటి పనులు చేయడం, నడక వంటి చిన్న చిన్న చర్యలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇలాంటి చర్యల ద్వారా మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. కాబట్టి, రోజూ శరీరానికి ఎంతో కొంత పని చెప్పాలని ప్రొఫెసర్ లీ సలహా ఇచ్చారు.

వీటితో పాటు కంటి నిండా నిద్ర, సరైన ఆహారం, నీరు తాగడం వంటి జీవనశైలి మార్పులు కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు అవసరం. తద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటే బిజీగా ఉండే వారు కూడా తమ ఆరోగ్యాన్ని కలకాలం కాపాడుకోగలుగుతారని ప్రొఫెసర్ లీ భరోసా ఇస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఈ సూచనలను ఫాలో అయిపోండి.


ఇవి కూడా చదవండి:

బీపీ ఔషధాలు పని చేయట్లేదా.. కారణాలు ఇవే..

ఈ పొరపాట్లు చేస్తున్నారా.. జీవక్రియలు నెమ్మదిస్తాయి జాగ్రత్త

Read Latest and Health News

Updated Date - Aug 12 , 2025 | 09:59 AM