Quit Sugar for 14 Days: 14 రోజుల పాటు చక్కెర తినకుండా ఉంటే..
ABN , Publish Date - Jan 05 , 2026 | 09:42 PM
14 రోజుల పాటు చక్కెర తినకుండా ఉంటే శరీరంలో అనేక మేలిమార్పులు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో విపులంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: మనం తినే ప్రతి ఆహారంలోనూ చక్కెర ఉంటుంది. స్వీట్స్ మొదలు మనం ఆరోగ్యకరమైన ఆహారాలుగా చెప్పుకునే వాటిల్లో కూడా చక్కెరలు ఉంటాయి. అయితే, చక్కెర అతిగా తింటే మాత్రం అనారోగ్యాలు ముంచెత్తుతాయి. ఊబకాయం, షుగర్ వ్యాధి, పళ్లు పుచ్చిపోవడం వంటి సమస్యలు మొదలవుతాయి. కాబట్టి, చక్కెర తినడాన్ని మానేస్తే రోజుల వ్యవధిలోనే ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు (Benefits of Not Eating Sugar for 14 Days).
వైద్యులు చెప్పేదాని ప్రకారం, చక్కెర తినడమంటే కేవలం అదనపు కెలొరీలు తీసుకోవడం మాత్రమే కాదు. ఆకలి, ఇన్సులీన్ పనితీరు, లివర్‌లో కొవ్వు పేరుకోవడం వంటి అనేక ప్రక్రియలను చక్కెర ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావాలను తగ్గించేందుకు ముందుగా చక్కెరను 14 రోజులు మానేస్తే శరీరం చాలా వరకూ కోలుకుంటుందని వైద్యులు చెబుతున్నారు.
చక్కెర తినడం మానేయగానే శరీరంలో మార్పులు మొదలవుతాయి. ఈ కొత్త స్థితికి అనుగుణంగా ముందు మెదడు అలవాటు పడటం ప్రారంభిస్తుంది. తొలుత ఆకలి పెరిగినట్టు అనిపిస్తుంది. తలనొప్పి, అలసట, చికాకు, మెదడు స్తబ్దుగా ఉన్నట్టు అనిపిస్తుంది. కొత్త శారీరక స్థితికి మెదడు అలవాటు పడే క్రమంలో ఇవన్నీ సాధారణమేనని నిపుణులు చెబుతున్నారు.
అయితే, శరీరం అలవాటు పడే కొద్దీ మేలిమార్పులు కనిపించడం ప్రారంభిస్తాయి. క్రమంగా ఆకలిపై అదుపు పెరుగుతుంది. ఎనర్జీ స్థాయిలు కూడా పెరుగుతాయి. కడుపుబ్బరం, మధ్యాహ్నాలు నిస్సత్తువ ఆవహించడం వంటివి తగ్గుతాయి. ఇన్సులీన్ పనితీరు కూడా మెరుగైన రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా మారడం ప్రారంభిస్తాయి.
రెండో వారంలో మరిన్ని స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. పొట్టు చుట్టూ కొవ్వు తగ్గుతుంది. తిండిపై ధ్యాస కూడా తగ్గుతుంది. పరగడుపున టెస్టు చేసినప్పుడు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కూడా మరింత మెరుగ్గా ఉంటాయి. జీవక్రియలు కూడా మెరుగుపడతాయి. 14 రోజుల పాటు చక్కెర తినడం మానేశాక లివర్‌లో కొవ్వు తగ్గుతుందని, శరీరంలో నీటి శాతం కూడా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు ఉన్న వారికి ఈ రీసెట్ ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
ఇవీ చదవండి:
పప్పు వండేటప్పుడు నురగ.. ఇది హానికరమా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..
భారత్‌లో యువ ఉద్యోగుల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యలు ఇవే