టాబ్లెట్ వేసుకున్న తర్వాత శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
ABN , Publish Date - Mar 24 , 2026 | 06:58 PM
చాలా మంది రోజూ టాబ్లెట్లు వాడుతుంటారు. కానీ ఒక చిన్న మాత్ర శరీరంలోకి వెళ్లిన తర్వాత ఏం జరుగుతుందో శాస్త్రీయ విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఏ మాత్రం అనారోగ్యానికి గురైనా, శరీరంలో ఏ భాగం నొప్పికి గురైనా వెంటనే గుటుక్కున టాబ్లెట్ మింగేస్తుంటారు. కడుపులో అజీర్తి చేసినా, తలనొప్పిగా అనిపించినా మాత్రవైపు దృష్టి మరలుతుంది. మధుమేహమైనా, బీపీని నియంత్రించాలన్నా.. పూటపూటకీ ఓ మందుబిళ్ల పడాల్సిందే. అయితే.. ఈ ట్యాబ్లెట్లకు శరీరంలో నొప్పెక్కడో, సమస్యేంటో ఎలా తెలుస్తుంది? వేసుకున్న కొన్ని నిమిషాలకే ఆ సమస్య నుంచి ఎలా బయటపడేస్తుంది.? వంటి సందేహాలపై ప్రత్యేక వివరణ మీకోసం...
టాబ్లెట్ పనిచేసే విధానం:
టాబ్లెట్‌ను మింగిన వెంటనే అది ఈసోఫాగస్(గొంతు మార్గం) ద్వారా కడుపులోకి చేరుతుంది. తర్వాత కడుపులో ఉన్న ఆమ్లాలు దానిని కరిగించడం ప్రారంభిస్తాయి. కొన్ని మాత్రలు వెంటనే కరుగుతాయి. మరికొన్ని ఆలస్యంగా పనిచేస్తాయి.
టాబ్లెట్‌లోని ఔషధ పదార్థాలు చిన్నపేగు ద్వారా రక్తంలోకి శోషణం చెందుతాయి. ఇది అత్యంత కీలక దశగా వైద్య నిపుణులు చెబుతారు.
రక్తం ద్వారా అందులోని ఔషధాలు శరీరంలోని వివిధ భాగాలకు చేరతాయి. అవసరమైన అవయవం వద్ద అది ఎక్కువగా పనిచేస్తుంది. ఇక్కడే అసలు పని ప్రారంభమవుతుంది.
నొప్పి మందులైతే నాడీ వ్యవస్థపై పనిచేస్తాయి. యాంటీబయోటిక్స్ అయితే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. ఇతర మందులు హార్మోన్లు లేదా రసాయన చర్యలను నియంత్రిస్తాయి.
లివర్(కాలేయం) ఔషధాన్ని రసాయన మార్పులకు గురిచేస్తుంది. దీనినే విఘటన(మెటబాలిజం) అంటారు.
చివరగా కిడ్నీలు(మూత్రపిండాలు), మలవిసర్జన ద్వారా ఔషధ అవశేషాలు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి.
పాటించాల్సిన నియమాలు:
సమయపాలన: ఏ టాబ్లెట్లను ఎలా వేసుకోవాలనే(తిన్న తర్వాత లేదా ఖాళీ కడుపుతో) విషయమై తప్పనిసరిగా వైద్యుల సలహాను పాటించాలి. ఇది మందుల శోషణపై ప్రభావం చూపుతుంది.
విశ్రాంతి: మందులు వేసుకున్నాక శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి.
విసర్జన: కాలేయం, మూత్రపిండాలు సరిగ్గా పనిచేస్తున్నప్పుడే మందులు సక్రమంగా పనిచేస్తాయి.
ముఖ్య గమనిక: ప్రతి మందు ఒకేలా పనిచేయదు. డాక్టర్ సూచించిన మోతాదు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. తప్పుగా వాడితే దుష్ప్రభావాలు వచ్చే అవకాశముంది.
ఇవీ చదవండి:
కర్ణాటకలో హోటల్ యజమాని ఆత్మహత్య.. సిలిండర్ల కొరతే కారణమా?
హరీశ్ రాణా మృతి.. దేశంలోనే తొలి కారుణ్య మరణం పొందిన వ్యక్తిగా..