Share News

హరీశ్ రాణా మృతి.. దేశంలోనే తొలి కారుణ్య మరణం పొందిన వ్యక్తిగా..

ABN , Publish Date - Mar 24 , 2026 | 05:20 PM

దాదాపు పదమూడేళ్లుగా కోమాలో ఉంటూ జీవచ్ఛవంలా మారిన హరీశ్ రాణా కన్నుమూశాడు. కారుణ్య మరణానికి అనుమతి పొందిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందిన హరీశ్.. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మంగళవారం మృతిచెందాడు.

హరీశ్ రాణా మృతి.. దేశంలోనే తొలి కారుణ్య మరణం పొందిన వ్యక్తిగా..
Harish Rana

ఇంటర్నెట్ డెస్క్: సుప్రీం కోర్టు ద్వారా కారుణ్య మరణానికి అనుమతి పొందిన హరీశ్ రాణా మృతిచెందాడు. సుమారు 13 ఏళ్లపాటు కోమాలో ఉండి జీవచ్ఛవంలా మారిన 32 ఏళ్ల హరీశ్ రాణా కారుణ్య మరణానికి సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అతడికి చికిత్స నిలిపివేయొచ్చని న్యాయస్థానం పేర్కొంది. దీంతో ఎయిమ్స్‌ వైద్యులు అతడికి క్రమంగా చికిత్స నిలిపివేశారు. ఈ క్రమంలోనే అతడు మంగళవారం తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.


13 ఏళ్లుగా కోమాలో ఉండి, జీవచ్ఛవంలా మంచానికే పరిమితమైన 32 ఏళ్ల హరీశ్ రాణాకు కారుణ్య మరణానికి(పాసివ్ యూతనేషియా) అనుమతిస్తూ సుప్రీంకోర్టు మార్చి 11న చారిత్రాత్మక తీర్పునిచ్చిన సంగతి విదితమే. న్యాయస్థానం ఆదేశాల మేరకు వైద్యం నిలివేసిన వైద్యులు.. క్రమంగా అతడి ఆరోగ్యం క్షీణింపజేసి, మరణించేలా చేశారు. ఈ విషయమై హరీశ్ రాణా తండ్రి అశోక్ రాణా స్పందిస్తూ.. 'మేం దీనికోసమే పోరాడుతున్నాం. ఏ తల్లిదండ్రులు తమ కొడుకుకు ఈ రకంగా జరగాలని కోరుకోరు' అని కన్నీటిపర్యంతమయ్యారు.


ఎవరీ హరీశ్.. ఏంటీ కేసు?

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌కు చెందిన 32 ఏళ్ల హరీశ్ రాణా చండీగఢ్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతుండేవాడు. అతడు 2013 ఆగస్టు 20న హాస్టల్లో ప్రమాదవశాత్తూ నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడటంతో తలకు తీవ్ర గాయమైంది. శరీరం కదల్లేని స్థితికి చేరుకుంది. ప్రముఖ ఆసుపత్రుల్లో చికిత్స అందించినా అతడి హెల్త్ కండీషన్‌లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ప్రమాదానికి గురైన నాటి నుంచీ కోమాలోనే ఉండిపోయాడు. ఈ నేపథ్యంలో హరీశ్ తల్లిదండ్రులు 2024 జులైలో కుమారుడి కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పలు కారణాలతో ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.


ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లారు హరీశ్ తల్లిదండ్రులు. వైద్య నివేదికలు పరీశిలించిన సుప్రీం ధర్మాసనం.. ఈ ఏడాది జనవరి 13న హరీశ్ తల్లిదండ్రులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుంది. మానవీయకోణంలో మర్యాదపూర్వక మరణాన్ని ప్రసాదించాలని వారు కోర్టును వేడుకున్నారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ కేసు విచారణలో సర్వోన్నత న్యాయస్థానం మార్చి 11న సంచలన తీర్పు వెలువరించింది. 13 ఏళ్లుగా జీవచ్ఛవంలా ఉన్న హరీశ్ రాణాకు పాసివ్‌ యూతనేషియా(Passive Euthanasia)కు అనుమతించగా.. 2018లో చట్టబద్ధత అనంతరం దేశంలో పరోక్ష కారుణ్య మరణం జరిగిన తొలి కేసుగా నిలిచిన సంగతి తెలిసిందే.


ఇవీ చదవండి:

కర్ణాటకలో హోటల్ యజమాని ఆత్మహత్య.. సిలిండర్ల కొరతే కారణమా?

'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్' ట్వీట్‌కు స్పందన.. రీహాబిలిటేషన్ సెంటర్‌కు మానసిక రోగి

Updated Date - Mar 24 , 2026 | 06:02 PM