Share News

ప్రెగ్నెన్సీలో ఒత్తిడి.. పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతుందా?

ABN , Publish Date - May 30 , 2026 | 01:44 PM

ప్రెగ్నెన్సీలో కోపం, ఆందోళన, మానసిక ఒత్తిడి సాధారణమే. అయితే ఈ ఒత్తిడి ఎక్కువ కాలం కొనసాగితే తల్లి ఆరోగ్యంతో పాటు పుట్టబోయే శిశువు అభివృద్ధిపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో స్ట్రెస్‌ పెరిగితే ఏమవుతుంది? పుట్టబోయే బిడ్డపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రెగ్నెన్సీలో ఒత్తిడి.. పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతుందా?
Pregnancy Stress Effects

ఇంటర్నెట్ డెస్క్: గర్భధారణ సమయంలో చిన్న చిన్న విషయాలకే కోపం రావడం, ఎక్కువగా ఒత్తిడికి గురవడం చాలా మంది మహిళల్లో కనిపించే సాధారణ సమస్య. ఈ సమయంలో శరీరంలో హార్మోన్ల మార్పులు వేగంగా జరుగుతాయి. వాటి ప్రభావంతో భావోద్వేగాల్లో మార్పులు, ఆందోళన, చిరాకు వంటి సమస్యలు రావచ్చు.


అయితే గర్భధారణ సమయంలో దీర్ఘకాలంగా ఒత్తిడికి గురికావడం తల్లి ఆరోగ్యంతో పాటు పుట్టబోయే బిడ్డ అభివృద్ధిపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తల్లి శరీరంలో ఒత్తిడికి సంబంధించిన హార్మోన్ల స్థాయులు పెరిగితే, అది శిశువు మెదడు అభివృద్ధిపై ప్రభావం చూపవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ప్రభావం ఎలా ఉంటుంది?

ఆరోగ్య నిపుణులు తెలిపిన సమాచారం ప్రకారం, గర్భధారణ సమయంలో తల్లి నిరంతరం ఒత్తిడికి గురైతే, అది పిల్లల భావోద్వేగ వికాసం, ప్రవర్తన, ఏకాగ్రత సామర్థ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కొంతమంది పిల్లల్లో చిరాకు, ఆందోళన లేదా ఏకాగ్రత లోపం వంటి సమస్యలు కనిపించవచ్చు. అయితే ఈ ప్రభావాలు ప్రతి గర్భిణీలో ఒకేలా ఉంటాయని చెప్పలేమని, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులు, జీవనశైలి వంటి అంశాలపై అవి ఆధారపడి ఉంటాయని వైద్యులు పేర్కొంటున్నారు.


ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు

  • ఎప్పుడూ ఆందోళన లేదా భయంతో ఉండటం.

  • తరచూ కోపం రావడం, చిరాకుగా అనిపించడం.

  • నిద్ర సరిగా లేకపోవడం.

  • ఎక్కువగా బాధగా లేదా ఒంటరిగా అనిపించడం.

  • రోజువారీ పనులపై ఆసక్తి తగ్గిపోవడం.

ఈ లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగితే వైద్యులని లేదా మానసిక ఆరోగ్య నిపుణులని సంప్రదించడం మంచిది.

ఒత్తిడిని తగ్గించుకోవడానికి సూచనలు

  • రోజు తగినంత విశ్రాంతి తీసుకోవాలి.

  • కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడి మానసిక మద్దతు పొందాలి.

  • వైద్యుల సూచన మేరకు తేలికపాటి వ్యాయామాలు చేయాలి.

  • సమతుల్య ఆహారం తీసుకోవాలి.

  • అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవాలి.

గర్భధారణ సమయంలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపైనా శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. తల్లి ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటే బిడ్డ ఎదుగుదల కూడా మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఎబోలా వైరస్‌.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

30 ఏళ్లు దాటితే మోకాళ్ల నొప్పి ఎందుకు వస్తోంది?

For More Latest News

Updated Date - May 30 , 2026 | 02:57 PM