Rajasthan: ఆమె డాక్టర్ కాదు.. కానీ.. ప్రసవాల స్పెషలిస్టు
ABN , Publish Date - Jan 11 , 2026 | 01:45 PM
అప్పట్లో అజ్మీర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆస్పత్రులు ఒకటీ అరా ఉండేవి. సరైన రోడ్డు సదుపాయం ఉండేది కాదు. అలాంటి సమయంలో సువా దై తన 24 ఏళ్ల వయసులో మొదటిసారి ఒక పురుడు పోసింది.
ఆమె డాక్టర్ కాదు... అయినా సరే ఆ ప్రాంతంలో ఇప్పటిదాకా 5 వేలకు పైగా ప్రసవాలు చేసింది. రాజస్థాన్ అజ్మీర్‌కు చెందిన 84 ఏళ్ల సువా దై మా రూపాయి కూడా తీసుకోకుండా గత 60 ఏళ్లుగా ఆ చుట్టుపక్కల ఆరు గ్రామాల ప్రజలకు ప్రాథమిక వైద్యం అందిస్తూ ‘ప్రజల డాక్టరమ్మ’గా గుర్తింపు పొందింది.
అప్పట్లో అజ్మీర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆస్పత్రులు ఒకటీ అరా ఉండేవి. సరైన రోడ్డు సదుపాయం ఉండేది కాదు. అలాంటి సమయంలో సువా దై తన 24 ఏళ్ల వయసులో మొదటిసారి ఒక పురుడు పోసింది. ఆమె చేయి మంచిదనే నమ్మకంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలవారు ఆమెతో పురుడు పోయించుకునేవారు. తన అనుభవం, జ్ఞానంతో మహిళ నాడిని చెక్ చేసి, గర్భధారణను నిర్ధారిస్తుంది.
అంతే కాదు... గర్భం ధరించాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రసవానంతరం ఆహార ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఇలా అన్నీ విషయాల్లో సలహా, సూచనలు ఇస్తుంటుంది. అర్ధరాత్రయినా సరే... ఎవరింట్లోనైనా ‘పురుటి నొప్పులు మొదలయ్యాయి’ అనే వార్త తెలియగానే, పనులన్నీ పక్కనపెట్టి మరీ వెళ్తుంది. దీపం వెలుతురులోనూ ప్రసవాలు చేసిన రోజులు ఉన్నాయట.

అయితే ఆమె గొప్పదనం ఏమిటంటే... చేసిన సాయానికి ఒక్క రూపాయి కూడా ఎవరి నుంచి ఆశించదు. ‘అమ్మ అవడం ప్రతీ మహిళ జీవితంలో ఓ మధురమైన ఘట్టం. బిడ్డ పుట్టిన ఆ క్షణం ప్రపంచాన్నే జయించినంతగా సంతోషిస్తారు తల్లిదండ్రులు. వారి కళ్లలో ఆనందాన్ని చూడగానే నేను పడిన కష్టమంతా మర్చిపోతా’ అంటూ తన గొప్ప మనసు చాటుకుంటోందీ బామ్మగారు.
ఈ వార్తలు కూడా చదవండి.
పసిడి ప్రియులకు షాక్.. ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News