వేసవి కాలంలో రాగి జావతో ఎన్నో ఉపయోగాలు.. తెలిస్తే వదలరు
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:46 PM
వేసవి కాలం వచ్చిందంటే చాలు, ఉక్కపోతతో పాటు విపరీతమైన దాహం వేస్తోంది. ఈ క్రమంలోనే రక రకాల కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఇతర శీతల పానీయాల వైపు పరుగులు పెడుతుంటారు.
ఇంటర్నెట్ డెస్క్: వేసవి కాలం వచ్చిందంటే చాలు, ఉక్కపోతతో పాటు విపరీతమైన దాహం వేస్తోంది. ఈ క్రమంలోనే రక రకాల కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఇతర శీతల పానీయాల వైపు పరుగులు పెడుతుంటారు. కానీ, అవి ఇచ్చే ఉపశమనం తాత్కాలికమే కాకుండా, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. వేసవి తాపానికి అమృతధార 'రాగి జావ'. మన పూర్వీకుల కాలం నుండి వస్తున్న ఒక అద్భుతమైన దేశీ పానీయం 'రాగి జావ'. దీనివల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు అస్సలు వదలరు.
1. శరీరానికి చలవ:
రాగి జావ సహజంగానే చలవ చేసే గుణం కలిగి ఉంటుంది. ఎండలో తిరగడం వల్ల పెరిగే శరీర ఉష్ణోగ్రతను ఇది తక్షణమే తగ్గిస్తుంది. ఎండదెబ్బ తగలకుండా కాపాడుతుంది.
2. తక్షణ శక్తి:
ఎండల వల్ల త్వరగా నీరసించిపోయే వారికి రాగి జావ ఒక ఎనర్జీ డ్రింక్‌లా పనిచేస్తుంది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి.
3. డీహైడ్రేషన్ నివారణ:
వేసవిలో చెమట రూపంలో శరీరం నుంచి నీరు, లవణాలు బయటకు పోతుంటాయి. మజ్జిగ కలిపిన రాగి జావ తాగడం వల్ల శరీరంలో ద్రవాల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది.
4. బరువు తగ్గడానికి సహకారం:
రాగిలో ఫైబర్ (పీచు పదార్థం) అధికంగా ఉంటుంది. ఇది తాగిన తర్వాత కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. దీనివల్ల అతిగా తినడం తగ్గి బరువు అదుపులో ఉంటుంది.
5. ఎముకల పుష్టి:
మిగిలిన ధాన్యాల కంటే రాగిలో క్యాల్షియం చాలా ఎక్కువ. ఇది ఎముకలను దృఢంగా ఉండడమే కాదు, పెరుగుతున్న పిల్లలకు ఎంతో మేలు చేస్తుంది.
6. మధుమేహ నియంత్రణ:
షుగర్ వ్యాధి ఉన్నవారికి రాగి జావ ఒక మంచి ఆహారం. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.

ఎలా తీసుకుంటే మంచిది..
రాగి జావను చల్లార్చిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, నిమ్మరసం, పలచని మజ్జిగ కలిపి తాగితే రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. లేదా మీకు తీపి ఇష్టమైతే బెల్లం లేదా పాలు కలిపి కూడా తీసుకోవచ్చు. ఉదయం పూట ఖాళీ కడుపుతో లేదా బ్రేక్ ఫాస్ట్ సమయంలో రాగి జావ తీసుకోవడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉండవచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఆరోగ్య బీమా లేదా అత్యవసర నిధి.. ఏది ముఖ్యం
పెర్ఫ్యూమ్ అవసరం లేకుండా చెమట వాసన పోవాలా? ఈ చిట్కాలు ఫాలో అవండి
For More Latest News