ఉప్పు, చక్కెర ఎక్కువ వాడుతున్నారా? మీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్టే!
ABN , Publish Date - May 01 , 2026 | 04:00 PM
నేటి ఆధునిక జీవనశైలిలో ఉప్పు, చెక్కరలను ఎక్కువగా వాడుతున్నారు. రెండూ ఆహార రుచిని పెంచడానికి ఉపయోగపడతాయి. కానీ, ఉప్పు, చక్కెర అతి వినియోగం ప్రాణాపాయం.
ఇంటర్నెట్ డెస్క్: నేటి ఆధునిక జీవనశైలిలో ప్రజలు ఉప్పు, చెక్కరలను అధికంగా వినియోగిస్తున్నారు. రెండూ ఆహార రుచిని పెంచడానికి ఉపయోగపడతాయి. అయితే, మోతాదులో తింటేనే ఆరోగ్యం అన్ని విధాలా బావుంటుంది. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్నట్టు.. ఏదీ మితిమీరినా ప్రమాదమే. ఉప్పు, చక్కెరల వాడకాన్ని నియంత్రించి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా నిండు నూరేళ్లు జీవించవచ్చు.
1. ఉప్పులో ఉండే సోడియం శరీరానికి అవసరమే అయినప్పటికీ, అది ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుంది. శరీరంలో సోడియం పెరిగితే రక్తనాళాలపై ఒత్తిడి పెరిగి 'హై బిపి'కి దారితీస్తుంది. దీర్ఘకాలిక అధిక రక్తపోటు వల్ల గుండెపోటు, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. ఉప్పు ఎక్కువైతే మూత్రపిండాల వడపోత సామర్థ్యం తగ్గి, కిడ్నీ వ్యాధులు వస్తాయి.
2. చక్కెరను ‘వైట్ పాయిజన్’ అని పిలుస్తారు. చక్కెరలో క్యాలరీలు ఎక్కువ. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేసి బరువును పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల ఇన్సులిన్ నిరోధకత ఏర్పడి 'టైప్-2 డయాబెటిస్'కు కారణమవుతుంది. అతిగా చక్కెర తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు చేరుతుంది.
3. మనం ఎక్కువ ఉప్పు తీసుకున్నప్పుడు, మన శరీరం ఆ అధిక సోడియంను మూత్రం ద్వారా బయటకు పంపే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రక్రియలో సోడియంతో పాటు కాల్షియం కూడా శరీరం నుంచి బయటకు పోతుంది. దీనివల్ల ఎముకలు సాంద్రత కోల్పోయి బలహీనపడతాయి. చిన్న దెబ్బలకే ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతుంది.
4. అతిగా చక్కెర తీసుకోవడం వల్ల చర్మం తన మెరుపును కోల్పోతుంది. రక్తంలోని చక్కెర, ప్రోటీన్లతో కలిసి హానికరమైన అణువులను ఉత్పత్తి చేస్తుంది. ఇది చర్మంలోని కొల్లాజెన్‌ను దెబ్బతీసి, చిన్న వయసులోనే ముడతలు వచ్చేలా చేస్తుంది. మొటిమలు, చర్మ సంబంధిత అలర్జీలు కూడా పెరగవచ్చు.
5. చక్కెర, ఉప్పు కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాదు, మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తాయి. చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు తిన్నప్పుడు వెంటనే శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది, కానీ కాసేపటికే నీరసం, చిరాకు ఆవహిస్తాయి. అధిక ఉప్పు వల్ల నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు తలెత్తవచ్చు.
జాగ్రత్త పడటం ఎలా?
చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్, సాఫ్ట్ డ్రింక్స్‌లో ఉప్పు, చక్కెరలు అత్యధికంగా ఉంటాయి. వాటిని వీలైనంత వరకు తగ్గించండి.
కూరల్లో ఉప్పుకు బదులు నిమ్మరసం లేదా ఇతర సహజ మసాలాలను వాడటానికి ప్రయత్నించండి.
ఏదైనా వస్తువు కొనే ముందు అందులో ఎంత సోడియం లేదా షుగర్ ఉందో గమనించండి.
నీరు ఎక్కువగా తాగండి.. ఇది శరీరంలోని అదనపు సోడియంను బయటకు పంపడానికి సహాయపడుతుంది.
సైంధవ లవణంలో కూడా సోడియం ఉంటుంది, కాబట్టి దాన్ని కూడా పరిమితంగానే వాడాలి.
బెల్లం పంచదార కంటే మేలైనదే కానీ, అది కూడా ఒక రకమైన చక్కరే. డయాబెటిస్ ఉన్నవారు లేదా బరువు తగ్గాలనుకునే వారు బెల్లాన్ని కూడా తక్కువగానే తీసుకోవాలి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
మటన్ తినడం వల్ల నిజంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుందా..
ఇంట్లో కుక్కలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..
For More Latest News