Share News

చలికాలంలో పెరుగు తింటే జలుబు వస్తుందా..? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

ABN , Publish Date - Oct 27 , 2026 | 07:24 PM

సాధారణంగా శీతాకాలం వచ్చిందంటే చాలు.. కొందరు పెరుగు తినడానికి వెనుకాడుతుంటారు. పెరుగు తింటే జలుబు, దగ్గు వస్తాయని భావిస్తారు.

చలికాలంలో పెరుగు తింటే జలుబు వస్తుందా..? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

ఇంటర్నె్ట్ డెస్క్: చలికాలం రానేవచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో రాత్రివేళ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణంగా శీతాకాలం వచ్చిందంటే చాలు.. కొందరు పెరుగు తినడానికి వెనుకాడుతుంటారు. పెరుగు తింటే జలుబు, దగ్గు వస్తాయని భావిస్తారు. ఇలా అనుకుని పెరుగును దూరం పెట్టవద్దని వైద్యులు సూచిస్తున్నారు. దీన్ని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. ఆరోగ్య పరిస్థితులను బట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుని పెరగు తినాలని వివరిస్తున్నారు.


జీర్ణక్రియకు మేలు

పెరుగులో శరీరానికి మేలు చేసే సూక్ష్మజీవులు (ప్రోబయోటిక్స్) ఉంటాయి. ఇవి జీర్ణక్రియ సజావుగా సాగడంలో తోడ్పడతాయి. పెరుగులోని కాల్షియం ఎముకల బలానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల ప్రోటీన్, విటమిన్‌ బీ12, భాస్వరం వంటి పోషకాలు కూడా శరీరానికి అందుతాయి.

జలుబు మాటేంటి..?

చలికాలంలో పెరుగు తింటే తప్పనిసరిగా జలుబు, దగ్గు వస్తాయనడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే పెరుగు తిన్నప్పుడు కొందరికి గొంతులో కఫం పేరుకున్నట్టు అనిపించవచ్చు. ఇప్పటికే దగ్గు, గొంతు ఇబ్బందులు లేదా అలర్జీలు ఉన్నవారు తమకు ఏ ఆహారం ఇబ్బంది కలిగిస్తుందో గమనించాలి.


ఈ జాగ్రత్తలు అవసరం

చలికాలంలో రిఫ్రిజిరేటర్‌లో నుంచి తీసిన చల్లటి పెరుగు తినడం కొందరికి అసౌకర్యాన్ని కలిగించవచ్చు. అలాంటివారు గది ఉష్ణోగ్రతకు పెరుగు వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. అలాగే రాత్రిపూట పెరుగు తినకూడదనే నియమం అందరికీ వర్తించదు. అయితే వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులు, ఆహారపు అలవాట్లను బట్టి నిర్ణయం తీసుకోవాలి. పెరుగు తిన్నప్పుడు కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు వస్తే దాని వినియోగాన్ని తగ్గించడం మంచిది.

మొత్తానికి, చలికాలంలో పెరుగును పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. తాజా పెరుగును పరిమితంగా తీసుకుంటూ దాని పోషక ప్రయోజనాలను పొందవచ్చు.


ఇవీ చదవండి

దీపావళి వేళ వాయు కాలుష్యంతో జాగ్రత్త.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ టిప్స్

ప్రతిరోజూ తేనె తీసుకుంటున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవు!

Updated Date - Oct 27 , 2026 | 07:24 PM