Share News

వేసవిలో కూల్‌డ్రింక్స్ అతిగా తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

ABN , Publish Date - Mar 20 , 2026 | 01:49 PM

ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే దాహాన్ని తీర్చుకోవడానికి, కాసేపు ఉపశమనం పొందడానికి చాలామంది ‘కూల్ డ్రింక్స్’ వైపు మొగ్గు చూపుతుంటారు. కానీ, ఈ డ్రింక్స్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వేసవిలో కూల్‌డ్రింక్స్ అతిగా తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే!
Soft Drinks Health Disks

ఇంటర్నెట్ డెస్క్: ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే దాహాన్ని తీర్చుకోవడం సహా ఉపశమనం పొందేందుకు చాలామంది ‘కూల్ డ్రింక్స్’ వైపు మొగ్గు చూపుతుంటారు. మనం తాగే ఒక చిన్న కూల్‌డ్రింక్ బాటిల్‌లో చక్కెర పరిమితి చాలా ఎక్కువ ఉండటం వల్ల అది రక్తంలోని ఇన్సులిన్ స్థాయిలను అస్తవ్యస్తం చేస్తుంది. దీనివల్ల తక్కువ కాలంలోనే డయాబెటిస్ బారినపడే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


శరీర బరువు, ఊబకాయం:

కూల్‌డ్రింక్స్‌లో పోషక విలువలు సున్నా.. అందుకే వీటిని 'ఎంప్టీ క్యాలరీస్' అంటారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి, ఊబకాయం వస్తుంది. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్(పొట్ట దగ్గర కొవ్వు) పెరగడానికి ఇవి ప్రధాన కారణమవుతాయి. అందుకే ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడేవారు కూల్‌డ్రింక్స్‌కు సాధ్యమైనంత దూరంగా ఉంటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

డయాబెటిస్ రోగులు:

కూల్‌డ్రింక్స్ విషయంలో డయాబెటిస్‌తో(Diabetes) బాధపడేవారు దూరంగా ఉండాలి. కూల్‌డ్రింక్స్‌లో చక్కెర పరిమితి ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని ఇన్సులిన్ స్థాయిలను అస్తవ్యస్తం చేస్తుంది. డయాబెటిస్ రోగులు శీతలపానీయాలు తాగితే, అది వారి ఆరోగ్యానికి చాలా హానికరం. దీనివల్ల గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఉదర సంబంధిత సమస్యలు:

ఎసిడిటీ, గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి లేదా అల్సర్ వంటి సమస్యలు సాఫ్ట్ డ్రింక్స్ జోలికి వెళ్లకపోవడం చాలా మంచిది. దీనిలో ఉండే కార్బన్ డయాక్సెడ్, ఆమ్లం కడుపు పొరను దెబ్బతీస్తాయి.

ఎముకలు, దంతాలపై ప్రభావం:

కూల్‌డ్రింక్స్‌లో ఉండే ఫాస్పరిక్ యాసిడ్(Phosphoric acid) శరీరంలోని కాల్షియంను గ్రహించకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల ఎముకలు క్రమంగా బలహీనపడి, చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా.. సాఫ్ట్ డ్రింక్స్‌లో కార్బోనిక్ యాసిడ్ దంతాల పైపొరను కరిగించి, పిప్పి పళ్లు, చిగుళ్ల వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంటుంది.

కిడ్నీలపై ప్రభావం:

అధిక సాంద్రత కలిగిన రసాయనాలు, కృత్రిమ రంగులు(Artificial Colors) కిడ్నీలపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి. దీర్ఘకాలంగా ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి లేదా కిడ్నీ పనితీరు మందగించడానికి కారణం కావచ్చు.


సహజసిద్ధమైన పానీయాలే మేలు..

వేసవి తాపం నుంచి రక్షణ పొందడానికి కృత్రిమ పానీయాల కంటే ప్రకృతి సహజసిద్ధమైన పానీయాలను ఎంచుకోవడం ఉత్తమం. ముఖ్యంగా వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు ఎంతో మంచిది. ఇందులో ఉండే సహజమైన ఎలక్ట్రోలైట్స్ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. మజ్జిగ జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరానికి చలువ చేస్తుంది. నిమ్మరసం తక్కువ చక్కెరతో తీసుకుంటే విటమిన్-సి అంది తక్షణ శక్తిని ఇస్తుంది. రాగి అంబలి ఎండదెబ్బ తగలకుండా కాపాడటం సహా ఎముకలకు బలాన్నిస్తుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఆరోగ్య బీమా లేదా అత్యవసర నిధి.. ఏది ముఖ్యం

పెర్ఫ్యూమ్ అవసరం లేకుండా చెమట వాసన పోవాలా? ఈ చిట్కాలు ఫాలో అవండి

For More Latest News

Updated Date - Mar 20 , 2026 | 02:25 PM