Share News

Health: వేయించి పొడిచేస్తే పోషకాలు పోతాయా..?

ABN , Publish Date - Jan 11 , 2026 | 11:52 AM

బాదం, పిస్తా, కాజు, వేరుశెనగలు మొదలైన పప్పుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. నట్స్‌ అన్నింటిలోనూ వివిధ పరిమాణాల్లో ఆవశ్యక కొవ్వులు, విటమిన్‌ ఈ, మెగ్నీషియం, సెలీనియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

Health: వేయించి పొడిచేస్తే పోషకాలు పోతాయా..?

బాదం, పిస్తా, కాజు, వేరుశెనగ గింజలను వేయించి, పొడి చేసుకుని తీసుకొంటే వాటిల్లో ఉండే పోషకాలు పూర్తిగా లభ్యమవుతాయా?

- వెంకటేష్‌, కాకినాడ

బాదం, పిస్తా, కాజు, వేరుశెనగలు మొదలైన పప్పుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. నట్స్‌ అన్నింటిలోనూ వివిధ పరిమాణాల్లో ఆవశ్యక కొవ్వులు, విటమిన్‌ ఈ, మెగ్నీషియం, సెలీనియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో పీచుపదార్థాలు, కొద్ది మోతాదులో ప్రొటీన్లు కూడా లభిస్తాయి. ఈ పప్పులను నేరుగా తినడం, నానబెట్టి తినడం లేదా నూనె లేకుండా వేయించుకొని తినడం, పొడి లేదా పేస్ట్‌ లాగ చేసి స్మూతీలు, వంటకాల్లో వాడడం... ఇలా రకరకాల పద్ధతుల్లో ఆహారంలో చేర్చుకోవచ్చు. నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల నమిలేందుకు తేలికవుతుంది. వేయించినవి కూడా నమిలేందుకు సౌకర్యంగానే ఉంటాయి. బాదం, వేరుశెనగ వంటివి పొట్టుతో పాటుగా తీసుకొంటే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. దంత సమస్యలు లేనివారు నట్స్‌ని నాన బెట్టి లేదా వేయించి తీసుకోవచ్చు. అలాగే పొడిగా చేసుకొని పాలలో, లేదా స్మూతీల్లో తీసుకొన్నా వాటిలోని పోషకాల్లో పెద్దగా తేడా రాదు. నట్స్‌ అన్నింటిలోనూ కొవ్వు పదా ర్థాలు అధికం కాబట్టి క్యాలరీలు ఎక్కువ. ఆరోగ్యకరమైనవైనా తగిన పరిమాణానికి మించి తీసు కుంటే అధిక బరువుకు కారణమవుతాయి.


మార్కెట్‌లో లభించే రెడ్‌, గ్రీన్‌, బ్లాక్‌ ద్రాక్షలలో పోషకాలు అన్నీ ఒకే రకంగా ఉంటాయా? లేక మారుతాయా?

- నైనిక, సికింద్రాబాద్‌

book7.2.jpg

వంద గ్రాముల ద్రాక్షలో కేవలం 80 క్యాలరీలు ఉంటాయి, విటమిన్‌ ‘సి’, విటమిన్‌ ‘కె’ పుష్కలంగా లభిస్తాయి. విటమిన్‌ ‘కె’ రక్తం గడ్డ కట్టడానికి, ఎముకలను దృడంగా ఉంచడానికి ప్రధానమైనది. మధుమేహం, గుండెపోటు, క్యాన్సర్‌ వంటి తీవ్ర వ్యాధుల బారి నుంచి రక్షించుకొనేందుకు ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర వృక్షసంబంధ రసాయనాలు ద్రాక్షలో అధిక మొత్తంలో లభిస్తాయి. ఎర్ర ద్రాక్ష, నల్ల ద్రాక్షలో ఎక్కువగా లభించే రెస్వెరాట్రాల్‌ అనే రసాయనం క్యాన్సర్‌ నుంచి ముఖ్యంగా పెద్ద ప్రేవుల క్యాన్సర్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ల నుంచి రక్షించడంలో కీలకంగా పనిచేస్తుంది.


ఆకుపచ్చ ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లను ఫ్లేవనాయిడ్లు అంటారు. వీటికి కూడా ఎర్ర ద్రాక్షలో లభించే యాంటీ ఆక్సిడెంట్లకు దీటుగా పనిచేసే శక్తి ఉంది. భావోద్వేగాలను నియంత్రించడంలో, మెదడు పనితీరును ప్రభావితం చేయడంలో ఉపకరించే విటమిన్‌ ‘బి-6’ ద్రాక్షలో ఎక్కువగా లభిస్తుంది. కొన్ని ఇతర పండ్లతో పోల్చినపుడు ద్రాక్షలో చక్కెరలు ఎక్కువ మోతాదులోనే ఉన్నప్పటికీ, ఇవి తక్కువ- మధ్యరకం గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ ఉన్న ఆహార పదార్థాలు కాబట్టి ప్రమాదకరం కాదు. మధుమేహ రోగులు కూడా వీటిని తక్కువ మొత్తంలో తినవచ్చు. ద్రాక్ష అందించే ఆరోగ్య ప్రయోజనాలన్నీ పొందాలంటే వాటిని పళ్లుగానే తినడం మంచిది, చక్కెర కానీ, ఇతర తీపి పదార్థాలతో కానీ కలిపి జ్యూస్‌గా చేయడం వల్ల ప్రయోజనాలు నీరుకారిపోతాయి.


ఓట్స్‌, సగ్గుబియ్యంలో పోషకాలు ఏ విధంగా ఉంటాయి? వీటితో చేసిన పదార్థాలను స్నాక్స్‌గా తీసుకోవచ్చా?

- కరుణశ్రీ, వరంగల్‌

పీచుపదార్థాలు అధికంగా ఉండే ఓ రకమైన ధాన్యం ఓట్స్‌. ఇందులోని బీటా గ్లూకాన్స్‌ ఆకలిని నియంత్రించి బరువు నియంత్రణకు, అలాగే రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌ తగ్గించడంలో సహాయపడతాయి. ఓట్స్‌లో థయమీన్‌, ఫాస్ఫరస్‌, కాపర్‌, ఐరన్‌, సెలీనియం, మెగ్నీషియం, జింక్‌ వంటి విటమిన్లు, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. రక్తపోటును నియంత్రించేందుకు ఓట్స్‌ మంచి ఆహారం. ఓట్స్‌ని కేవలం ఉదయం అల్పాహారంగా మాత్రమే కాకుండా భోజనంలో అన్నం, గోధుమ రొట్టెలకు ప్రత్యామ్నాయంగా కూడా వాడవచ్చు. ఓట్స్‌తో జావ, ఉప్మా, కిచిడీ, రొట్టెలు వంటివి కూడా చేసుకోవచ్చు. సగ్గు బియ్యాన్ని కర్రపెండలం (టాపియోకా) అనే ఓ రకమైన దుంప నుంచి తయారుచేస్తారు.


ఇది పూర్తిగా పిండి పదార్థాలనే కలిగి ఉంటుంది. సగ్గుబియ్యంలో ప్రొటీన్లు, పీచుపదార్థాలు, విటమిన్లు, ఖనిజాల పరిమాణం చాలా తక్కువ. అందువల్ల కేవలం త్వరిత శక్తినివ్వ డానికి తప్ప ఇవి ఆరోగ్యానికి ఎటువంటి ప్రత్యేకమైన ప్రయోజనాలను అందించవు. సగ్గుబియ్యం తీసుకున్నప్పుడు రక్తంలో గ్లూకోజు త్వరగా పెరుగుతుంది. తక్షణ శక్తి కావలసిన సమయాల్లో, బాగా నీరసించి ఉన్నప్పుడు పరిమిత మోతాదులో వీటిని తీసుకోవడం వలన ఇబ్బంది ఉండదు. అయితే చిరుతిండి రూపంలో తరచుగా తీసుకొంటే మిగిలిన పోషకాలు లేకుండా కేవలం తాత్కాలికంగా శక్తి మాత్రమే వస్తుంది తప్ప ఆరోగ్యప్రయోజనాలేమీ ఉండవు.

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)


ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ప్రియులకు షాక్.. ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

దారి మళ్లింది 42 కోట్లు!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 11 , 2026 | 12:48 PM