Share News

వేసవి కాలంలో ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు.. తెలిస్తే వదలరు

ABN , Publish Date - Mar 22 , 2026 | 07:48 AM

వేసవి కాలంలో ఎండల తీవ్రత పెరిగే కొద్ది మన శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఈ సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి, శరీరానికి చలవను అందించే పండ్లు తీసుకోవడం చాలా అవసరం.

వేసవి కాలంలో ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు.. తెలిస్తే వదలరు
Summer Fruits Benefits

ఇంటర్నెట్ డెస్క్: వేసవి కాలంలో ఎండల తీవ్రత పెరిగే కొద్ది మన శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఈ సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి, శరీరానికి చలవను అందించే పండ్లు తీసుకోవడం చాలా అవసరం. కేవలం రుచికే కాదు, అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో కొన్ని ప్రత్యేకమైన పండ్లు ఎంతో ఉపయోగపడతాయి. అవేంటో తెలుసుకుందాం..


1.పుచ్చకాయ:

వేసవి అంటేనే ముందుగా గుర్తుకొచ్చే‌ది పుచ్చకాయ. ఇందులో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరంలోని నీటి శాతాన్ని సమతుల్యం చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, శక్తిని ఇస్తుంది. ఇందులో ఉండే ‘లైకోపిన్’ చర్మాన్ని ఎండ దెబ్బ నుంచి రక్షిస్తుంది.

2.నిమ్మకాయ:

వేసవి కాలం మాత్రమే కాదు.. అన్ని సీజన్లలో నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది డీహైడ్రేషన్‌ను అరికట్టడంలో నంబర్ వన్.

3.బొప్పాయి:

వేసవిలో వచ్చే చర్మ సమస్యలకు ఇది మంచి పరిష్కారం. ఇందులో విటమిన్ ఎ, సి, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో సహజసిద్ధమైన ఎంజైమ్‌లు, ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.

4.కర్బూజా:

కర్బూజాలో నీటి శాతంతో పాటు పొటాషియం పుష్కలంగా ఉంటుంది. శరీరానికి మంచి చలవనిస్తుంది. ఇందులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేసవి కాలంలో డీహైడ్రేషన్ భారిన పడకుండా ఉండాలంటే కర్బూజా జ్యూస్ తాగడం మంచిది.

5. మామిడి పండు:

పండ్లలో రాజుగా పిలువబడే మామిడి వేసవిలో మాత్రమే దొరుకుతుంది. ఇందులో విటమిన ఎ, సి అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది.

6. తాటి ముంజ:

ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధమైన పండు తాటి ముంజ. ఇవి వేసవి కాలంలో లభిస్తాయి. శరీర వేడిని తక్షణమే తగ్గిస్తాయి, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, వేసవిలో వచ్చే అలసటను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

7. ద్రాక్ష:

ద్రాక్ష పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంటి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి. పొటాషియం ఎక్కువగా ఉండే నల్లద్రాక్ష అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాపడుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది.

Updated Date - Mar 22 , 2026 | 07:48 AM