Share News

కమల్ హాసన్, రజనీకాంత్‌కు సాధ్యం కానిది.. విజయ్‌కు ఎలా సాధ్యమైంది?

ABN , Publish Date - May 05 , 2026 | 07:57 AM

తమిళనాడులో సినిమాలను, రాజకీయాలను వేర్వేరుగా చూడలేం. గతంలో తమిళనాడుకు ముఖ్యమంత్రులుగా పని చేసిన ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత సినిమా రంగానికి చెందిన వారే. ఆ తర్వాత కూడా ఎంతో మంది సినిమా నటులు రాజకీయ పార్టీలు పెట్టారు.

కమల్ హాసన్, రజనీకాంత్‌కు సాధ్యం కానిది.. విజయ్‌కు ఎలా సాధ్యమైంది?
Vijay Tamil Nadu elections

తమిళనాడులో సినిమాలను, రాజకీయాలను వేర్వేరుగా చూడలేం. గతంలో తమిళనాడుకు ముఖ్యమంత్రులుగా పని చేసిన ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత సినిమా రంగానికి చెందిన వారే. ఆ తర్వాత కూడా ఎంతో మంది సినిమా నటులు రాజకీయ పార్టీలు పెట్టారు. అయితే ఎంజీఆర్ మాత్రమే.. ఓ రాజకీయ పార్టీ స్థాపించి ప్రజల్లోకి వెళ్లి సీఎం అయ్యారు (Vijay Tamil Nadu elections).


శివాజీ గణేషన్, విజయ్‌కాంత్, శరత్ కుమార్, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి వారు రాజకీయ పార్టీలు పెట్టినా ప్రజల ఆదరణను దక్కించుకోలేకపోయారు. ఎంజీఆర్ తర్వాత ఆ స్థాయి ఆదరణ విజయ్‌కు మాత్రమే దక్కింది. కమల్ హాసన్, రజనీకాంత్ వంటి సూపర్ స్టార్లు తమ అభిమాన గణాన్ని రాజకీయ బలంగా మార్చుకోవడంలో విఫలమయ్యారు. ఇంతకీ విజయ్ విజయం వెనుక పనిచేసిన మంత్రమేంటి..? (Tamil Nadu elections 2026)


విజయ్ దాదాపు పదేళ్ల క్రితం నుంచే తన నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడం ప్రారంభించారు. కేంద్ర విధానాలు, రాష్ట్ర సమస్యలపై తన అభిప్రాయాలను వినిపించడం మొదలుపెట్టారు. విజయ్‌కు తమిళనాడు వ్యాప్తంగా 85 వేలకు పైగా అభిమాన సంఘాలు ఉన్నాయి. ఈ నెట్‌వర్క్ దాదాపు 10 సంవత్సరాల పాటు ఒక రాజకీయ సంస్థలా పనిచేస్తూ, సామాజిక సేవ చేసింది. ఈ సంఘాల సభ్యులు 2021లో జరిగిన స్థానిక ఎన్నికల్లో సత్తా చాటారు. తొమ్మిది జిల్లాల్లో 169 సీట్లలో పోటీ చేసి 129 చోట్ల విజయం సాధించారు. ఈ గెలుపు చూసి విజయ్‌కు ధైర్యం వచ్చింది (Tamil cinema politics).


కమల్, రజనీతో పోల్చితే విజయ్‌కు ఉన్న మరో సానుకూలాంశం ఆయన వయసు. రజనీకాంత్ పార్టీ పెట్టినప్పుడు ఆయన వయసు 70 ఏళ్లు. కమల్ వయసు 65 ఏళ్లకు పైనే. వారితో పోల్చుకుంటే 51 ఏళ్ల విజయ్‌ను యువత జెన్ జెడ్ నాయకుడిగా చూసింది. 40 ఏళ్ల లోపు వయసున్న రెండు కోట్లకు పైగా యువ ఓటర్లు విజయ్‌కు బ్రహ్మరథం పట్టారు. సోషల్ మీడియాలో చురుకుగా వ్యవహరించి బ్రహ్మాండంగా ప్రచారం చేశారు (Vijay political strategy).


ఎన్నో దశాబ్దాలుగా తమిళనాడులో పాతుకుపోయిన ద్రవిడ పార్టీలకు తన టీవీకేను భిన్నంగా చూపించడానికి విజయ్ చేసిన ప్రయత్నం కూడా ఓ అద్భుతమైన ఎత్తుగడగా పని చేసింది. రజనీ, కమల్‌లు ఆ సాహసం చేయలేకపోయారు. విజయ్ స్థాయిలో డీఎంకే, అన్నాడీఎంకేలపై విమర్శలు చేయలేకపోయారు. ద్రవిడ పార్టీలను చీల్చి చెండాడడం ద్వారా పట్టణ ఓటర్లు, యువ ఓటర్లలో విజయ్ నమ్మకం కలిగించారు. ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన రెండు పార్టీలకు ప్రత్యామ్నయంగా కమల్, రజనీలు తమ పార్టీలను చూపించుకోలేకపోయారు (Tamil Nadu political news).


ఇక, సినిమాలను విడిచిపెట్టి పూర్తిగా రాజకీయ నాయకుడిగా పనిచేస్తానని విజయ్ ప్రకటించారు. ఇంకా వయసులోనే ఉన్నప్పటికీ, రాజకీయాల కోసం తన మూడు దశాబ్దాల కెరీర్‌ను పణంగా పెట్టారు. ప్రచారంలో భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. తన స్టార్ పవర్‌కు ఆత్మీయతను జోడించారు. పార్టీ పెట్టిన తక్కువ కాలంలోనే అధికారానికి చేరవయ్యారు. అలాగే బలమైన సంక్షేమం అందిస్తానని తన మేనిఫెస్టో ద్వారా ప్రకటించి ప్రజలను ఆకట్టుకున్నారు.


ఇవి కూడా చదవండి:

ఆర్సీబీకి బిగ్ షాక్.. ఇంగ్లండ్‌కు స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్

ఓడిపోయే మ్యాచ్‌ గెలవడానికి అతడే కారణం: శుభ్‌మన్ గిల్

Updated Date - May 05 , 2026 | 08:01 AM