ఎన్డీఏకు శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
ABN , Publish Date - May 04 , 2026 | 06:14 PM
తమిళనాడు, కేరళం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రజలు ఈసారి మార్పును బలంగా కోరుకున్నారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆ మార్పును తమ తీర్పు ద్వారా స్పష్టంగా తెలియజేశారని పేర్కొన్నారు.
అమరావతి: తమిళనాడు, కేరళం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రజలు ఈసారి మార్పును బలంగా కోరుకున్నారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆ మార్పును తమ తీర్పు ద్వారా స్పష్టంగా తెలియజేశారని పేర్కొన్నారు. అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తమ ప్రాభవాన్ని నిలబెట్టుకున్న ఎన్డీఏకు ఈ సందర్భంగా పవన్ శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమ బెంగాల్ ప్రజల నమ్మకాన్ని పొందేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొన్ని సంవత్సరాలుగా కృషి చేశారని, ఇప్పుడు దానికి ఫలితం దక్కిందన్నారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకత్వంలో పశ్చిమ బెంగాల్ ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్‌తో సురక్షితంగా ఉంటామన్న విశ్వాసంతోనే ఆ రాష్ట్ర ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని పవన్ అన్నారు. ఈ భారీ విజయానికి భాగస్వాములైన మోదీ, అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, బీజేపీ పశ్చిమ బెంగాల్ నేత సువేందు అధికారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అస్సాం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి మరోమారు విజయాన్ని సాధించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు, పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమికి విజయాన్ని మళ్లీ అందించిన ఎన్.ఆర్.కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి రంగసామికీ పవన్ అభినందనలు తెలిపారు.
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే మంచి విజయాన్ని సాధించిన విజయ్‌ను మనసారా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే- బీజేపీ కూటమి పోరాటం బలంగా సాగిందని, అదే విధంగా కేరళంలోనూ మెజారిటీ ఓటర్లు మార్పునే కోరుకున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ నాయకత్వానికి కూడా డిప్యూటీ సీఎం అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల పోరాటంలో విజయం సాధించిన అందరికీ పవన్ కల్యాణ్ పేరుపేరున శుభాభినందనలు తెలియజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
హిమంత బిశ్వ శర్మ భారీ విజయం