Share News

పూర్తి నిర్బంధంలో 'రీ-నీట్' పేపర్ సెట్టర్లు.. బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా..

ABN , Publish Date - Jun 08 , 2026 | 10:21 AM

జూన్ 21న తిరిగి నిర్వహించబోయే నీట్ పరీక్ష కోసం ఈసారి భద్రతను ఏ స్థాయిలో పటిష్టం చేశారంటే.. క్వశ్చన్ పేపర్లను తయారు చేసిన నిపుణులు, మోడరేటర్లు, అనువాదకులను పరీక్ష జరిగే తేదీ వరకూ ఒక రహస్య ప్రాంతంలో పూర్తి నిర్బంధంలో ఉంచారు. బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధాలు లేకుండా నిఘా పెట్టారు.

పూర్తి నిర్బంధంలో 'రీ-నీట్' పేపర్ సెట్టర్లు.. బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా..
NEET Re-Exam: Question Papers to Be Airlifted by Indian Air Force to Prevent Leaks

న్యూఢిల్లీ, జూన్ 8: మే 3న జరిగిన నీట్ (NEET UG) పరీక్షలో పేపర్ లీకేజీ వివాదం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 21న దేశవ్యాప్తంగా నిర్వహించబోయే 'రీ-NEET' (తిరిగి నిర్వహించే పరీక్ష)ను అత్యంత పారదర్శకంగా, లీకులకు ఏమాత్రం తావులేకుండా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మునుపెన్నడూ లేని విధంగా ఒక అసాధారణ భద్రతా వ్యూహాన్ని సిద్ధం చేశాయి. ఈసారి క్వశ్చన్ పేపర్లు లీక్ అవ్వకుండా ఉండేందుకు ఏకంగా భారత వైమానిక దళం (Indian Air Force - IAF) సహాయం తీసుకోనున్నారు. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మధ్య జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో ఈ వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు.


గతంలో క్వశ్చన్ పేపర్లను ప్రింటింగ్ ప్రెస్ నుంచి పరీక్ష కేంద్రాలకు తరలించే రవాణా సమయంలోనే లీకేజీ ముఠాలు చేతివాటం ప్రదర్శించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ లోపాన్ని సరిదిద్దడానికి.. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) పర్యవేక్షణలో సరికొత్త చర్యలు చేపడుతున్నారు. దీని ప్రకారం.. క్వశ్చన్ పేపర్లను అత్యంత సురక్షితమైన ఎయిర్‌ఫోర్స్ విమానాలు, హెలికాప్టర్ల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తారు. దీనివల్ల రవాణాలో జరిగే ఆలస్యం తగ్గడమే కాకుండా.. అనధికారిక వ్యక్తులు క్వశ్చన్ పేపర్లను తాకే అవకాశం కూడా ఉండదు.


లాక్‌డౌన్‌లో పేపర్ సెట్టర్లు:

ఈసారి భద్రతను ఏ స్థాయిలో పటిష్టం చేశారంటే.. క్వశ్చన్ పేపర్లను తయారు చేసే నిపుణులు, మోడరేటర్లు, అనువాదకులను పరీక్ష జరిగే జూన్ 21వ తేదీ వరకూ ఒక రహస్య ప్రాంతంలో పూర్తిగా నిర్బంధంలో ఉంచారు. బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధాలు లేకుండా కఠిన నిఘా ఏర్పాటు చేశారు.

క్వశ్చన్ పేపర్ల బాక్సులకు హైటెక్ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల బయోమెట్రిక్ గుర్తింపును పకడ్బందీగా పరిశీలిస్తారు. రీ-ఎగ్జామ్‌కు ముందు సోషల్ మీడియాలో (టెలిగ్రామ్, వాట్సాప్ వంటి వాటిలో) నకిలీ పేపర్లు అమ్ముతూ విద్యార్థులను మోసం చేసే ముఠాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు.. మరోవైపు సైబర్ విభాగాన్ని రంగంలోకి దించారు.

గతంలో జరిగిన తప్పుల కారణంగా పరీక్ష రద్దయినందున, ఈ రీ-టెస్ట్ కోసం హాజరయ్యే విద్యార్థుల నుంచి ఎలాంటి అదనపు ఫీజు వసూలు చేయడం లేదని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. దీనికి అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని, అభ్యర్థులు ఎలాంటి వదంతులను నమ్మకుండా ప్రశాంతంగా పరీక్షకు సిద్ధం కావాలని ఎన్టీఏ కోరింది.

Re NEET.jpg


ఈ వార్తలనూ చదవండి:

దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాలపై దృష్టి పెట్టాము: ఎల్ఐసీ సీఈఓ

ఆచితూచి అడుగేయండి.. ఇన్వెస్టర్లకు నిపుణులు సూచన

Updated Date - Jun 08 , 2026 | 11:48 AM