Share News

ఐఐటీల వైపు అమ్మాయిల దూకుడు.. 10వేల మందికి పైగా అర్హత

ABN , Publish Date - Jun 06 , 2026 | 10:31 AM

దేశంలోని ప్రముఖ ఐఐటీల్లో జాయిన్ అయ్యేందుకు అమ్మాయిలు పోటీ పడుతున్నారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో మొత్తం 56 వేల మందికి పైగా క్వాలిఫై కాగా.. వారిలో సుమారు 10వేల మందికి పైగా యువతులే ఉండటం ఇందుకు నిదర్శనం.

ఐఐటీల వైపు అమ్మాయిల దూకుడు.. 10వేల మందికి పైగా అర్హత

ఇంటర్నెట్ డెస్క్: దేశంలోని ప్రముఖ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 పరీక్షలో అమ్మాయిలు సత్తా చాటారు. తొలిసారిగా 10వేల మందికిపైగా యువతులు క్వాలిఫై అయ్యారు. ఐఐటీ రూర్కీ వివరాల ప్రకారం, ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మొత్తం 56,880 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. వారిలో 10,107 మంది మహిళా అభ్యర్థులే ఉన్నారు. దీంతో ఇటీవలి కాలంలో సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌(STEM) రంగాలపై యువతుల్లో ఆసక్తి పెరుగుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ప్రముఖ ఐఐటీల్లో చదవాలనే లక్ష్యంతో యువతులు ముందుకురావడం సానుకూల పరిణామమని ఐఐటీ రూర్కీ అభిప్రాయపడింది.


రిజల్ట్స్‌లోనూ..

జూన్‌ 1న విడుదలైన అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన శుభమ్‌ కుమార్‌ 330 మార్కులతో ఆల్‌ ఇండియా ఫస్ట్ ర్యాంక్‌‌ను కైవసం చేసుకోగా.. అదే జోన్‌కు చెందిన అరోహి దేశ్‌పాండే 280 మార్కులతో మహిళా అభ్యర్థుల్లో తొలిస్థానం దక్కించుకుంది. ఓవరాల్‌గా ఆమెది 77వ ర్యాంక్.

ఇక.. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు మొత్తం 1,87,389 మంది నమోదు చేసుకోగా.. 1,79,694 మంది హాజరయ్యారు. వీరిలో 56,880 మంది అభ్యర్థులు ఐఐటీ ప్రవేశాలకు అర్హత సాధించారు. ఈ ఫలితాలు దేశంలో సాంకేతిక విద్యలో మహిళా అభ్యర్థుల సంఖ్య మరింత విస్తరిస్తోందనే సంకేతాలిస్తున్నాయని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు.


ఇవీ చదవండి:

టీజీ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ ఫలితాలు విడుదల

సీబీఎస్ఈ రీ-వాల్యుయేషన్.. బ్యాంక్ ఖాతా లేకున్నా పేమెంట్ చేయవచ్చు

Updated Date - Jun 06 , 2026 | 10:36 AM