SSC నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్.. 1,748 జూనియర్ ఇంజినీర్ పోస్టులు
ABN , Publish Date - Sep 08 , 2026 | 05:39 PM
ఇంజినీరింగ్ అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) శుభవార్త చెప్పింది. జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి 1,748 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న ఇంజినీరింగ్ అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రక్రియ చేపట్టింది. SSC JE Recruitment 2026 పేరుతో విడుదలైన ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 1,748 ఖాళీలు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 22, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు
ఈ నియామకంలో ప్రధానంగా జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టులను భర్తీ చేయనున్నారు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ తదితర ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత
అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్న పోస్టుకు సంబంధించిన విభాగంలో గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి అవసరమైన విద్యార్హత కలిగి ఉండాలి. పోస్టును బట్టి డిప్లొమా, బీఈ లేదా బీటెక్ అర్హతలను పరిగణనలోకి తీసుకుంటారు. కొన్ని పోస్టులకు సంబంధిత పని అనుభవం కూడా అవసరం కావచ్చు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఇన్‌స్ట్రుమెంటేషన్ వంటి విభాగాలకు సంబంధించిన అర్హతలు పోస్టును బట్టి వర్తిస్తాయి.
వయోపరిమితి
2026 ఆగస్టు 1 నాటికి పోస్టును బట్టి అభ్యర్థుల గరిష్ఠ వయసు 30 లేదా 32 సంవత్సరాలు ఉండాలి. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం.. అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు కేటగిరీని బట్టి 10 నుంచి 15 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
జీతం ఎంత?
SSC JE పోస్టుకు ఎంపికైన వారికి 7వ కేంద్ర వేతన సంఘం ప్రకారం జీతం లభిస్తుంది. ఈ పోస్టులకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు పే స్కేల్ ఉంటుంది. దీనికి అదనంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా అందుతాయి.
పేపర్-I పరీక్ష విధానం
మొదటి పేపర్‌లో మొత్తం 200 ప్రశ్నలు, 200 మార్కులు ఉంటాయి. పరీక్షకు 2 గంటల సమయం కేటాయిస్తారు.
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ – 50 మార్కులు
జనరల్ అవేర్‌నెస్ – 50 మార్కులు
సంబంధిత ఇంజినీరింగ్ సబ్జెక్ట్ – 100 మార్కులు
ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
పేపర్-II వివరాలు
రెండో పేపర్‌లో అభ్యర్థి ఎంచుకున్న సివిల్, ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం నుంచి ప్రశ్నలు వస్తాయి. మొత్తం 100 ప్రశ్నలకు 300 మార్కులు ఉంటాయి. ఈ పరీక్షకు 2 గంటల సమయం ఉంటుంది. పేపర్-IIలో ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు.
పరీక్ష కేంద్రాలు
SSC JE పరీక్షను దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, శ్రీకాకుళం, ఏలూరు, సిద్ధిపేట తదితర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
దరఖాస్తు ఫీజు
అభ్యర్థులు దరఖాస్తు సమయంలో రూ.100 ఫీజు చెల్లించాలి. అయితే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీలకు చెందిన అర్హులైన అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
SSC JE పోస్టులకు ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లికేషన్ సమర్పించాలి. SSC అధికారిక వెబ్‌సైట్ లేదా mySSC యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 2, 2026
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 22, 2026 రాత్రి 11 గంటల వరకు
ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: సెప్టెంబర్ 23, 2026 రాత్రి 11 గంటల వరకు
అప్లికేషన్ సవరణకు అవకాశం: సెప్టెంబర్ 28 నుంచి 30, 2026
పేపర్-I పరీక్ష: అక్టోబర్/నవంబర్ 2026
పేపర్-II పరీక్ష: డిసెంబర్ 2026
విద్యార్హతలు.. ఇతర నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో పూర్తిగా పరిశీలించిన తర్వాతే దరఖాస్తు చేయడం మంచిది.
Also Read:
ఐక్యరాజ్యసమితి కొత్త మ్యాప్.. అరుణాచల్, అక్సాయ్ చిన్‌పై వేర్వేరు గీతలు..
అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కు ఊరట..