Share News

SBIలో జూనియర్ అసోసియేట్ పోస్టులు..

ABN , Publish Date - Aug 08 , 2026 | 05:43 PM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టుల భర్తీకి 1,538 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది.

SBIలో జూనియర్ అసోసియేట్ పోస్టులు..
SBI Clerk Recruitment 2026

ఇంటర్నెట్ డెస్క్: బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శుభవార్త అందించింది. జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టుల భర్తీకి ప్రత్యేక నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 1,538 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 27, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


SBI సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఈ నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన అభ్యర్థుల కోసం ప్రత్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు.

పోస్టు:

  • జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్)

  • మొత్తం ఖాళీలు: 1,538

  • వర్గాల వారీగా బ్యాక్‌లాగ్ పోస్టులను పరిశీలిస్తే ఎస్టీ కేటగిరీలో 1,219, ఎస్సీ కేటగిరీలో 207, ఓబీసీ కేటగిరీలో 112 ఖాళీలు ఉన్నాయి.

ఏపీ, తెలంగాణలో ఎన్ని పోస్టులు?

తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కూడా ఈ రిక్రూట్‌మెంట్‌లో అవకాశాలు ఉన్నాయి.

  • ఆంధ్రప్రదేశ్ – 88 పోస్టులు

  • తెలంగాణ – 32 పోస్టులు

ఇతర రాష్ట్రాల్లో కూడా భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. గుజరాత్‌లో 289, మహారాష్ట్రలో 165, మధ్యప్రదేశ్‌లో 134 పోస్టులు ఉన్నాయి.


విద్యార్హత

జూనియర్ అసోసియేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అయితే, నిర్దేశిత గడువులోగా తమ విద్యార్హతకు సంబంధించిన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకునే రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడటం తెలిసి ఉండటం అవసరం.

వయసు

2026 ఏప్రిల్ 1 నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే 28 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తదితర రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

జీతం

SBIలో జూనియర్ అసోసియేట్‌గా ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనం లభిస్తుంది. ఈ ఉద్యోగానికి నెలవారీ జీతం రూ.26,730 నుంచి రూ.46,000 వరకు ఉండనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.


దరఖాస్తు ఫీజు వివరాలు

కేటగిరీ ఆధారంగా అప్లికేషన్ ఫీజు మారుతుంది.

  • జనరల్ / EWS / OBC – రూ.750

  • SC / ST / PwBD – ఫీజు లేదు

  • అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు రుసుమును చెల్లించాలి.

ఎంపిక ఎలా జరుగుతుంది?

SBI Clerk పోస్టులకు అభ్యర్థుల ఎంపికను పలు దశల్లో నిర్వహిస్తారు. ముందుగా ఆన్‌లైన్‌లో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు హాజరుకావాలి. తదుపరి అభ్యర్థుల స్థానిక భాషా పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు Local Language Proficiency Test (LLPT) నిర్వహిస్తారు. ఈ దశల్లో అర్హత సాధించిన వారిని నియామకానికి పరిగణనలోకి తీసుకుంటారు.

ఏపీలో పరీక్ష కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్‌లో కింది ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు:

  • కడప, అనంతపురం, విశాఖపట్నం, గుంటూరు/విజయవాడ, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, చీరాల, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం.

తెలంగాణలో పరీక్ష కేంద్రాలు

తెలంగాణ అభ్యర్థుల కోసం హైదరాబాద్‌, వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 07 ఆగస్టు 2026

  • దరఖాస్తుకు చివరి తేదీ: 27 ఆగస్టు 2026

  • ప్రిలిమినరీ పరీక్ష: సెప్టెంబర్ 2026లో జరిగే అవకాశం

  • మెయిన్ పరీక్ష: అక్టోబర్/నవంబర్ 2026లో నిర్వహించే అవకాశం

  • పరీక్షలకు సంబంధించిన ఖచ్చితమైన తేదీలను SBI అధికారిక ప్రకటన ద్వారా వెల్లడిస్తుంది.


ఎలా అప్లై చేయాలి?

అర్హత ఉన్న అభ్యర్థులు SBI నియామక ప్రక్రియకు సంబంధించిన ఆన్‌లైన్ పోర్టల్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, అవసరమైన పత్రాలను నమోదు చేసి అప్లికేషన్‌ను సమర్పించాలి. దరఖాస్తు పూర్తయిన తర్వాత భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ కాపీని భద్రపరచుకోవడం మంచిది.

ముఖ్య సూచన

SBI Clerk రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన అర్హతలు, రిజర్వేషన్, పరీక్ష విధానం, సిలబస్, రాష్ట్రాల వారీగా ఖాళీలు తదితర వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే అధికారిక నోటిఫికేషన్‌లోని సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, తమ అర్హతను నిర్ధారించుకున్న తర్వాతే అప్లై చేయడం మంచిది.


Also Read:

మోహన్‌లాల్‌కు వీసా చిక్కులు.. సిడ్నీ షో వాయిదా!

ట్రంప్ అల్లుడి కేరళ టూర్.. సీఎంతో భేటీ వార్తల్ని ఖండించిన సీఎంవో

Updated Date - Aug 08 , 2026 | 05:43 PM