Share News

రైల్వే జేఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ABN , Publish Date - Aug 14 , 2026 | 07:22 PM

రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. RRB జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) పోస్టుల భర్తీకి 3,993 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది.

రైల్వే జేఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్
Railway JE Notification 2026

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) CEN No. 04/2026 ద్వారా జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 3,993 పోస్టులు అందుబాటులో ఉండగా, సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో 110 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 14, 2026 నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు సెప్టెంబర్ 13, 2026 వరకు అప్లికేషన్ సమర్పించేందుకు అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇవి.

పోస్టుల సంఖ్య

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) పోస్టులను భర్తీ చేయనున్నారు.

  • మొత్తం ఖాళీలు: 3,993

  • సికింద్రాబాద్ జోన్: 110 పోస్టులు

  • ప్రధాన విభాగాలు: ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, S&T, స్టోర్స్


విద్యార్హత

పోస్టును బట్టి విద్యార్హత మారుతుంది. సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిగ్రీ, అలాగే నిర్దేశించిన పోస్టులకు బీఎస్సీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తాము ఎంచుకునే పోస్టుకు సంబంధించిన నిర్దిష్ట విద్యార్హతను అధికారిక నోటిఫికేషన్‌లో తప్పనిసరిగా పరిశీలించాలి.

వయోపరిమితి

జనవరి 1, 2027 నాటికి అభ్యర్థుల వయసు కనీసం 18 సంవత్సరాలు, గరిష్ఠంగా 33 సంవత్సరాలు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

  • SC/ST: 5 సంవత్సరాల వరకు

  • OBC-NCL: 3 సంవత్సరాల వరకు

  • PwBD, Ex-Servicemen తదితర కేటగిరీలకు నిబంధనల మేరకు అదనపు సడలింపు


జీతం ఎంత?

ఎంపికైన అభ్యర్థులకు రూ.35,400 ప్రారంభ నెలవారీ వేతనం లభిస్తుంది. దీనికి అదనంగా రైల్వే నిబంధనల ప్రకారం వర్తించే అలవెన్సులు, ఇతర ప్రయోజనాలు అందుతాయి.

దరఖాస్తు ఫీజు

జనరల్, OBC, EWS కేటగిరీల అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.500. CBTకి హాజరైన తర్వాత నిబంధనల ప్రకారం రూ.400 తిరిగి చెల్లిస్తారు. SC, ST, మహిళలు, ట్రాన్స్‌జెండర్, Ex-Servicemen, EBC, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250 ఫీజు ఉంటుంది. పరీక్షకు హాజరైతే నిబంధనల ప్రకారం ఈ మొత్తాన్ని రీఫండ్ చేస్తారు.

ఎంపిక ప్రక్రియ

అభ్యర్థుల ఎంపిక పలు దశల్లో జరుగుతుంది. మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అర్హత సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, రైల్వే నిర్దేశించిన మెడికల్ పరీక్ష ఉంటుంది. అన్ని దశల్లో అర్హత సాధించిన వారిని తుది ఎంపికకు పరిగణిస్తారు.


CBT-I పరీక్ష విధానం

మొదటి కంప్యూటర్ ఆధారిత పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి.

  • జనరల్ సైన్స్: 30 ప్రశ్నలు – 30 మార్కులు

  • జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్: 25 ప్రశ్నలు – 25 మార్కులు

  • మ్యాథమెటిక్స్: 30 ప్రశ్నలు – 30 మార్కులు

  • జనరల్ అవేర్‌నెస్: 15 ప్రశ్నలు – 15 మార్కులు

పరీక్ష సమయం 90 నిమిషాలు. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు జవాబుకు 1/3 మార్కు కోత విధిస్తారు.

CBT-II ఎలా ఉంటుంది?

రెండో దశ CBTలో 150 ప్రశ్నలు, 150 మార్కులు ఉంటాయి. ఇందులో ఫిజిక్స్ & కెమిస్ట్రీ, జనరల్ అవేర్‌నెస్, ఎన్విరాన్‌మెంట్ & పొల్యూషన్ కంట్రోల్, కంప్యూటర్ బేసిక్స్ & అప్లికేషన్స్, సంబంధిత టెక్నికల్ సబ్జెక్ట్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. టెక్నికల్ ఎబిలిటీస్ విభాగానికి అత్యధికంగా 100 ప్రశ్నలు, 100 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. ఈ దశలోనూ ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తుల ప్రారంభం: ఆగస్టు 14, 2026

  • ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ: సెప్టెంబర్ 13, 2026

  • ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: సెప్టెంబర్ 15, 2026

ఎలా దరఖాస్తు చేయాలి?

అర్హత ఉన్న అభ్యర్థులు సంబంధిత RRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పూర్తి చేయాలి. దరఖాస్తు చేసే ముందు పోస్టుల వారీగా విద్యార్హత, వయోపరిమితి, జోన్ వారీ ఖాళీలు, ఫీజు, పరీక్ష విధానం వంటి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌తో సరిపోల్చుకోవడం మంచిది.


Also Read:

వారణాసిలో వింత చోరీ.. బైక్ దొంగతనానికి వెళ్లి డ్యాన్స్‌లతో హంగామా..

ఏపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బెయిల్‌

Updated Date - Aug 14 , 2026 | 07:22 PM