ఇండియన్ ఆర్మీ సైబర్ క్వెస్ట్ 2026.. ఆగస్టు 20లోగా దరఖాస్తు చేసుకోండి
ABN , Publish Date - Aug 06 , 2026 | 08:43 PM
సైబర్ సెక్యూరిటీ రంగంలో ప్రతిభ చూపాలనుకునే విద్యార్థులు, టెక్నాలజీ నిపుణులకు భారత సైన్యం అరుదైన అవకాశం కల్పిస్తోంది. ఇండియన్ ఆర్మీ టెరిటోరియల్ సైబర్ క్వెస్ట్ 2026 కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత సైన్యం టెరిటోరియల్ ఆర్మీ, సైబర్‌పీస్ ఫౌండేషన్‌తో కలిసి ఇండియన్ ఆర్మీ టెరిటోరియల్ సైబర్ క్వెస్ట్ 2026ను నిర్వహిస్తోంది. సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాంకేతిక రంగాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులు, సైబర్ నిపుణులు, పరిశోధకులు, ఇన్నోవేటర్లు ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఆసక్తి ఉన్న వారు ఆగస్టు 20లోగా అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. ఈ పోటీ ద్వారా దేశంలో సైబర్ భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు, కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వాలని భారత సైన్యం లక్ష్యంగా పెట్టుకుంది.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు గడువు చివరి తేదీ: ఆగస్టు 20, 2026 వరకు
ఆన్‌లైన్ షార్ట్‌లిస్టింగ్: సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు
గ్రాండ్ ఫినాలే: అక్టోబర్ 6 నుంచి 8 వరకు
అవార్డుల ప్రదానోత్సవం: అక్టోబర్ 9న న్యూఢిల్లీలో
పోటీ ఎలా ఉంటుంది?
మొదట ఆన్‌లైన్‌లో క్యాప్చర్ ది ఫ్లాగ్ (CTF) పోటీ నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైన జట్లు న్యూఢిల్లీలో జరిగే 36 గంటల గ్రాండ్ ఫినాలేలో పాల్గొంటాయి. ఫైనల్‌లో జట్లు భారత సైన్యం రూపొందించిన ప్రత్యేక సైబర్ వాతావరణంలో లోపాలను గుర్తించి, వాటికి పరిష్కారాలను సూచించాలి. అలాగే గుర్తించిన బలహీనతలను నమోదు చేసి తమ సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలను ప్రదర్శించాలి.
ఎవరు పాల్గొనవచ్చు?
విద్యార్థులు
సైబర్ సెక్యూరిటీ నిపుణులు
ఎథికల్ హ్యాకర్లు
పరిశోధకులు
సాయుధ దళాల సిబ్బంది
టెక్నాలజీ రంగంపై ఆసక్తి ఉన్నవారు
ప్రతి జట్టులో గరిష్టంగా ముగ్గురు సభ్యులు ఉండవచ్చు.
విజేతలకు ఏమి లభిస్తుంది?
ఫైనలిస్టులకు నగదు బహుమతులు, పతకాలు, సర్టిఫికెట్లు అందజేస్తారు. అలాగే భారత సైన్యంలోని ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యే అవకాశం ఉంటుంది. ప్రముఖ రక్షణ సంస్థలను సందర్శించే అవకాశం కూడా కల్పిస్తారు.
భారత సైన్యంతో కలిసి పనిచేసే అవకాశం
ఈ పోటీలో ప్రతిభ కనబరిచిన వారికి టెరిటోరియల్ ఆర్మీతో కలిసి పనిచేసే అవకాశం లభించవచ్చు. రక్షణ రంగ నిపుణులతో కలిసి పనిచేస్తూ దేశ సైబర్ భద్రతకు తమ వంతు సహకారం అందించే అవకాశాన్ని ఈ పోటీ కల్పిస్తోంది.
సైబర్ భద్రతకు జాతీయ వేదిక
ఇండియన్ ఆర్మీ టెరిటోరియల్ సైబర్ క్వెస్ట్ 2026 అనేది సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక రక్షణ సాంకేతికతలకు సంబంధించిన జాతీయ స్థాయి పోటీ. గత ఎడిషన్ల విజయాన్ని కొనసాగిస్తూ, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను ఒకే వేదికపైకి తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశం.
Also Read:
జెన్-జీ దేశ వ్యతిరేకులు కాదు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్..
UPI చెల్లింపులపై ఛార్జీలు.. బిల్లుకు లోక్‌సభ ఆమోదం