ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలతోనే బలమైన పునాది
ABN , Publish Date - Nov 02 , 2026 | 05:57 AM
ఐఐటీ-జేఈఈ, నీట్, సీయూఈటీ, ఐపీమ్యాట్, సివిల్స్ సహా పలు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల్లో ఒక సాధారణ అపోహ ఉంది. మంచి ర్యాంకు రావాలంటే...
ఐఐటీ-జేఈఈ, నీట్, సీయూఈటీ, ఐపీమ్యాట్, సివిల్స్ సహా పలు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల్లో ఒక సాధారణ అపోహ ఉంది. మంచి ర్యాంకు రావాలంటే ఖరీదైన కోచింగ్, రిఫరెన్స్ పుస్తకాలు, వేర్వేరు స్టడీ మెటీరియల్స్ తప్పనిసరి అనుకొంటారు. అయితే వాస్తవం వేరు. ఈ ప్రయాణంలో ప్రాథమిక పునాది బలంగా పడేందుకు అవసరమైనవి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు. వీటిని విస్తృతంగా చదవాలి, లోతుగా అర్థం చేసుకోవాలి.
మన దేశంలోని పలు రాష్ట్రాలు దేనికదిగా తమవైన సిలబస్‌ను పాటిస్తాయి. ఇంజనీరింగ్, మెడిసిన్ సహా వివిధ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే పోటీ పరీక్షలు జాతీయ స్థాయిలో ఉంటాయి. ఈ నేపథ్యంలో అందరికీ ఎంతో కొంత పరిచయం ఉన్న ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవడం ఆరంభమైంది. గడచిన దశాబ్ధంలో ఈ ఒరవడి మరింత బలపడింది.
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను కేవలం పరీక్షకు ముందు చదివేవి అనుకోకూడదు. ఎనిమిదో తరగతి నుంచే ఈ పుస్తకాలను అధ్యయనం చేస్తే శాస్త్రీయ ఆలోచన విధానానికి తోడు విశ్లేషణాత్మకంగా విషయ సంగ్రహణ సాధ్యమవుతుంది. అదే విద్యార్థి పునాదిని పటిష్టపరుస్తుంది.
నిజానికి పోటీ పరీక్షల్లో విజయమనేది ఏ ఒక్క ఏడాది కృషితో జరిగే పని కానేకాదు. అనేకానేక సంవత్సరాల ఫౌండేషన్ ఫలితమది. అందుకు కనీసం ఎనిమిదో తరగతి నుంచే ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను ఫాలో కావాలి. తద్వారా కొత్త పదాలు వాటి అర్థాలు తెలుస్తాయి. సినానిమ్స్, ముఖ్యమైన నిర్వచనాలను రాసుకోవాలి. షార్ట్ నోట్స్‌ను ప్రిపేర్ చేసుకోవాలి. డయాగ్రమ్స్, టేబుల్స్ తయారు చేసుకోవాలి. అర్థం చేసుకోవడమే కాదు, ఎందుకు అని ప్రశ్నించుకోవాలి. ఆపై సమాధానాన్ని తెలుసుకుని విశ్లేషించుకుంటే తదుపరి దశలో ప్రిపరేషన్ సులువు అవుతుందని గ్రహించాలి.
జేఈఈ లేదా నీట్‌లో ఫిజిక్స్‌కు సంబంధించి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ఇచ్చిన కాన్సెప్టులు అర్థం చేసుకుంటే, న్యూమరికల్ ప్రాబ్లెమ్స్‌ను సాల్వ్ చేసేందుకు బలమైన పునాది ఏర్పడుతుంది. థియరీ బేస్డ్ కాన్సెప్ట్స్ అయిన మోడ్రన్ ఫిజిక్స్, ఆప్టిక్స్, ప్రాపర్టీస్ ఆఫ్ మేటర్, యూనిట్స్ లాంటి చాప్టర్స్‌లో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచే డైరెక్ట్ ప్రశ్నలు రావచ్చు. ఫిజిక్స్‌కు సంబంధించినంతవరకు ఎన్‌సీఈఆర్‌టీ పఠనం - క్లాస్ రూమ్ లెర్నింగ్ - వర్క్‌బుక్ ప్రాక్టీస్ - న్యూమరికల్ ప్రశ్నలకు జవాబుల సాధన - మాక్ టెస్ట్ అనే విధానాన్ని అనుసరించి మంచి మార్కులను పొందవచ్చు.
కెమిస్ట్రీలో ముఖ్యంగా ఇనార్గానిక్ విభాగాల్లో రియాక్షన్స్, ప్రాపర్టీస్, ట్రెండ్స్, ఎక్సెప్షన్ వంటివి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచే అడుగుతున్నారు.
నీట్ బయాలజీలో ఫ్యాక్ట్స్ మొదలుకుని డెఫినిషన్స్, డయాగ్రమ్స్, ప్రాసిస్ లాంటి విషయాల్లో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ప్రతి లైన్ చదవాల్సిందే.
సివిల్స్- సీశాట్‌లో ఎక్కువ ప్రశ్నలు ఎన్‌సీఈఆర్‌టీకి చెందిన ఆరు నుంచి పన్నెండో తరగతి పుస్తకాల నుంచే వస్తాయి. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్, సైన్స్ వంటి సబ్జెక్టులకు సంబంధించి ప్రిపరేషన్‌కు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలే పునాది.
క్లాట్‌లో రీడింగ్ కాంప్రహెన్షన్, ఒకాబులరీ; ఐపీమ్యాట్‌లో ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ లాంటి విషయాల కోసం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను చదివితేనే ప్రాథమిక అవగాహన లభిస్తుంది.
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను చదివిన తదుపరి దశ ప్రాక్టీస్, కాన్సెప్ట్‌ను తెలుసుకోవడం ఒక ఎత్తు. ఆ విషయాలను ప్రశ్నకు సమాధానంగా అప్లయ్ చేయడం మరో ఎత్తు. దీనికి వర్క్‌బుక్స్ తోడ్పడతాయి. ఒక మంచి వర్క్‌బుక్‌లో బేసిక్, కాన్సెప్ట్యుల్, అప్లికేషన్ ఆధారిత, అసర్షెన్- రీజనింగ్, మేట్రిక్స్ మ్యాచింగ్ సహా క్లిష్టమైన ప్రశ్నలు అన్నీ లభిస్తాయి.
ప్రిపరేషన్ ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్‌సైట్‌లో ఉన్న మాక్ టెస్టులను ప్రాక్టీస్ చేయాలి. పరీక్ష పూర్తయిన వెంటనే జరిగిన తప్పులను విశ్లేషించుకోవాలి. కాన్సెప్ట్యుల్ మొదలుకుని కాలిక్యులేషన్స్, రీడింగ్, క్వశ్చన్, సిల్లీ మిస్టేక్స్, టైమ్ మేనేజ్‌మెంట్ వరకు ప్రతి ఒక్కదానిపై విశ్లేషించుకోవాలి. మిస్టేక్స్‌ను తగ్గించుకోవడమే మాక్ టెస్టుల లక్ష్యం కావాలి.
ప్రత్యేకతలు
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో కాన్సెప్టులు నిష్పక్షపాత పద్ధతిలో ముక్కుసూటిగా ఉంటాయి.
సబ్జెక్టు నిపుణులు, విద్యావేత్తలు కలిసి ఆ పుస్తకాలను డిజైన్ చేస్తారు. నిర్వచనాలు, వివరణలు స్పష్టంగా ఉంటాయి.
ఒకటి తరవాత మరొకటి తెలుసుకునేలా టాపిక్స్ తార్కిక పద్ధతిలో అమరి ఉంటాయి.
రియల్ లైఫ్ ఉదాహరణలు ఉంటాయి. దాంతో నేర్చుకున్నవి కలకాలం గుర్తుంటాయి.
ప్రశ్నకు అలాగే సందర్భానికి తగ్గట్టు మెరుగైన సమాధానాలు రాసే వీలు కల్పిస్తాయి.
ఆ పుస్తకాల్లో ఉపయోగించే భాష అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. మ్యాప్‌లు, చార్టులు అదనం.
ప్రతి చాప్టర్ కింద సమ్మరీలు సంక్షిప్తంగా ఉంటాయి.
ఫండమెంటల్స్ కోసం పాత ఎడిషన్లు, అప్డేషన్ కోసం కొత్త ఎడిషన్లు చదివితే చాలు.
కరెంట్ అఫైర్స్ కోసం క్రాస్ చెక్ చేసుకోవడం తప్పనిసరి. అందుకు అప్డేట్స్‌తో నోట్స్ అవసరం.
టాపిక్ ఏదైనప్పటికీ సమగ్రంగా ఉంటుంది. దాంతో తొందరగా రివిజన్ చేసుకోవచ్చు.
టీచర్ చెప్పిన తరవాత, తరగతి గదిలో వాటిపై చర్చించుకుంటే విషయం బాగా అర్థమవుతుంది. ఇంకోసారి చదువుకుంటే పూర్తిగా పట్టు లభిస్తుంది.
పైపైన కాకుండా లోతుగా అర్థం చేసుకుంటూ చదివితే కలకాలం గుర్తుంటుంది.
సబ్జెక్ట్ నిపుణుల సలహా కూడా తీసుకుంటే మరింత బాగా నేర్చుకునే వీలు ఉంటుంది.
డాక్టర్ పవన్ కాసు,
ఎక్స్‌లెన్సియా, హైదరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి
ఓట్‌చోరీపై రాంలీలా మైదాన్‌లో పోరాటం చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
ఫంక్షన్‌కు వెళ్లి వచ్చేసరికి.. ఇంట్లో 29 తులాల బంగారం మాయం