Share News

వ్యవస్థలో మార్పు మనిషి పరివర్తనకు హామీ ఇవ్వదు

ABN , Publish Date - Sep 10 , 2026 | 03:06 AM

‘స్వార్థం వీడితేనే సామాజిక విప్లవం’ పేరుతో నేను రాసిన వ్యాసానికి (17.07.2026) స్పందిస్తూ రంగనాయకమ్మ ‘ఏది స్వార్థం? ఎవరిది స్వార్థం?’ పేరుతో వ్యాసం (16.08.2026) రాశారు. నా వ్యాసంలోని కొన్ని...

వ్యవస్థలో మార్పు మనిషి పరివర్తనకు హామీ ఇవ్వదు

‘స్వార్థం వీడితేనే సామాజిక విప్లవం’ పేరుతో నేను రాసిన వ్యాసానికి (17.07.2026) స్పందిస్తూ రంగనాయకమ్మ ‘ఏది స్వార్థం? ఎవరిది స్వార్థం?’ పేరుతో వ్యాసం (16.08.2026) రాశారు. నా వ్యాసంలోని కొన్ని ప్రశ్నలను ఐదు అంశాలుగా విడదీసి సమాధానం ఇచ్చారు. వారు లేవనెత్తిన ప్రతి అంశానికీ విడివిడిగా సమాధానం చెప్పడం కంటే ఆ ఐదు ప్రశ్నల వెనక ఉన్న ఒకే కేంద్ర భావాన్ని మరోసారి పరిశీలించడం అవసరం.

సమాజాన్ని మార్చాలంటే ముందుగా సమాజాన్ని నిర్మించే సంబంధాలను అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో మార్క్స్ విశ్లేషణకు ప్రత్యామ్నాయం వెతకాల్సిన అవసరం లేదు. శ్రమ, ఉత్పత్తి, ఆస్తి, వర్గ సంబంధాలు మనిషి జీవితాన్ని నిర్ణయాత్మకంగా ప్రభావితం చేస్తాయన్నది చారిత్రక వాస్తవం. కానీ ఇక్కడే మరో ప్రశ్న– సమాజాన్ని నిర్మించే సంబంధాలను మార్చిన తర్వాత ఆ సంబంధాల్లో జీవించిన మనిషి కూడా అంతే వేగంగా మారిపోతాడా? ఒక వ్యవస్థను మార్చడం ఆ వ్యవస్థలో ఏర్పడిన మనస్తత్వాన్ని మార్చడం ఒకటేనా? ఈ ప్రశ్న మార్క్స్‌ను తిరస్కరించేది కాదు.

బుద్ధుడు దుఃఖాన్ని చూశాడు. అంబేడ్కర్‌ కులాధిపత్యాన్ని సవాలు చేశాడు. మార్క్స్ దోపిడీకి పునాదిగా ఉన్న వర్గ సంబంధాలను విశ్లేషించాడు. ముగ్గురి మార్గాలు వేరైనప్పటికీ వారిని కలిపే ఉమ్మడి తాత్విక ఆందోళన ఉంది: మనిషిని నిర్దేశించే పరిస్థితులను, అతని ప్రవర్తనను రూపొందించే సామాజిక సంబంధాలను ప్రశ్నించడం. కానీ విముక్తి కోసం పుట్టిన ఆలోచనను కూడా మనిషి తన స్వార్థానికి ఎందుకు ఉపయోగించుకుంటాడు? ఈ ప్రశ్నకు సమాధానం సిద్ధాంతంలో మాత్రమే కాదు. ఆ సిద్ధాంతాన్ని స్వీకరించే మానవ ప్రవృత్తిలో కూడా వెతకాలి. ఆ ఆలోచన స్వీకరించిన మనిషి తనలోని అధికార ప్రవృత్తిని కూడా ప్రశ్నించగలడా? మానవ వైరుధ్యం (human paradox) మొదలయ్యేది ఇక్కడే. అందుకే ‘మనిషి మార్పు’ అనే ప్రశ్నను కేవలం నైతిక ఉపదేశంగా చూడలేం. అది ఒక మానసిక ప్రశ్న (psychological question). ఒక వ్యక్తి సమానత్వాన్ని ప్రకటిస్తూనే ఇంట్లో స్త్రీపై ఆధిపత్యాన్ని కొనసాగించవచ్చు. కులాధిపత్యాన్ని వ్యతిరేకిస్తూనే వ్యక్తిగత సంబంధాల్లో మరో రూపంలో ఆ ఆధిపత్యాన్ని కొనసాగించవచ్చు. అది అతను చెప్పే సిద్ధాంతాన్ని తప్పు అని నిరూపించదు; కానీ ఆ సిద్ధాంతాన్ని చెప్పడం, దాన్ని తన ప్రవర్తనలోకి తీసుకురావడం ఒకటే కాదని మాత్రం చూపిస్తుంది.

మార్క్స్ పెట్టుబడిని కేవలం వ్యక్తిగత దురాశగా కాకుండా సజీవశ్రమను స్వాధీనం చేసుకునే సామాజిక సంబంధంగా విశ్లేషించారు. కాబట్టి దోపిడీ నిర్మాణాన్ని మార్చడం అవసరమే. కానీ దోపిడీ చేసే వర్గం ఏదీ, దోపిడీకి గురయ్యే వర్గం ఏదీ అని గుర్తించిన తర్వాత దాని స్థానంలో కొత్త ఆధిపత్యం ఏర్పడకుండా ఎలా చూడాలన్నది మరో ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఆర్థిక నిర్మాణం నుంచి మానవ మనస్తత్వం వైపు చూడాల్సి వస్తుంది.


ఆధిపత్యం ఎప్పుడూ బయట నుంచి మాత్రమే మనిషిని నియంత్రించదు. కొన్నిసార్లు అది అతని అంతరంగంలోకి ప్రవేశించి అతని ప్రవర్తనలోనే స్థానం సంపాదిస్తుంది. తీవ్రమైన అణచివేత, భయం, అభద్రతా భావాలను ఎదుర్కొన్న వ్యక్తి కొన్ని సందర్భాల్లో తెలియకుండానే తాను ఎదుర్కొన్న అధికార భాషను, ఆధిపత్య పద్ధతులను అనుకరించవచ్చు. ఒక వ్యక్తి చాలాకాలం అణచివేతను అనుభవించినప్పటికీ అతను స్వయం చాలకంగా నైతిక పాలకుడిగా మారడు. తాను కోరుకున్న విముక్తి భాషను కాకుండా, తాను చూసిన అధికార భాషను పునరుత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. సైకో ఎనాలసిస్‌లో ‘దాడి చేసేవాడితో తాదాత్మ్యం’ (identification with the aggressor) అనే భావన ఈ మానసిక ప్రక్రియకు ఉదాహరణ. ఇక్కడే వ్యవస్థ మార్పుకు, మానవ మార్పుకు మధ్య ఖాళీ కనిపిస్తుంది.

తనలోని ఆధిపత్య నిర్మాణాన్ని ప్రశ్నించని మనిషి పాత అధికార సంబంధాలను కొనసాగించగలడు. తన స్వార్థాన్ని సామాజిక ప్రయోజనంగా, తన ఆధిపత్యాన్ని క్రమశిక్షణగా, తన అధికారాన్ని విముక్తి అవసరంగా సమర్థించుకునే మానసిక ప్రక్రియను కూడా మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. వ్యవస్థలో మార్పు మనిషి అంతర్గత మార్పుకు హామీ ఇవ్వదు. ఒక విప్లవం ఆర్థిక వ్యవస్థను మార్చగలిగినా, దాన్ని నడిపే మనిషి తనలోని పాత మానసిక నిర్మాణాలను మార్చుకోకపోతే ఆధిపత్యం రూపాన్ని మాత్రమే మార్చుకొని తిరిగి రావచ్చు. కాబట్టి ప్రశ్న– మార్క్స్ సరా? కాదా? అన్నది కాదు. శ్రమ సంబంధాలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని అంగీకరించిన తర్వాత కూడా, మనిషి వాటిని ఎలా అనుభవిస్తాడు, వాటికి ఎలా ప్రతిస్పందిస్తాడు, వాటి నుంచి నేర్చుకునే విలువలను తన ప్రవర్తనలో ఎలా మలచుకుంటాడు అన్నది కూడా అధ్యయనం చేయాల్సిందే.

ఆయిరబోయిన బిక్షపతి

ఈ వార్తలు కూడా చదవండి..

గొడ్డలి పార్టీ దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించొద్దు: సీఎం చంద్రబాబు

హస్తకళలను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించేలా చర్యలు: పవన్ కల్యాణ్

నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలి: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 10 , 2026 | 03:06 AM