విద్యార్థుల ఆత్మహత్యల నివారణ మన బాధ్యత
ABN , Publish Date - Sep 10 , 2026 | 03:09 AM
జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన ‘యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా’ నివేదిక మన విద్యావ్యవస్థలోని లోపాలను, సమాజపు బాధ్యతా రాహిత్యాన్ని స్పష్టంగా కళ్లకు...
జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన ‘యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా’ నివేదిక మన విద్యావ్యవస్థలోని లోపాలను, సమాజపు బాధ్యతా రాహిత్యాన్ని స్పష్టంగా కళ్లకు కడుతోంది. 2024లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 14,488 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంటే, సగటున రోజుకు సుమారు 40 మంది విద్యార్థులు తమ ప్రాణాలను తీసుకుంటున్నారన్నమాట. దేశంలో నమోదైన మొత్తం ఆత్మహత్యల్లో విద్యార్థుల వాటా 8.5శాతానికి చేరింది. కోవిడ్ సమయంతో పోలిస్తే ఈ ఆత్మహత్యల సంఖ్య 15.7శాతం మేర పెరగడం కలవరపెట్టే అంశం. ముఖ్యంగా విద్యాపరమైన పోటీ ఎక్కువగా ఉండే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ రేటు క్రమంగా పెరుగుతూ వస్తోంది. తెలంగాణలో జాతీయ సగటు (12.3) కన్నా అత్యధికంగా లక్ష జనాభాకు 27.7గా ఆత్మహత్యల రేటు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో గత పుష్కరకాలంగా ఇది సుమారు 13.4 శాతంగా నమోదవుతూ వస్తోంది. కార్పొరేట్ విద్యాసంస్థలు కేంద్రీకృతమైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో ఈ ముప్పు మరీ అధికంగా ఉంది.
దేశంలోనే అతిపెద్ద కోచింగ్ హబ్‌గా పేరొందిన రాజస్థాన్‌లోని కోట లాంటి నగరాల్లో ఐఐటీ, జేఈఈ, నీట్ ఆశావహులపై జరిగిన ఓ అధ్యయనం విస్తుపోయే నిజాలను వెల్లడించింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల్లో ఏకంగా 81శాతం మంది 15 నుంచి 20 ఏళ్ల లోపు వారే. వైఫల్యం పట్ల వారి మనసుల్లో గూడుకట్టుకున్న తీవ్రమైన భయమే వారి ప్రాణాల మీదకు తెస్తోంది. అలాగే, మైనర్ల ఆత్మహత్యలపై ‘సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్ లా అండ్ పాలసీ’ చేసిన విశ్లేషణ, అకడమిక్ ప్రెజర్‌తో పాటు క్యాంపస్‌లలో తోటి విద్యార్థుల నుంచి ఎదురయ్యే వివక్ష, అవమానాలు వంటి సామాజిక అంశాలు పిల్లలను తీవ్ర కుంగుబాటుకు గురిచేస్తున్నాయని స్పష్టం చేసింది.
ఈ విపత్తును సమూలంగా అరికట్టాలంటే బహుముఖ, సమగ్రమైన నివారణ చర్యలు అవసరం. ప్రతీ పాఠశాల, కళాశాలలో తప్పనిసరిగా సర్టిఫైడ్ సైకలాజికల్ కౌన్సిలర్లను నియమించి తీరాలి. తరగతి గదుల్లో కేవలం సైన్స్, మ్యాథ్స్ మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యం, జీవన నైపుణ్యాలపై ఒక ప్రత్యేక సబ్జెక్టును ప్రవేశపెట్టాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతరులతో పోల్చడం మానేయాలి. ఫలితాన్ని కాకుండా, వారు పడుతున్న శ్రమను, ప్రయత్నాన్ని అభినందించేలా తల్లిదండ్రులకు ‘పేరెంటింగ్ వర్క్‌షాప్’లు నిర్వహించాలి. ఉపాధ్యాయులు సైతం తరగతి గదిలో భయరహిత వాతావరణం కల్పించి, విద్యార్థుల్లోని బలాలు (కళలు, క్రీడలు, నాయకత్వ లక్షణాలు) గుర్తించి ప్రోత్సహించాలి. విద్యార్థులకు వాస్తవికత లేని, సామర్థ్యానికి మించిన లక్ష్యాలను నిర్దేశించకూడదు. ‘జీవితంలో గెలవడమే కాదు, అప్పుడప్పుడూ ఓడిపోవడం కూడా సహజమే’ అని, ఓటమిని హుందాగా అంగీకరించే అపారమైన మనోబలాన్ని పిల్లలకు చిన్నప్పటి నుంచే నూరిపోయాలి. ‘మార్కులు జీవితాన్ని నిర్దేశించవు.. ఓటమి శాశ్వతం కాదు’ అని వివరించాలి.
పిల్లలకు మనం ఇవ్వాల్సింది ‘నువ్వు కచ్చితంగా సాధించి తీరాలి’ అనే భయానకమైన ఒత్తిడి కాదు... ‘నువ్వు ఓడిపోయినా, ఎట్టి పరిస్థితుల్లోనూ మేము నీకు అండగా ఉన్నాము’ అనే ప్రేమ, కొండంత భరోసా. సజీవంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్న విద్యార్థులతోనే నవభారత నిర్మాణం సాధ్యమవుతుంది.
వనగంటి నవీన్‌కుమార్
(నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం)
ఈ వార్తలు కూడా చదవండి..
గొడ్డలి పార్టీ దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించొద్దు: సీఎం చంద్రబాబు
హస్తకళలను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించేలా చర్యలు: పవన్ కల్యాణ్
నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలి: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News